మంచి ఆలోచన

మంచి ఆలోచన
( తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కందర్ప మూర్తి

రిటైర్డ్ ఉద్యోగి మూర్తి గారు కారిడార్లో వాలు కుర్చీలో కూర్చుని తెలుగు దిన పత్రిక చదువుకుంటున్నారు.
ఆదివారం స్కూలుకి శలవు దినం కనక ఎనిమిదేళ్ల సాయి పరుగెత్తుకుంటూ వచ్చి తన చేతిలోని నల్లని గింజను తాతయ్యకి చూపించి “ఇదేమిటి తాతయ్యా?” అన్నాడు.
దిన పత్రికను పక్కన పెట్టి మూర్తి గారు మనవడి చేతిలోని నల్లని గింజను తన చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసి “దీన్ని పందిరి చిక్కుడు గింజ అంటారు. నీకు ఇదెక్కడ దొరికింది?” అన్నారు.
“కిచెన్లో నానమ్మ కూరలు కోసినప్పుడు ఇది కింద పడితే తీసుకు వచ్చాను” జవాబు చెప్పాడు సాయి.
“దీన్ని ఎండబెట్టి మట్టిలో పాతితే మొలక వచ్చి తీగ కట్టి చుట్టూ అల్లుకుని పువ్వులు పూసి తర్వాత పచ్చని కూర చిక్కుడుకాయలు కాస్తాయి” వివరంగా చెప్పారు తాతయ్య.
‘ఓ.. అలాగా?” అని అక్కడి నుంచి చిక్కుడు గింజతో వెళిపోయాడు సాయి.

కొద్ది రోజుల తర్వాత వాలుకుర్చీలో దినపత్రిక చదువుతున్న మూర్తి గారి దగ్గరకు పరుగెత్తుకుంటు వచ్చిన సాయి “తాతయ్యా ! నేను పువ్వుల మొక్కల దగ్గర మట్టిలో పాతిన చిక్కుడు గింజ పైకి మొలక వచ్చింది” అని ఆనందంగా చెప్పాడు.
దినపత్రికను కుర్చీలో ఉంచి మూర్తి తాతయ్య మనవడి వెంట చిక్కుడుమొక్కను చూడటానికి వచ్చారు.
నిజంగానే సాయి మట్టిలో పాతిన చిక్కుడుగింజ మొలకెత్తి ఆకులు పైకి వచ్చాయి.
ఆలోచించి మూర్తి గారు నాలుగు వెదురు బొంగులు మాలి చేత తెప్పించి పందిరి వేయించి చిక్కుడు తీగను మరో కర్ర సాయంతో పందిరి పైకి ఎక్కించారు.
మనవడు సాయి రోజూ శ్రద్ధగా నీళ్లు పోస్తూ ఆకుల వైపు కాయలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాడు.
పందిరి అంతటా చిక్కుడు తీగలు అలుముకుని ఆకులతో పువ్వులు వచ్చి క్రమంగా కాయలు వస్తున్నాయి.
సాయి ఆనందానికి అంతులేక పోయింది. పందిరి నిండా చిక్కుడు కాయలు కనబడుతున్నాయి.
తాతయ్య బాస్కెట్ నిండా చిక్కుడుకాయలు కోసి కిచెన్లో నానమ్మకిస్తే ఎంతో సంతోషించింది. వాడి మంచి ఆలోచనకి తాతయ్యతో పాటు అమ్మానాన్నలు మెచ్చుకుని గిఫ్టులు ఇచ్చేరు.

* * *

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!