” రచనల్లో మేధా పోరాటాల్లో యోధ “
సాహితీ మిత్రులు భూపతి అంటూ ముద్దుగా పిలుచుకునే భూపతి వెంకటేశ్వర్లు మనందరి సోపతి.
అభ్యుదయ కవి కళాకారుడు రచయిత సామాజిక సాహిత్య ఉద్యమకారుడు . 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తన రచనలతో సామాజిక మార్పుకోసం కృషి చేస్తున్న కవి రచయిత భూపతి. పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పెట్టుబడి దారులు చేస్తున్న మోసాలను తనదైనశైలిలో కవితలు రచనల ద్వారా పల్లె ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ నాటి సుద్దాల హనుమంతు నిసార్ వంటి ప్రజా కవుల సాయుధ వారసత్వాన్ని చాటి చెప్పాడు.
ఎక్కడ అన్యాయం జరిగినా తన కలం గళం తో ముందుండి ప్రశ్నిస్తాడు .ఆయన ప్రసంగాలు సామాన్య ప్రజలకు ధైర్యాన్నిస్తాయి.
ఎక్కడ ఉద్యమాలు జరిగినా తన కవితాక్షరాలతో పాలకుల విధానాలను ఎండగడుతూ ప్రజలకు దిక్సూచిగా మార్గ దర్శనం చేస్తాడు.
నిరుపేద గీత కార్మిక కుటుంబంలో జన్మించి గీత కార్మికుల సమస్యలు దగ్గరనుంచి చూసిన భూపతి సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు ఉద్యమమే శరణ్యం అని ఉద్యమంలో పాల్గొని పూర్తి స్థాయి కార్యకర్తగా పీడిత ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాటం చేసిన ఎర్ర జెండా ముద్దు బిడ్డ కామ్రేడ్ భూపతి. మోదుగుపూల పత్రిక సంపాదకుడుగా అణగారిన వర్గాలకు ఆత్మీయుడిగా నల్లగొండ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకున్న అభ్యుదయ రచయిత భూపతి కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి నిలదీసే కలం సైనికుడు భూపతి.
తను చిన్న నాటి నుంచి చూసిన దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు బాల్యంలోనే సామాజిక మార్పుకోసం వేసిన అడుగులు ప్రగతిశీల సాహిత్య అధ్యయన ఉద్యమాలకు ఊపిరులూదాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా తిరుమలగిరి తాటిపాముల గ్రామం లో జన్మించాడు.ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి అభ్యుదయ ఉద్యమాలకు పురుడు పోసిన తాటిపాముల ఎర్ర సింధూరం భూపతి వెంకటేశ్వర్లు ఉద్యమ స్ఫూర్తి.
ఉత్తేజాన్నిచ్చే ఉద్యమ యోధుల యాదిలో 25మంది ఉద్యమ యోధుల వ్యాసాలతో వెలువరించిన మీ రచన నేటి తరానికి ఉపయుక్త గ్రంథం. చరిత్రలను అధ్యయనం చేసి సమగ్రమైన అంశాలను పాఠకులకు ఆకట్టుకునే విధంగా తెలంగాణ ధీరుల పోరాట నేపథ్యం సాయుధ రైతాంగ పోరాట పటిమను నాటి మట్టి మనుషుల వ్యధలు కళ్లకు కట్టినట్లు అక్షరాలతో దృశ్యాన్ని చూపించే రచనలు భూపతి గారి శైలికి నిదర్శనం.
.
తెలంగాణ ప్రజా సాంస్కృతిక ఉద్యమాలను సామాజిక చైతన్యాన్ని పదును పెట్టడంలో తాను చేసిన పోరాటాలు అలాగే మోదుగ పూలు పత్రిక మాధ్యమం ద్వారా వ్యాసాలు కవితల ద్వారా భూపతి నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది .
తెలంగాణ పోరాట ఉద్యమాలకు పుట్టినిల్లు.
ప్రకృతి సౌందర్యం శ్రమసౌందర్యం కలగలిసి ఉన్న తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. ప్రకృతి వనరులు పుష్కలంగా కలిగివున్న తెలంగాణాలో వ్యవసాయం కులవృత్తులు ఒక దానిపై ఆధారపడి శ్రమైక జీవన విధానానికి సాక్ష్యంగా నిలుస్తోంది.
నాటి నుండి నేటి వరకు తెలంగాణ వీరుల త్యాగాలు వారు చేసిన పోరాటాల చరిత్ర నేటి యువతరానికి సరికొత్త స్ఫూర్తినిచ్చే విధంగా గ్రంథ రూపంలో అందించిన భూపతి సాహిత్య సేవను తెలంగాణ సాహితీ లోకం సదా గుర్తుంచుకుంటుంది.
పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు, వెట్టిచాకిరి, అస్పృశ్యత, కరువులు ఉపాధి లేమితనం,
అప్పులు వడ్డీ బాధలు అన్నీ భూపతి రచనల్లో కనిపిస్తాయి.వాటి పరిష్కారం కోసం పోరాటమే శరణ్యం అంటూ పోరాట మార్గాన్ని చూపెడుతూ తాను కూడా వెంట నడుస్తాడు.
ఆధునిక సాహిత్యం ప్రపంచం సాంఘిక జీవనాన్ని ప్రజా ఉద్యమ చరిత్ర నేపథ్యానికి భూపతి గారు తన రచనల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
యోధుల యాదిలో సమగ్రమైన అంశాలను పరిమళాలను గుబాలిస్తూ వచ్చాయి, అనంతరకాలంలో అభ్యుదయ దృక్పథం లో రచించబడ్డాయి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా
సాహిత్యంలో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల జీవన శైలి, మట్టి మనుషుల జీవిత త్యాగాలు రచనల్లో ప్రత్యక్షమయ్యాయి. జీవితమే ఉద్యమంగా ఉద్యమమే జీవితంగా ప్రజల జీవిత గాధలు వ్యాసాలలో చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో అవతరించినది వ్యాస సంపుటి యోధుల యాది . ఉద్యమ ప్రస్థానాలను వీరుల చరిత్రను వస్తువుగా భూపతి వ్రాసిన సంపుటి మనకు అందించిన సాహిత్య నిధి. ప్రజలకు కష్టసుఖాలు సంబంధించినది ప్రజాపోరాటాలకు సంబంధించినది తెలంగాణలో అప్పటి సాయుధ నేపథ్యం. యోధుల యాది జ్ఞాపకాలను జీవనశైలిని కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది.
అదిలాబాద్ అడవుల్లో అగ్ని పుట్టింది అంటూ ఆదివాసి గుండెల్లో పుట్టిన కొమురం భీం పూరించిన విప్లవ శంఖం అడవి పుత్రుల స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రం కోసం ప్రతిధ్వనించింది.
భూ పోరాట భేరి వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడిన వీరనారి ఉద్యమ వనిత చాకలి ఐలమ్మ చేసిన సాయుధ పోరాట త్యాగాలను వ్యాస రూపంలో పోరాటాల వెలుగమ్మా అని చాటి చెప్పాడు భూపతి వెంకటేశ్వర్లు.
నిజాం సర్కారకు గోరి కట్టిన పాటల గిరి యాదగిరి బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా అంటూ సాయుధ పోరాటాన్ని బండ్ల నిండా ఊరూరా వ్యాప్తి చేసిన ఉద్యమ గీతం.
సుద్దాల పాటల యుద్ధం నిజాం నవాబు కు నిద్రలో కూడా ఉలిక్కిపడేలా చేసింది. తన కలం నుంచి వెలువడిన ప్రతి పాట జనానికి తుపాకీ ఆయుధం అయ్యింది.నాటి సాయుధ పోరాటంలో దొరల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసిన యోధుడు. పల్లెటూరి పిల్లగాడ పసుల గాసే మొనగాడా అంటూ డెబ్బై ఏళ్ల క్రితమే బాల కార్మిక వ్యవస్థపై పాలకులను నిలదీశారు. కష్టజీవుల కడుపు నిండా కనికరించి ఎర్రజెండా ఎర్రకోటపై ఎగురలంటావా ఓ పాలబుగ్గల గీత గాడా అంటూ బాల కార్మికుల్లో ధైర్యసాహసాలు నింపాడు .సుద్దాల హనుమంతు ఉద్యమజీవితాలు ఈ వ్యాసంలో ఉండడం విశిష్టమైనది.
కల్లుగీత కార్మికుడుయోధుడు కమ్యూనిస్టు వీరుడు మాటలకు చమత్కారం సమస్యలకు పరిష్కారం చూపి దొర గడీలో పాగా వేసిన అరుణ పతాకం మల్సూర్. ఉమ్మడి నల్లగొండ తాలూకా నూతనకల్లు మండలంచిల్పకుంట్ల గ్రామంలో జన్మించాడు. దున్నేవాడికి భూమి గీసే వాడికి చెట్టు అన్న నినాదంతో మాల్సుర్ పోరాట పటిమను ఆవిష్కరించారు
భూపతి తెలంగాణ ప్రజా సంస్కృతి వేదిక కన్వీనర్ గా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం సాహిత్య సేవలో ఉంటారు. ఇలాంటి కవిత వ్యాస సంకలనాలు ఇంకా వెలువరించి నాటి ఉద్యమ వీరుల త్యాగాల చరిత్ర నేటి తరానికి అందించాలని కోరుకుంటూ..
ఉద్యమ అభినందనలతో
మీ
బూర్గు గోపికృష్ణ
7995892410