సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

మసక మబ్బు మంచు తెరలను జరిపి
అర్కుడు ఏతెంచే మకర రాశిలోకి
సంక్రాంతి సంబరాల సరదాలు అంబరాన్ని అంటంగా తెచ్చే కొత్త శోభల్లు కూర్చుతూ
పచ్చపసుపు తోడ గడపలు విలసిల్ల హరిత పత్రముల తోరణాలు కట్టి,
పలు విరులహారాలు ఇల్లంత మెరియంగా,
సప్తవర్ణాల విరులెల్ల ఒళ్ళు విరుచుకొని విరిసె పరిమళాలు వెదజల్లంగ
మసక చీకట్లనే కోవెల గంటలు వీనుల విందై
గణ గణ మ్రోగంగా,
తిరుప్పావైతో అర్చకులు మార్గళి సంబరాలు జరప,
అమృతం లాంటి వేడి వేడి పొంగలి ప్రసాదము జిహ్వకే రుచులు నేర్పించే,
కోడి కూతతో కొమ్మలెల్ల లేచి
పచ్చని కళ్ళాపి వాకిళ్ల జల్లి,
ముత్యాల ముగ్గులు మురిపముతో వేసి,
రత్నాల రంగులతో హంగులేన్నో దిద్ది,
పసుపు కుంకుమలతోనూ, పుష్పాలంకరణలతో ముగ్గుల్ల ముచ్చటగ గొబ్బిళ్ళు పెట్టి,
పట్టుదోతి కట్టి, పట్టెనామాలు పెట్టి, చేత చిడతలు పట్టి,
శిరముపై నామాల చెంబు పెట్టి, కాళ్ల గజ్జెలు గల్లు గల్లుమని మ్రోగంగా,
హరిలో రంగ హరి అనుచు హరినామ కీర్తనలతో హరిదాసు వేంచేసే
పలు వర్ణ పట్టు వస్త్రాలతో శృంగముల అలంకృతమైన బసవన్నను తెచ్చి
అమ్మవారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టంటు విన్యాసాలు చూపంగ,
పాడిపంటలు పచ్చగ విలసిల్ల,
గాదెల నిండా ధాన్యాలు నిండా,
రైతుల కళ్ళల్లో మెరుపు తారకలు నిండగా,
పాలు పొంగినట్టు ఇంట్లో సిరిసంపదలు పొంగాలని అతివలంత చేరి పాలు పొంగించగా
భోగి మంటలు వేసి భాగ్యాలు కురియంగా ఇంటిల్లిపాది గాలిపటాల పోటీలు పెట్టంగా
బాలురకు దిష్టితీయ భోగి పళ్ళు పోసి, బొమ్మల కొలువులు, పేరంటాలు,
భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు నూతన వస్త్రాలు, పిండి వంటల్లు,
కొడుకులు కోడళ్ళు, కూతుర్లు అల్లుళ్ళు, మనుమలు మనుమరాళ్ళతో ఇంట్ల ఆనందాలు నిండ,
అమ్మనాన్నల మదిలోన సంతోష వర్షాలు తెచ్చె సంక్రాంతి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!