“సాహితీ వాహిక” నెల్లుట్ల సునీత

సాహితీ వాహిక” నెల్లుట్ల సునీత

సామాజిక స్పృహతో కవిత్వం రాసిన రచయిత్రి నెల్లుట్ల సునీత గారు సమస్యను ఆయుధం చేసుకుని సమాజాన్ని ప్రేరేపించే కవిత్వాన్ని ఆవిష్కృతం చేస్తూ తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలను రాస్తూ, పాటలు, వచనా వ్యాసాంగాలను పరిపుష్టం చేస్తూ తెలుగు సాహిత్యానికి ప్రతీకగా నిలిచింది.
ఉమ్మడి నల్లగొండ సూర్యాపేట తాలూకా పాతర్లపాడు గ్రామంలో నెల్లుట్ల శకుంతల దశరథ దంపతులకు సునీత జన్మించారు. సునీత విద్యాభ్యాసం వారి ఊరిలో కొనసాగినా, వివాహ అనంతరం ఖమ్మంలో ఉన్నత విద్యను అభ్యసించి, బిఈడీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.

సాహితీ బృందావన వేదిక స్థాపించి.. సామాజిక కార్యక్రమాలను సైతం తనదైన శైలితో నిర్వహిస్తూ, నూతన కవులను ప్రోత్సహిస్తూ, ఆధునిక సాహిత్యంలో సున్నితం ప్రక్రియ రూపొందించి సాహిత్య పఠనం చేస్తూ, వర్తమాన కవులలో సాహిత్య ప్రతిభను వెలికి తీశారు.

నిత్యం సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ సంస్థ అధ్యక్షురాలిగా నూతన చైతన్యంతో శ్రమిస్తూ, సాహిత్య లోకానికి దిక్సూచిగా నిలిచారు. కరోనా కాలంలో వివిధ సాహిత్య సామాజిక పోటీలు నిర్వహించి నూతన ఉత్తేజాన్ని నింపారు.

సాహిత్య కృషిని కొనియాడుతూ వలస కూలీలు పడుతున్నటువంటి బాధలు చూసి “వలస కూలీలు” అనే అంశంతో పలువురు కవులు రాసినటువంటి కవితలు సేకరించి ఆ కవితలన్నీ ఈ-సంకలన రూపంలో తీసుకురావడం అభినందించ దగ్గ విషయం. సంకలనంలో ప్రముఖులు తమ అభిప్రాయాలను సమీక్షగా అందించడం హర్షణీయం.

రోజువారి సాహిత్య ప్రశ్నల ప్రహేళిక ద్వారా తెలుగు వ్యాకరణ అంశాలను తెలుగు భాష గొప్పతనాన్ని సవినయంగా సాహిత్య ప్రపంచానికి తెలుగు వైభవాన్ని వ్యాప్తి చేయడంలో తమ వంతు కృషి చేస్తున్నారు. కాళోజి చెప్పినట్టు ఒక్క అక్షర చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ, శ్రీ శ్రీ గారి మరో ప్రపంచాన్ని కదిలిస్తూ సామాజిక చైతన్యాన్ని మేళవింపు చేసే రచనలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవలికాలంలో “భరతమాత రక్షణ మన బాధ్యత” అనే అంశంపై కవితా పోటీలు నిర్వహించి వివిధ కవులు రాసినటువంటి కవిత్వంతో ఒక కవితా సంపుటి వారి సంపాదకత్వంలో రావటం మంచి శుభ పరిణామం.
కవులు మంచి స్పందనతో కూడిన కవితలు అందించారు. కవితా వస్తువు ఎంచుకొని, ప్రావీణ్యం కలిగిన రచనలు చేసి సాహిత్య చరిత్రలో మైలురాయిని సృష్టించారు. సృజనాత్మకత ఎంత ముఖ్యమో అంటూ భావ కర్తవ్యాలను నెమరు వేసుకొని, నూతన ఉత్సాహంతో చేసినటువంటి రచనలు భరతమాత రక్షణ మన బాధ్యత అంటూ చేసిన సాహిత్య పఠనం కవి మిత్రులందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చాయి.

గత సంవత్సరం నవంబర్ లో వట్టికోట అల్వర్ స్వామి జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయ ఉద్యమాలపై ఆన్లైన్ జూమ్ మీటింగ్ నిర్వహించి, ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ తెలంగాణ ప్రప్రథమ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి గారు, భూపతి వెంకటేశ్వర్లు, నీలం శేఖర్, ఇతర ప్రముఖులు అద్భుతమైన ప్రసంగాలతో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ సాహితీ సంస్థలు ఎక్కడ నిర్వహించలేదు, అందుకు నిదర్శనం సాహితీ బృందావనం వేదిక.

సంస్థ వార్షికోత్సవం నల్లగొండ ఎం వి యన్  విజ్ఞాన కేంద్రంలో నిర్వహించి వివిధ రంగాలలో పని చేసిన వాళ్ళను పురస్కారాలతో సన్మానం చేసారు. ఇలా చెప్తూ పోతే చాలా విభిన్నమైన కార్యక్రమాలతో మహనీయుల జయంతి వర్ధంతులు, సెమినార్లతో సాహిత్య ప్రపంచానికి కనువిందు చేశారు.

12-11-2020నాడు భువనగిరి, యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గ్రంథాలయాన్ని సందర్శించి, ప్రజాకవి కూరెళ్ల విఠలచారి గారి సాహిత్య సేవలు గుర్తించి, జీవన సాఫల్య పురస్కారాన్ని, ఆత్మీయ అభినందనలతో సన్మానం చేయడం మర్చిపోలేని జ్ఞాపకం.

డిసెంబర్ 18 ఆదివారం 2020 రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవిసమ్మేళనం నిర్వహించి 60 మంది కవులకు అవార్డులు, నగదు ప్రశంసలు.. అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్ చేతుల మీదుగా.. గొప్ప కవులను, కళాకారులను సన్మానించారు. సాహిత్యంలోనే కాదు కళాకారులలో కళా నైపుణ్యాన్ని గుర్తించి ప్రముఖుల అభినందనలు కురిపింపజేశారు.

ఇటీవలికాలంలో రామప్ప వైభవాన్ని తెలంగాణ సంస్కృతి గర్వించే విధంగా రచనలు చేయించి ఈ-సంకలనాన్ని
విడుదల చేశారు. దానిపై శిల్ప కళా వైభవాన్ని ,ప్రఖ్యాతి గాంచిన కాకతీయుల సామ్రాజ్య చరిత్రను సున్నితం ప్రక్రియలో రూపొందించి.. ఈ సంకలనాన్ని “తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక” వెబ్సైట్ లో ఆవిష్కరించారు. ఇది బృహత్ కార్యక్రమం.

జాతీయ స్థాయి కవితా పోటీలు, చిత్రలేఖనం, ఈ-సంకలనంతో పాటు దాశరథి కాళోజీ జయంతి పురస్కరించుకొని కవితల పోటీలు నిర్వహించి నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందించారు. నూతన తెలుగు సాహిత్య ప్రక్రియలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకోవడం అందుకు గమనార్హం.

వీరి ద్వారా తేనె ఊటల తెలుగు అనే పేరుతో సున్నితం ప్రక్రియలో త్వరలో మొదటి ముద్రణ రాబోతుంది.

నవంబర్ 2021 విజయ దశమి పురస్కరించుకొని సుప్రసిద్ధ నవల.. యువ రచయిత ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు నర్రా ప్రవీణ్ రెడ్డి గారికి పాలపిట్ట యువ పురస్కారం ప్రకటించారు. ఫేస్బుక్ మాధ్యమాలలో ఈ అవార్డు ప్రకటించిన సందర్భంగా నెల్లుట్ల సునీత గారికి ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.

మహిళా రచయితల సంఘానికి అధ్యక్షురాలిగా విధులు నిర్వహిస్తూ, మహిళల సమస్యలపై పోరాడుతున్న
వీరనారిమణి అభ్యుదయ రచయిత్రి నెల్లుట్ల సునీత గారు.

దేశాభిమానంతో పాటు, ఆవేశం కలిగిన కవి సహజంగానే కవి కాగలిగాడు అన్న కాళోజీ గారిలా.. సునీత గారి కవిత్వం కూడా కాళోజి కవిత్వాన్ని పోలి ఉంటుంది .

ప్రకృతే సాక్షి
********
“బాల్యం దోసిట్లో
నుంచి చేజారింది
కత్తిలాంటి చట్టం
కక్ష తీర్చుకుంటుంది

ప్రకృతి సాక్షిగా నిలిచి
మౌనంగా రోదిస్తుంది
శ్రమయేవ జయతే
అంటూ సాగెనీ
పయనంలో “

ప్రకృతి సాక్షి అన్న మాటల్లో
బాల్యం చేజారిపోతుంది
కుటుంబ సమస్యలను వ్యక్తపరిచిన కవిత అందుకు ఉదాహరణ బాల్యం దోసిట్లో.

అంగడిలో అనుబంధాలు

******************

“చావు చచ్చిన దేహాలు
శ్రమ గంధాలు ఆవిరైన వృద్ధాప్యాలు
ఓదార్పు లేని నిట్టూర్పులతో
వయసుడిగిన పెద్దలు
బండెడు అనుభవాలను
మోసిన రెక్కలు ఒరిగి పోయాయి

మానవ సంబంధాల
వరదలు వారేనని
అమూల్య సంపద
వృద్ధాప్యమేనని
జీవిత పుస్తకంలో కొన్ని పుటలు తిరగేస్తూ
స్ఫురణ చేసుకుందాం”

నేడు అంతరించిపోతున్నటువంటి ప్రేమలను గుర్తు చేస్తూ అంగట్లో అనుబంధాలతో సాగిన కవిత సమాజాన్ని
మేల్కొల్పే విధంగా ఉంది.

చీకటి వెలుగులు
**********
“జీవితమే అస్పష్ట
మసక నీడల మిళితమై
వినీల గగనంలో
లక్షపు విహంగాన్ని
ఎగురవేయాలనే
లక్ష్యాలలో ఎన్ని
చీకటి వెలుగులో

చీకటి దారిని చేధించిస్వీయచరిత్రను
మనకు మనమేలిఖించుకోవాలి
అలుపెరుగని భౌతిక ప్రయాణంలోఆలోచన వెలుగులు
విరజిమ్మే తారాజువ్వలమవ్వాలి “

జీవిత లక్ష్యాలను చేధించిన కవిత చీకటి వెలుగులు వినీల గగనంలో విహరిస్తూ భవిష్యత్ తరాన్ని గుర్తు చేస్తూ జీవిత ప్రతికూల ఫలితాలను వెలుగునిస్తుంది. లక్ష్యానికి గుర్తు ముందు చూపు కవిత

మొక్కలు నాటు సంరక్షించు
********************
“పుడమితల్లి విలవిలలాడుతూ ఆక్రోశిస్తుంది
ఎవరికి చెప్పలేని ప్రసవ వేదనల మధ్య
మూగ రోదనలతో విలపిస్తుంది

అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా సాగి
తరువులే మానవ ఆదరువులని
భావితరాలకు బంగారు బాటలు వేద్దాం
బాధ్యత కావాలిగా సర్వ జీవకోటి సంరక్షణగా “

మొక్కలు నాటే యజ్ఞం గురించి ప్రస్తావిస్తూ పుడమి తల్లి గూర్చి ఎవరికీ చెప్పలేని
మూగ రోదనలని ప్రకృతి మాత
కొట్టుమిట్టాడుతూ పర్యావరణ సమస్యలను ప్రశ్నిస్తూ మొక్కల అభివృద్ధి కొరకు దిశానిర్దేశం చేశారు.

సాహిత్య ఉద్యమం చేస్తున్న మీ కలం నుండి మరిన్ని కవితా రచనలు వెలువడాలని ఆకాంక్షిస్తూ.. నాకు తెలిసినటువంటి సాహిత్య ప్రయాణంలో నెల్లుట్ల సునీత గారు కథలు, వ్యాసాలు,
గేయాలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందుతూ, సాహిత్యానికి బాటలు వేస్తూ తెలంగాణ ఫరిడవిల్లెలాగా రచనలు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ, అభ్యుదయానికి పూనుకొని తెలంగాణ ప్రాంతంలో కవిత్వానికి ఇతివృత్తమై, భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించగల రచయిత్రి. గాయపడిన కవీంద్రుని హృదయం.. అక్షర తుపాకులతో సాహిత్య సేద్యం చేస్తూ సమాజానికి వెన్నుదన్ను నిలిచారు.

మిగతాది తరువాయి భాగంలో

అభినందనలతో
బూర్గు గోపికృష్ణ
7995892410

You May Also Like

One thought on ““సాహితీ వాహిక” నెల్లుట్ల సునీత

  1. మేడం గారి కృషి అభినందనీయం.. 💐👏🏽🙏🏽

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!