మంచిరోజులొచ్చాయ్ (సినిమా సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకురాలు: ఉమా మహేశ్వరి యాళ్ళ
చిత్రం: మంచిరోజులొచ్చాయ్
నాటి సమాజంలో నాటకాలు ఐతిహాసిక కథల ఆధారాలుగా దైవ సంబంధ రచనలే చేస్తుండగా వాటిని ప్రదర్శిస్తూ ప్రజలకి మంచి చెడుల వ్యత్యాసమును తెలుపుతుండేవారు. కాలక్రమంలో అవి అనేకరూపాలలో, జానపద కళారూపాలుగానూ ప్రదర్శింపబడేవి. కాలక్రమంలో నాటకాలు అనేక రూపాంతరం చెందాయి. వాటిలో భాగంగానే సినిమా నేటి ప్రపంచ జనాభాకి మిక్కిలి ఆదరణీయమైనది.
అలా కాలాంతరంలో వచ్చిన సినిమాలలోనూ సాంఘికం,జానపదం,కుటుంబ కథా చిత్రాలుగా ప్రజలకు సందేశాన్ని ఇచ్చే కథలను చిత్రీకరించడం జరుగుతుంది. అలా చిత్రీకరించబడిన సినిమాలో ఇటీవల వచ్చిన సినిమా “మంచిరోజులొచ్చాయి”. ఇందులో రచయిత సమాజంలో నిత్యం మనం చూసే, అనుభవైకవేధ్యమైన, మానస్తత్వ వవేచనకి చెందిన అంశాన్నే తీసుకుని కథగా మలిచారు. కనులకి కట్టినట్లు చిత్రీకరించారు.
కథ విషయానికి వస్తే ఇంటి చుట్టుపక్కల ఉండే జనాన్ని మనం నిత్యం చూస్తుంటాం. అనేక రకాల మనస్తత్వాలు కలిగినవారిని కలుస్తుంటాం. అనేకసందర్భాలలో వారిని మన జీవితంలో తప్పనిసరై భరిస్తుంటాం. ఇంకొన్ని సమయాలలో గుడ్డిగా వారిని నమ్మేసి మన విషయాలు అన్నింటినీ పంచుకుంటుంటాం. అయితే అలాంటి సందర్భంలో ఎదుర్కొనే విపరీతధోరణులు ఏవిధంగా ఉంటాయో చాలా చక్కగా తెలిపారు.
ఈ చిత్రంలో తెలిపిన రెండు ప్రధానమైన అంశాలలో ముఖ్యమైన అంశం ఒకటి పొరుగింటివారు హాయిగా నవ్వుతూ సరదాగా ఉండడం చూడలేని ఈర్ష్యాపరుల ప్రవర్తన, వారు మనతోనే ఉంటూ ఏవిధంగా మన జీవితాన్ని తప్పుద్రోవన పెట్టిస్తారనే అంశాలను చక్కగా తెలిపారు. అనుక్షణం హింసించే మాటలతో మన ఆరోగ్యంపైన మనస్సుపైన ఎలా తెలియకుండానే వారి మాటలు ప్రభావం చూపుతాయనో అంశాలని కళ్ళకికట్టినట్లు చూపారు.
మరీ ముఖ్యంగా మానసికంగా మనిషి ఏవిధంగా ఎదుటివ్యక్తిమాటలకు లోబడిపోతాడనే అంశం మరియు మనమంతా ఎదుర్కొన్న గడ్డు పరిస్థుతులైన కరోనా ప్రభావం మొదలైన అంశాలని ఆలోచనాత్మకంగా తెలిపారు.అన్నిటికీ మించి మాతృత్వపు కమ్మదనం చూపుతూ తల్లికి వినికిడి లోపం ఉన్నప్పటికి అర్ధరాత్రి బిడ్డ నెమ్మదిగా పిలిచినా నిద్రలో ఉన్న తల్లి లేచి ఏరా కన్నా నిద్రపట్టలేదా రా వచ్చి నాదగ్గర పడుకో అనే సన్నివేశం చాలా ఆర్ర్ధంగా అనిపించి ప్రతి ఒక్కరికి కన్నప్రేమ గురుతొస్తుంది.ఈవిధంగా చక్కని సన్నివేశ చిత్రణ , కుటుంబంలోని మాధుర్యం చూపారు.
మరీ ముఖ్యంగా నాయికా నాయకుల ప్రేమ వివాహానికి నాయకుడు నాయిక తల్లిదండ్రలను ఏవిధంగా అడుగడుగునా సపోర్ట్ ఇస్తూ ఒప్పించి వివాహం చేసుకోవడం అనే అంశాలు కుటుంబం ఇచ్చే సపోర్ట్ మొదలైనవన్నీ కుటుంబ వ్యవస్థనూ, తల్లిదండ్రుల యొక్క ప్రేమాప్యాయతలను చాలా బాగా తెలిపారు. మొత్తంగా ఇదొక సందేశాత్మక చిత్రం అని చెప్పవచ్చు. రచయిత కథని నడిపిన విధం చాలా చక్కగా సాగింది.