అక్షర కిరణం

అక్షర కిరణం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

ఓ రోజు కిరణ్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. తినడానికి లోటు లేనంత అస్తి ఉంది, ఊరు నిండా మంచి పేరు పలుకుబడి ఉంది. అయినా తనకు పిల్లనిచ్చి పెళ్లి చెయ్యడానికి ఎవరూ రావడం లేదు, కారణం తను చదువు లేక వేలిముద్ర వాడు కావడం కదా అనుకుంటున్నాడు. చిన్నప్పుడు ఎవరు ఎంత చెప్పినా వినేవాడు కాదు, అసలు బడికి వెళ్తే కదా, అక్షరం అబ్బడానికి. ఇప్పుడు ఆ చదువు లేకపోవడం వలన ఒక్క పెళ్లే కాదు ఎన్నో రకాల ఇబ్బంది పడుతూ ఎదుటివారి మీద ఆధార పడవలసి వస్తోంది. ఒక్కోసారి వారి వంచనతో ఎంతో నష్టపోతున్నాడు కూడా. అది తెలిసీ ఈ ఉన్న అస్తి తన మంచి తనానికి, చదువు లేకపోవడం వలన హారతి కర్పూరంలా కరిగిపోతుంది. అని చెప్పి అందరూ మంచిగా కబుర్లు చెప్పేవారే, గానీ చేయి పట్టి జీవిత భాగస్వామిగా రావడం లేదు. ఇలా ఆలోచిస్తున్న కిరణ్ కి ఎక్కడ నుంచో చిన్నగా మూలుగు వినిపిస్తోంది. మెల్లిగా అటుగా వెళ్లి చూసాడు. ఒక యువతి పాపం పడిపోయినట్లు ఉంది ఏదో ప్రమాదం జరిగినట్లు, రక్తపు మడుగులో పడి ఉంది. అరే పాపం అనుకుని వెంటనే ఓ ఇద్దరు స్నేహితులను సాయం కోసం రమ్మన్నాడు. వారు చూసి ఒరే! ఏం ప్రమాదమో ఏమో మనకెందుకు పోలీసులకు చెప్పి మనం పోదాం అన్నారు. దానికి కిరణ్ మనసు అంగీకరించ లేదు. ఏమీ కాదు ఆపదలో ఉన్నవారిని, అదీ అమ్మాయిని ఎలా వదిలేస్తాం పదండి ముందు ఆసుపత్రికి తీసుకుపోదాం అన్నాడు. అది వినకుండా ఆ స్నేహితుల్లో ఒకడు జారుకున్నడు. మిగిలిన స్నేహితుని సాయంతో పక్కనే ఉన్న ఆసుపత్రికి చేరుకున్నారు. గుమ్మంలోనే పరిచయం ఉన్న వైద్యుడు ఎదురు వచ్చి ఏమైంది కిరణ్ ఎవరు ఈవిడ అన్నాడు, అవన్నీ తరువాత ముందు ఈవడని చేర్చుకుని ఏమైందో చూడు అనేసరికి అతను వెంటనే అత్యవసర చికిత్స కోసం అన్నీ ఏర్పాటు చేసి వచ్చాడు. హా! ఇప్పుడు చెప్పు ఎవరూ ఈమె అన్నాడు. ఏమో తెలీదు ఎవరో గుద్దేసి పోయుంటారు. సరేలే పర్లేదు అది నేను చూసుకుంటా, పోలీసుకి ఫిర్యాదు చేస్తాం, ఈ లోపు మా చికిత్స ప్రారంభించా, కొంచెం దెబ్బలు ఎక్కువే తగిలాయి. స్పృహ లోకి రావడానికి రెండు రోజులు పడుతుంది. నువ్వేం కంగారు పడకుండా వెళ్లి నీ పని చూసుకో, అవసరం అయితే నేను కబురు చేస్తా, అప్పుడు రా అన్నాడు ఆ వైద్యుడు. సరే నేను మళ్లీ సాయంత్రం వస్తా, ఈ లోగా ఏం అవసరం ఉన్నా పిలు, ఇంకో విషయం డబ్బు కోసం ఏమీ చూడకు, ఎవరు కన్న పిల్లో పాపం! నేను అందాక కొంత డబ్బు ఇస్తున్నా అని చేతిలో పెట్టి వెళ్ళాడు కిరణ్. మళ్లీ సాయంత్రం వచ్చి స్పృహ వచ్చిందా, ఎవరో తెలిసిందా అని అడిగాడు ఆ వైద్యున్ని. లేదు ఇంకా, పోలీసులు చూసుకుని చెప్తా అన్నారు. ఆమెకు కంగారు పడే పనిలేదు బానే ఉంది అన్నాడు.
ఇంతలో పక్క ఊరిలో ఉండే రాజారావు దంపతులు రాత్రి అయినా అమ్మాయి ఇంటికి రాక పోయేసరికి చాలా కంగారు పడుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చి, అయ్యా ఎస్.ఐ గారూ మా అమ్మాయి ఈ పక్క ఊరిలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, యువజన విద్య పేరుతో కొంతసేపు పెద్దవాళ్ళకి విద్య నేర్పుతూ ఉంటుంది, రాత్రి ఇంత పొద్దు పోయినా ఇంకా ఇంటికి రాలేదు, ఏదో కంగారుగా ఉంది అని వాపోయారు. ఉండండి కంగారు పడకండి అమ్మాయి ఫోటో చూపండి అనేసరికి చూపిస్తారు. ఆ ఫోటో ఇంతకు ముందే పక్క ఊరి కానిస్టేబుల్ ఇచ్చి పోయిన ఫోటోతో సరిపోయింది. దానితో విషయం వారికి చెప్పి కంగారు పడకండి ఏదో చిన్న ప్రమాదంలో గాయాలు అయ్యాయి అంతే అని తన కానిస్టేబుల్ నిచ్చి ఆసుపత్రికి వీరిని పంపుతాడు. రాజారావు దంపతులు ఎంతో కంగారులో ఉన్నారు, మరో పది నిమిషాలలో వారు ఆసుపత్రికి చేరుకుని కూతుర్ని చూసి తల్లడిల్లి పోయారు. అక్కడే ఉన్న కిరణ్, వైద్యుడు వీరిని ఓదార్చి ఏమీ భయం లేదు, రేపటికి మీ అమ్మాయి స్పృహలోకి వస్తుంది. తనని కొంచెం ప్రశాంతంగా ఉంచండి కంగారు పెట్టకండి. మీకు మేం ఉన్నాం ఏమీ కాదు అని ధైర్యం చెప్పారు. వైద్యుడు వేరే తన పని మీద వెళ్ళాడు. కిరణ్ మాత్రం ఇక్కడే ఉండి, వీరిని గమనిస్తున్నాడు. చూస్తేనే తెలుస్తోంది కడు పేదవారు అని. అమ్మాయి ఆరోగ్యం గురించి ఓ కంట్లో, ఖర్చు ఎలాగా అనే బాధ మరో కంట్లో ఉండలేక నీరులాగా కారుతుంటే వెళ్లి మెల్లిగా చెప్పాడు మీకు ఏమీ ఇబ్బంది లేదు, అమ్మాయి కి వైద్యానికి అయ్యే ఖర్చు గురించి ఏమీ ఆలోచించకండి అన్నాడు. బాబూ ఎవరో దేవుడిలా కనిపించావు, మీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటూ దణ్ణం పెట్టారు వారు. అయ్యో పెద్దవారు అలా అనకండి ఇదేమంత సాయం అనుకోకండి. ఏదో పూర్వ జన్మ బంధం అంతే అన్నాడు కిరణ్.
మిమ్మల్ని చూస్తే ఏమీ తిన్నట్టు లేదు అని చెప్పి వారికి తినడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే బాగా పొద్దు పోయింది, ఇక నేను వెళ్లి మళ్లీ ఉదయమే వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు. వీళ్ళని చూడగానే ఏదో ఆత్మీయత పెనవేసుకున్నట్టు అనిపించింది కిరణ్ కి.
అలా అలసటతో ఆలోచనతో రాజారావు దంపతులకి నిద్ర పడుతూ, పోతూ ఉంది.
తెల్లవారు జామున కూతురు మూలుగుతో ఏమైంది అమ్మా! అక్షరా, ఎలా ఉంది అన్నారు. మెల్లిగా తెలివి వచ్చిన అక్షర, ఎవరో స్కూటర్ మీద గుద్దేస్తే పడిపోయా. నేను ఇక్కడికి ఎలా వచ్చా, మీకు ఎలా తెలిసింది అంది. ఆ వివరాలు అన్నీ తల్లి తండ్రి చెపితే మనసులోనే కిరణ్ కి కృతజ్ఞతలు చెప్పుకుంది. తరువాత కొంత సేపటికి నిద్ర పట్టేసింది అక్షరకి. ఉదయం ఉపాహారం, కాఫీ తీసుకుని కిరణ్ వచ్చి వీళ్లకు ఇచ్చి, తన ఇల్లు ఇక్కడకి దగ్గరే మీరు వెళ్లి, స్నానం చేసి రండి, మా స్నేహితుడు తీసుకు వెళ్తాడు అని చెప్పి ఒప్పించి పంపుతాడు. తన స్నేహితునికి వీరికి అన్నీ చూసి భోజనం చేయించి తీసుకు రమ్మని చెప్తాడు.  అప్పటికే కిరణ్ తల్లికి చెప్పడంతో వీరిని చూసి ఆప్యాయంగా పలకరించి తగిన ఏర్పాట్లు చేసింది. ఆవిడ ఆదరణకి రాజారావు దంపతులు ఎంతో పొంగిపోతూ పరిపరి విధాల కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఆసుపత్రిలో అక్షరకి మెల్లిగా తెలివి వచ్చింది. పక్కనే ఉన్నది కిరణ్ అని అడిగి తెలుసుకుని కృతజ్ఞతా భావంతో కన్నీరు పెడుతూ ఉంది. ఆడవారితో మాట్లాడడం అలవాటు లేని కిరణ్ ఎంతో ఇబ్బంది పడి అక్షరను ఓదార్చాడు. ఆపై కొన్ని రోజులకు అక్షర కోలుకోవడం, ఇంటికి చేరాకా కూడా వీరి అనుబంధం కొనసాగడం జరిగింది. ఈ క్రమంలో అక్షర వాళ్ళ ఆర్థిక పరిస్తితి కిరణ్ కు అర్థమైంది. కిరణ్ కు చదువు లేక పోవడం, దానితో పడుతున్న ఇబ్బంది అక్షరకు అర్థమై, తనకు అప్పటికే వయోజన విద్యలో ఉన్న నైపుణ్యంతో కిరణ్ కి అక్షరాలు నేర్పి, బ్రతకడానికి కావలసిన చదువు నేర్పుతుంది. అలా ఓ నాలుగు నెలలు గడిచాక, కిరణ్ తన అమ్మ అనుమతితో చూడండి అక్షర గారు, మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటారా అని వాళ్ళ తల్లి దండ్రుల సమక్షం లోనే అడుగుతాడు. దానికి వారంతా ఒకేసారి ఇప్పటికే మీకు చాలా రుణపడ్డాం, మా ఆశకు కూడా హద్దు ఉండాలి, ఇన్నాళ్లు మీరు ఎంతో సాయం చేస్తూనే ఉన్నారు అన్నారు. అంతే కాకుండా నాకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు మీరు అలాంటి మీతో నేను చేయి కలిపి నడవడం అంటే అత్యాశ అవుతుంది అంది అక్షర. అదేం కాదు, మీరు మరీ అంత పెద్ద పెద్ద మాటలు వాడకండి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది, ఇది జాలితోనో లేక త్యాగం కోసమో కాదు అన్నాడు కిరణ్. అలా రెండు మూడు రోజులు కిరణ్, తన అమ్మ ఎంతో నచ్చ చెప్పాకా అక్షర ఒప్పుకుంది. ఆపై ఎంతో వైభవంగా అన్నీ తానే చూసుకుని పెళ్లి చేసుకున్నాడు కిరణ్. అలా అక్షర కిరణమై వారు ఆ ఊరికి మరింత సాయ మందిస్తూ సుఖసంతోషాలతో ఉండాలని మనమూ కోరుకుందాం.

You May Also Like

6 thoughts on “అక్షర కిరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!