ప్రమిద (సంక్రాంతి కథల పోటీ)

ప్రమిద
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: శింగరాజు శ్రీనివాసరావు

ప్రమిద ఆనందానికి అంతులేదు. ‘తను అనుకున్నది సాధించింది. కాదు సాధించేలా చేశాడు. అవిటితనాన్ని అధిగమించి ఈరోజు అందరిముందు తలెత్తుకుని తిరిగేలా చేసింది నాన్న. ఎన్ని జన్మల పుణ్యమో ఇది. యూనివర్శిటీ పరీక్షలలో బంగారుపతకం రేపు సభలో అందరిముందు బహుకరిస్తారు. ఇన్నాళ్ళు తనుపడిన శ్రమకు ప్రతిఫలం. ఈ గెలుపు నాదికాదు, ఆయనది. ఆ దేముడిది’ ప్రమిద కళ్ళు తడిదేరాయి.

*********

విశ్వవిద్యాలయం ఆడిటోరియం విద్యార్థులతోను, వారి తల్లిదండ్రులతోను నిండిపోయింది. లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిపడుతున్నాడు ఒక వ్యక్తి. నెరిసిన గడ్డం, చేతిలో సంచితో వాకిలి ముందు తచ్చాడుతున్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు అటుగా వచ్చాడు.

“ఏమిటి పెద్దయ్యా. ఇక్కడ తిరుగుతున్నావు. ఇది పెళ్ళికాదు, ఉచితంగా భోజనాలు పెట్టడం లేదు. ఇది స్నాతకోత్సవం. ఇక్కడ ఇలా తిరగకూడదు. వెళ్ళు” అని అతడిని వెళ్ళమన్నాడు.

“బాబూ. నాకు సదువురాదు. పొలం పని సేసుకునేటోణ్ణి. ఇక్కడ మా ఊరమ్మాయికి పెద్ద బహుమతి వచ్చిందట. వాళ్ళ అయ్య పనిమీద సింగపూరు పోతా నన్ను ఎల్లి సూసిరారా అన్నాడు. అందుకే వచ్చినానయ్యా. నాకా పిల్లయాడుందో తెలవదు. ఎవురూ నన్ను లోనికి పోనీయటం లేదయ్యా. నువ్వన్నా సెప్పి నన్ను లోనికంపు. ఆ పిల్ల బహుమతి ఎత్తుకుంటుంటే సూడాలని శానా సంబరంగా ఉన్నాది” బ్రతిమలాడాడు అతను.

“భలేవాడివి పెద్దయ్యా. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఇంతకూ ఆ అమ్మాయి పేరేమిటి చెప్పు. ఆ అమ్మాయి దగ్గరికే తీసుకెళతాను”

“పేరు తెలవదయ్యా. సూత్తె గురుతు పడతాను”

“ఇప్పుడది కష్టం పెద్దయ్యా. సరే ఒకపని చెయ్యి. నిన్ను తీసుకెళ్ళి ముందుండే వరుసలలో కూర్చోబెడతాను. దూరం నుంచి కనిపించదేమో నీకు. ఆ అమ్మాయి కనిపించగానే నాకు చెప్పు. నేను, నువ్వు ఆ అమ్మాయిని కలిసేలా చేస్తాను”

“ఎంత మంచోడివి బాబు. అట్టాగే సెబుతాను. నన్ను వరసలో సివరన ఏడైనా కూసోబెట్టు సాలు” అని కుర్రాడికి దండంబెట్టాడు అతను.

“తప్పు పెద్దయ్యా. తండ్రిలాంటి వాడివి. అలా చెయ్యకూడదు. ఇంతకూ నీపేరు” అని అడుగుతూ అతడిని లోపలకు తీసుకువెళ్ళాడు.

“మరిడయ్య బాబు”

“నా పేరు మురళి. నువ్వు ఈ కుర్చీలో కూర్చో. నేను మరల వచ్చి కలుస్తాను. బహుమతులు ఇచ్చేటప్పుడు నీదగ్గరే వుంటానులే” అని మరిడయ్యను కూర్చోబెట్టి వెళ్ళాడు మురళి.

*********

అందరి ప్రసంగాలు ముగిసిన తరువాత బహుమతి ప్రదానం మొదలయింది. చాలామంది విద్యార్థులు వచ్చి బహుమతులు అందుకుని వెళుతున్నారు. కానీ మరిడయ్య ఎవరికోసమయితే ఎదురుచూస్తున్నాడో ఆ అమ్మాయి మాత్రం ఇంకా రాలేదు. ఇప్పుడే వస్తానన్న కుర్రాడు కూడ రాలేదు. అసలు నేను వచ్చింది రావలసిన చోటికేనా, కాదా అన్న అనుమానం రాసాగింది మరిడయ్యకు. ఇంతలో మురళి వచ్చి మరిడయ్యను అడిగాడు.

“పెద్దయ్యా. మీ ఆసామి గారి అమ్మాయి కనిపించిందా”

“లేదు బాబూ. అసలు ఆ అమ్మాయి ఈడ వుందో, లేదో”

“సరే. నువ్వు నాతోపాటు రా. ఇంకా ఇద్దరు అమ్మాయిలను స్టేజి మీదకు పిలవాల్సి వుంది. వాళ్ళల్లో ఉందేమో చూద్దువు గాని” అని స్టేజి ముందుకు మరిడయ్యను తీసుకువెళ్ళాడు మురళి.

“చివరిగా ఈ సంవత్సరం యూనివర్శిటీ మొదటి ర్యాంకు సాధించిన ప్రమిదను వచ్చి సత్కారాన్ని అందుకోవలసినదిగా కోరుతున్నాము”. ఆమాట వినిపించడంతో మరిడయ్య కళ్ళు మెరిశాయి. వేదికముందు నిలబడి కళ్ళు విశాలం చేసుకుని చూడసాగాడు.

చంకలో కర్రతో నడచుకుంటూ మెట్లెక్కి వచ్చింది ప్రమిద. ఒక్క క్షణం భ్రాంతికి లోనయ్యారు అందరూ.

“పుట్టుకతోనే ఒక కాలు, ఒక చేతిని కోల్పోయినా, మొక్కవోని మనోబలంతో పదవ తరగతి నుంచి ఇక్కడి వరకు ప్రథమశ్రేణి లోనే ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చి, అందరికీ ఆదర్శంగా నిలిచింది ప్రమిద. ఈమె తల్లిదండ్రులను అభినందించాలి. అవిటితనమున్న బిడ్డయని నిర్లక్ష్యం చేయకుండా ఇంతటి ఉన్నతస్థానానికి తీసుకువచ్చారు. దయచేసి వారుకూడ స్టేజి మీదకు రావాలని కోరుకుంటున్నాను” చెప్పారు అధ్యక్షుల వారు.

ప్రమిద కళ్ళు చుట్టూ వెదుకుతూ ఉన్నాయి తన తండ్రి రాకకోసం. ఎన్ని పనులు ఉన్నా తప్పక రమ్మని చెప్పింది. అడ్రసు కనుక్కుని రాగలిగాడో లేదో. ఆమె కళ్ళల్లో ఏదో దిగులు.

“ప్రమిదా మీ అమ్మను, నాన్నను రమ్మని పిలువమ్మా” అని మైకు చేతికిచ్చారు అధ్యక్షుల వారు. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి.

“సభకు నమస్కారం. నాకు అమ్మలేదు. పుట్టీ పుట్టకముందే తల్లిని పొట్టన పెట్టుకున్న పాపిష్టిదాన్ని. నాకు అమ్మయినా, నాన్నయినా మా నాన్న మరిడయ్య ఒక్కడే. అక్షరజ్ఞానం లేనివాడు. రమ్మని బ్రతిమలాడి మరీ చెప్పాను. వచ్చాడో, లేదో తెలియదు. ‘నాన్నా.. వచ్చివుంటే పైకిరా’ ఈ బహుమానం నువ్వు పెట్టిన భిక్షే నాన్నా. నువ్వు చదువుకోలేక పోయానని, ఎందరు వద్దన్నా నన్ను బడికి పంపి, ఈరోజు ఇంతదాన్ని చేశావు. అవిటిదాన్నని నిర్లక్ష్యం చేయకుండా అరచేతిలో పెట్టుకు పెంచావు. నువ్వే లేకుంటే నేను లేనేలేను నాన్నా. నా తండ్రి ఎంత ఉత్తముడో ఒక్కసారి అందరికీ చెప్పాలనుంది నాన్నా” మాటలు పెగలడం లేదు ప్రమిదకు. ఇంతలో మరిడయ్యను బలవంతంగా వేదిక మీదకు తీసుకువచ్చాడు మురళి.
తండ్రిని చూసి “నాన్నా” అంటూ ముందుకు రాబోయి తట్టుకుంది ప్రమిద. “తల్లీ” అంటూ వచ్చి ఆమెను పడకుండా పట్టుకున్నాడు. ఆ దృశ్యం అక్కడ వున్న సభికులనే కాదు, ప్రేక్షకులను కూడ కంటతడి పెట్టించింది.

సభికులు లేచి వారిద్దరినీ సమాధానపరచి మరిడయ్యను మాట్లాడమని మైకు ఇచ్చారు.

“అయ్యా. నేను సదువురానోన్ని. సిన్నప్పుడు సదువుకుంటానని మా అయ్యనడిగితే, మనకయన్నీ అబ్బవురా. మనం మట్టిమడుసులం. మట్టిని నమ్ముకుబతకాల. సదువును కాదని పొలంపనికి అంపాడు. నా మనసులో సదువంటే ఇట్టం సావలేదు. ఈ తల్లి పుట్టాక ఏడాది తిరిగేకల్లా మా యావిడ ఉబ్బసమొచ్చి సచ్చిపోయింది. మల్లీ పెల్లి సేసుకోమన్నారు. ఎవురొచ్చినా నాబిడ్డకు తల్లికానేదని, అన్నీ వొగ్గేసుకున్నా. ఏ మాయ జబ్బో తెలవదు గానీ, బిడ్డ పుట్టినప్పుడే సెయ్యి, కాలు సిన్నగున్నయి. అయి పెరగలేదు. ఆసుపత్రుల సుట్టూ తిరిగినా నయంకాలేదు. ఇక అంతేనన్నారు. కానీ నేను బయపడలే. ఒక కాలు, సెయ్యి బాగుందిగా. అంతే సాలనుకున్నా. మా ఊరి పంతులు కాడికి తీసికెల్లా. మహానుబావుడు సచ్చి ఏలోకానున్నాడో. పిల్లను బడిలో కూకోబెట్టుకున్నాడు. సదువు సెబుతానన్నాడు. ఒక సంవత్సరం బోయాక నన్ను పిలిసి ‘ఒరేయ్ మరిడిగా. నీకూతురు సదువుల తల్లిరా. నువ్వు శానా అదృట్టవంతుడివి. నీ కోరిక నీకూతురు తీరుత్తదిరా. ఆ బిడ్డ బారం నామీద యెయ్యి’ అన్నాడు. కులం తక్కువోడినని సులకన సెయ్యలా.. పెద్ద మనసున్న మడిసి. ఆయాల నుంచి ఆయనే దానికి అయ్యయినాడు. బిడ్డను కాలేజికి అంపిందాకా ఆయనే సూసుకున్నాడు. ఒకరోజు గుండెపోటొచ్చి మమ్మల్ని ఇడిసి పోయాడు. ఆ అయ్య సలవే ఇయాల నాబిడ్డ ఇంతగానికి కారణం. నాదేముందయ్య మట్టి పిసుక్కుని బతికేటోణ్ణి. మీ యందరి దీవెనేనయ్యా, ఇయాల నాబిడ్డను ఇంతదాన్ని సేసింది. మనిసి కాడ కండను దోసుకోవచ్చు, సొమ్మును దోసుకోవచ్చు, మోసంజేసి ఆస్తుల దోసుకోవచ్చు. కానీ మనిసి నేర్సిన సదువును ఎవురూ దోసుకోలేరయ్యా. అందుకే నాబిడ్డను సదువుకోమని పోడెట్టా. అంతేనయ్యా నాకు తెలిసింది” అని అందరి పాదాలను స్పృశించాడు మరిడయ్య.

“మరిడయ్యా లే. నువ్వు చాలా గొప్పవాడివయ్యా. ఎంతగొప్ప కూతురిని కన్నావయ్యా. నాలుగు అక్షరం ముక్కలొస్తే చాలు. చదువురాని తండ్రిని పూచికపుల్లలా చూస్తూ, అతడిని తండ్రని చెప్పుకోవడానికే సిగ్గుపడే పిల్లలున్న నేటిరోజులలో, తండ్రిని పదిమందికి పరిచయం చేయాలని తపించిపోయే బిడ్డను కన్నావు. మిమ్మల్ని చూస్తుంటే సంస్కారం వచ్చేది చదువుతో కాదు, పుట్టుకతో అని అనిపిస్తున్నది. మనిషి స్వార్ధంతో సృష్టించిన కులమతాలను నువ్వు పట్టించుకోనక్కర లేదు. గుణగణాలలో నీవు మా అందరినీ మించిపోయావు. మేమే శిరసు వంచి నీ పాదాలకు మొక్కాలి” అని మరిడయ్యను అభినందించి అతనిని పైకిలేపారు అధ్యక్షుల వారు.

“ప్రమిదా. నీ ఆశయం ఏమిటో అందరికీ చెప్పమ్మా” అని తనే అడిగి మైకు ఆమెకిచ్చాడు.

“ముందుగా కృతజ్ఞతలు తెలుపుకోవలసినది నా తండ్రికి. నన్ను అవిటిదాన్నని, ఆడపిల్లనని అవతలకు విసిరేయకుండా, తన సుఖాన్ని త్యజించి నాకోసం తన జీవితాన్ని ధారపోసిన నా తండ్రికి జీవితాంతం ఋణపడివుంటాను. అలాగే తాకడానికి కూడ ఎవరూ ఇష్టపడని మమ్మల్ని అక్కున చేర్చుకుని, నాకు చదువుభిక్ష పెట్టిన నా గురువు గారి ఋణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఆయన చెప్పినట్టు దోపిడికి దొరకని ఆస్తి చదువు. ఆ చదువును అందరికీ పంచాలంటే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలి. అందుకే నేను ఉపాధ్యాయురాలిగా కొనసాగాలనుకుంటున్నాను. ఉగ్గుపాలతో సంస్కారం నేర్పేది తల్లి. జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులను ఎలా ఎదుర్కోవాలో నేర్పేది తండ్రి. సమాజంలో ఎలా ఉండాలో, సమాజానికి ఎలా ఉపయోగపడాలో, మంచి చెడుల విచక్షణను ఎలా తెలుసుకోవాలో నేర్పి, సమాజానికి ఒక మాణిక్యాన్ని అందించేది గురువు. అందుకే నాకు ఉపాధ్యాయురాలిని కావాలనుంది. నేను ఎక్కడ వుంటే, ఆ చుట్టుపక్కల నిరక్ష్యరాస్యత లేకుండా చూడాలని నా పట్టుదల. సమాజానికి మంచి వ్యక్తులను అందించాలంటే, అది ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమని నా నమ్మకం. ఈనాటి నా ఉన్నతికి దోహదపడిన ప్రతి ఉపాధ్యాయునికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను” అని అందరిముందు శిరసువంచింది ప్రమిద.

అందరి చప్పట్లతో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది. బహుమతి ప్రదాత ముందుకు వచ్చి మరిడయ్య చేతుల మీదుగా ప్రమిదకు బంగారుపతకాన్ని అందించారు. తండ్రి గుండెలమీద తృప్తిగా తల ఆనించింది ప్రమిద. మరిడయ్య మనసు ఆనందంతో నిండిపోయింది.

** అయిపోయింది***

You May Also Like

One thought on “ప్రమిద (సంక్రాంతి కథల పోటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!