పవిత్ర బంధం

పవిత్ర బంధం

రచన ::రేఖ కొండేటి

“మైత్రీ! నువ్వన్నట్టే చదివించాం, నీ కోరిక మేరకు ఉద్యోగం చెయ్యనిచ్చాం. ఇకనైనా పెళ్ళి చేస్కో” అమ్మ మాట కరుగ్గా ఉండే సరికి ఏం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయాను. ఎప్పటిలానే నా మౌనం చూసి ఏం చేయ్యలేక వెళ్ళిపోయారు అమ్మా నాన్న. 

అమ్మానాన్న మాటల మధ్య కొన్ని రోజులు గడిచిపోయాయి. అయినా నేను పెళ్ళి పట్ల ఆసక్తి చూపించకపోవడంతో అడగకూడదు అనుకుంటూనే అడిగింది అమ్మ.. 

“ఎవరినైనా ప్రేమించావా?” అని. 

“అమ్మా! నేనింకా పెళ్ళికి సిద్ధంగా లేను. పెళ్ళి మీద అభిప్రాయం లేకుండా నేనెలా చేసుకోను? అప్పుడే పెళ్ళి వద్దంటే ఇప్పుడు వద్దని మాత్రమే. మీరనుకున్నట్టు ఏం లేదు” అంటూ వీలైనంత సున్నితంగా చెప్పి వెళ్ళిపోయాను. కానీ, బంధువుల సూటి పోటీ మాటల ముందు, నా తల్లిదండ్రుల నిర్ణయం ముందు నా మాట నిలబడలేకపోయింది. నాలుగు నెలలు తిరక్కముందే నా పేరు వెనక మరో పేరు చేరి మైత్రి రాజశేఖర్ గా మారిపోయాను. 

భయం భయంగా పెళ్ళి చేసుకున్నా, పెళ్ళైయ్యాక ఆ భయం పోయింది, కాదు ఆయనే పోయేలా చేశారు. పెళ్ళైతే ఎలా ఉంటుందో? అనుకున్న నాకు, వివాహ బంధం ఇంత మధురంగా ఉంటుందా? అని తెలిసేలా చేశారు.పెళ్లయ్యాక అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుందంటారు కానీ, అది పూర్తిగా తప్పు. పెళ్ళి వల్ల అమ్మాయి జీవితం మారదు ఆమె జీవితంలోకి వచ్చే వ్యక్తి వల్ల మారుతుందని నాకప్పుడు అర్ధమైంది.

పెళ్ళి అయ్యాక, ఆయన నాకేమి రూల్స్ పెట్టలేదు. పెళ్ళికి ముందెలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉండచ్చని చెప్పారు. ఆయన మాట ప్రకారమే నా ఉద్యోగం నా చేతుల్లోనే ఉంది. ఇప్పటికీ కూడా నా సాలరీ లో కొంత భాగం నా పుట్టింటికి వెళ్తుంది. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వారిదగ్గరకు తీసుకెళ్ళి తీసుకొస్తారు. 

కొత్తగా వివాహ బంధంలోకి అడుగు పెట్టి, ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం నాదే అని ఆనందంలో మునిగి ఉన్న నా జీవితంలోకి విషాదం రావడానికి పెద్దగా సమయం పట్టలేదు. 

ఓరోజు ఉదయమే నేను లేచేసరికి ఓ చేదు వార్త నన్ను పలకరించింది. ఉద్యోగం పని మీద క్యాంప్ కు వెళ్ళి తిరిగొస్తున్న ఆయనకి ఆక్సిడెంట్ జరిగిందని. ఆ వార్త వినగానే చాలా బెంబేలెత్తి పోయాను. కానీ అత్తయ్య వాళ్ళు పెద్దవాళ్ళు. నేను కంగారు పడితే  వాళ్ళంతా ఇంకా భయపడిపోతారు. అందుకే మెల్లిగా విషయం చెప్పి హాస్పిటల్ కి బయలుదేరాం. మేము వెళ్ళేసరికే అమ్మ వాళ్ళు వచ్చేసారు. 

“ఆశలు పెట్టుకోకండి, మా ప్రయత్నం మేము చేస్తాము” డాక్టర్ అలా అనేసరికి చాలా భయపడ్డాం కానీ బ్రతకరనుకున్న మనిషి బ్రతికారు కానీ, జీవితాంతం మంచానికే పరిమితం అని చెప్పారు. ఆ మాట వినగానే అమ్మ వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. నాకు మాత్రం మనసులో ఎదో మూల ఆనందం ఆయన ప్రాణాలతో ఉన్నారని. హాస్పిటల్ బిల్ కోసం మా నాన్న ఇచ్చిన పొలమే కాక, మా ఇద్దరి సేవింగ్స్ అయిపోయాయి. ఇంటిని నడపాలి అంటే నేను కచ్చితంగా ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి.

ఆయన ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు, అంతా బావుంది అనుకున్న సమయంలో అమ్మ వాళ్ళ దగ్గరి నుండి ఊహించని షాక్.. 

“మైత్రీ అలాంటి అబ్బాయితో ఇంకేం ఉండగలవు? వచ్చేయ్ రా! మన ఇంటికి. నీకేం వయసు అయిపోలేదు, ఇంకా పిల్లలు లేరు కాబట్టి మరో పెళ్ళి చేసేస్తాం” నాన్న అనగానే ఏం మాట్లాడాలో తెలీలేదు. నాన్న మాటకి అమ్మ వంత పాడటం ఇంకా బాధగా అనిపించింది.

“నాన్నా! మీరేం చెప్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అతను నాకు తాళి కట్టిన భర్త, వేరేవరో కాదు వదిలేసి వచ్చెయ్యడానికి! ఇప్పుడు నా అవసరం మా ఇంటికి చాలా ఉంది. ఇలాంటి సమయంలో నా బాద్యతను నెరవేర్చడంలో నాకు మీరు సహాయం చెయ్యాల్సింది పోయి ఇలా…”

“చూడు మైత్రీ! అతను నీకు భర్తే కావచ్చు కానీ, నువ్వు మాకు కూతురివి! నీ జీవితం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మాకుంది అర్ధమైందా?! వచ్చేయ్ మన ఇంటికి. నీకేం పట్టలేదు ఇలా జీవితాంతం సేవలు చేసుకోడానికి.. డివోర్స్ కి అప్లై చేద్దాం, అవి రాగానే ఈ పీడ పోతుంది ఈలోవు మరో సంబంధం చూసి పెడతాము. వెంటనే పెళ్ళి అర్ధమైందా పదా మన ఇంటికి” 

“ఏంటమ్మా అన్నావు? పీడా? అంటే ఏంటమ్మా? ఆయన పీడ అయితే మరీ ఇన్నాళ్లు ఆయనతో కాపురం చేసిన నీ కూతురు ఏమవుతుంది?! 

మీరేంటి నాన్న? ఈరోజు ఇలా కొత్తగా? వదిలొచ్చెయ్యమనే మాట మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారు కానీ దానికుండే బరువు నేను మోయలేక పోతున్నాను. ఆయన నా భర్త నాన్నా. ఇన్నాళ్ళు బాగానే ఉన్నాముగా? మమ్మల్ని చూసి మీరూ సంతోషపడ్డారుగా? ఇప్పుడేదో పరిస్థితులు మారిపోయాయని వదిలెయ్యాలా? ఇదెక్కడి న్యాయం నాన్న?”

“పరిస్థితులు ఇలా మారతాయని మాకు తెలీదు కదమ్మా?! అందుకే పెళ్ళి చేసాం. ఇప్పుడు వద్దు అంటున్నాం. మేము చెప్పేది కూడా నీ సంతోషం గురించే”

“సంతోషమా? సంతోషం అనేది మనసుకి నచ్చిన వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు వస్తుంది కానీ, ఇలా ఆప్షన్స్ వెతుకుతున్నప్పుడు కాదు. పెళ్ళి వద్దు అంటే నా మాట వినకుండా చేశారు, ఇప్పుడు వదిలేసి వచ్చేయమంటున్నారు. అంతా మీ ఇష్టమేనా? పెళ్లికి ముందు మీ కూతురు ఎవరినైనా ప్రేమిస్తే అది మీకు తప్పు కానీ, పెళ్ళి అయ్యాక భర్తని వదిలేసి వచ్చెయ్యడం మీకు ఒప్పు అంతేనా? 

సీతమ్మ తల్లిని అడక్కుండానే, రాముడు తండ్రికి మాట ఇస్తే భర్త మాటని తన మాటగా చేసుకుని భర్త వెంటే నడిచిందా తల్లి. పెళ్ళి అనగానే వాళ్ళ బంధాన్నే ఆదర్శంగా చూపిస్తారు కదా?! వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తూ కొలుస్తున్నాం కదా?! కానీ అదే మూడు మూళ్ళ బంధానికి నేను విలువిస్తే అది మీ దృష్టిలో నేరం అంతేనా? ఆ దేవుడు మానవ రూపం దాల్చింది మనిషి ఎలా బ్రతకాలో మనకి చెప్పడానికి! ఏ బంధం ఎంత గొప్పదో మనకి తెలియపర్చడానికి. కానీ వారంతా గొప్పగా మనం బంధాల్ని గౌరవించి,  బ్రతకలేకపోవచ్చు కానీ మన చేతుల్లో ఉన్నవి నాశనం చెయ్యకుండా ఉంటే చాలు’

“అయితే ఇప్పుడేమంటావ్?” నాన్న సూటిగా చూస్తూ అన్నారు..

“రానంటాను. నా అవసరం ఈ ఇంటికి చాలా ఉంది. కష్ట సమయంలో తోడుగా ఉంటానని నా భర్తకి మాటిచ్చాను. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను.”

“అయితే సరే. నువ్విక్కడే ఉంటే ఇదే ఆఖరు. ఇక నిన్ను కలిసేదిలేదు ,నీ మొహం చూసేది లేదు” నాన్న తెగేసి చెప్పారు.

ఆ మాటకి బాధేసింది కానీ, దాన్ని కప్పిపుచ్చి “సరే అమ్మా! మీతో వచ్చేస్తాను కానీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాకా అలానే వస్తాను” అన్నాను.

“ఏంటో అడుగు”

“ఇలా అనోచ్చో లేదో నాకు తెలీదు కానీ, అడగక తప్పట్లేదు. ఒకవేళ నాన్నకి ఇదే పరిస్థితి వచ్చి ఉంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోయేదానివా? వేరే పెళ్ళి చేసుకునేదానివా? ‘అవును’ అని ఒక్కమాట చెప్పమ్మా! ఇప్పుడే లగేజ్ సర్దుకుని వచ్చేస్తా”

“ఇక పోతే నాన్న మీరు.. మరో పెళ్ళి, మరో పెళ్ళి అంటున్నారే? అందులో కూడా ఏదైనా జరిగితే? అప్పుడు ఇంకో పెళ్ళి చేస్తారా నాన్న? ఇలా పరిస్థితులను కాదని వాటి నుండి పారిపోయి నాకు ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తారు? ఒక కూతురు తండ్రితో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే బావుండదేమో నాన్న.” అంటూ ఏడుస్తూ వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాను.

నా మాటలకి వారిద్దరి దగ్గర సమాధానం లేదన్నట్టుగా మౌనంగా ఉండిపోయారు.

“అమ్మా! భర్తని ఎలా చూసుకోవాలి? అతన్ని ఎలా గౌరవించాలి? ఇవన్నీ కూడా నీ దగ్గరే నేర్చుకున్నాను అమ్మ. ఇప్పుడు మీతో వచ్చేసి మీ పెంపకానికి మచ్చ తీసుకురాలేను. చావైనా బ్రతుకైనా నా మెళ్ళో తాళి కట్టిన వాడితోనే. మీ కూతుర్ని చూడాలి అనిపిస్తే మీరెప్పుడైనా మా ఇంటికి రావచ్చు కానీ, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు మారే వరకు నేను మన ఇంటికి మాత్రం రాను.”

“అయితే కొద్దిరోజుల్లోనే నువ్వు మన ఇంటికి వచ్చే రోజు వస్తుందమ్మా! జాగ్రత్త. అని చెప్పి నా తల నిమిరి వెళ్ళిపోయారు అమ్మానాన్న. వాళ్ళు అటు వెళ్ళగానే ఆయన ఉన్న గదికి వెళ్ళాను. మా మాటలు అన్ని ఆయనకి వినబడ్డాయి అని చెప్పడానికి గుర్తుగా ఆయన కన్నీళ్లు మంచాన్ని తడుపుతున్నాయి కానీ, అవి ఆనంద భాష్పాలని తెలియడానికి నాకెంతో సమయం పట్టలేదు.

***

You May Also Like

2 thoughts on “పవిత్ర బంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!