అంశం : నేనో వస్తువుని
ప్రాణమున్న వస్తువు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సత్య ‘కామఋషి’
నాగరికత ముసుగులో,
ఆధునిక పోకడలను
హత్తుకొనీ..తలకెత్తుకునీ.,
హంగుల పొంగుల,
విలాసాల కులాసాల,
అట్టహాసాల ఆర్భాటాల,
ప్రేరాశల ప్రయాసలలో.,
‘మానవీ’యతను మరచి,
యంత్రాలలో యంత్రాన్నై.,
గ్యారంటీ లేని రేపటికై,
‘నిన్న’ను పెట్టుబడిగా,
‘నేటి’ ని ఫణంగా పెట్టి..,
నాకై నేను కాక, నాలో నేను లేక,
నాలోని ‘నేను’ నేను కాక.!
మిలమిల రంగు కాగితాలతో.,
నన్ను నేను తూచుకుంటూ.,
నాకు నేను వెలకట్టుకుంటూ.,
వెలవెలబోతూ సాగిపోయే.,
‘విలువలు’ మరచిన.,
ఏ ‘విలువలేని’ ఈ జీవితాన,
‘జీవం లేని’ మనిషినా.?
నేను ప్రాణమున్న వస్తువునా.!!
super