శ్రావణ సమీరాలు

శ్రావణ సమీరాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : పరిమళ కళ్యాణ్

“చూడు శ్రావణ్ ఎప్పుడూ నువ్వు చెప్పేదే వేదం అనుకోకు. అలా ఐతే చివరికి నీకు మిగిలేది వేదనే గుర్తుంచుకో!” అంటూ గట్టిగా సమాధానం చెప్పేసి, తిరిగి చూడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయింది సమీర, ఆగమని శ్రావణ్ ఎంత చెప్పినా వినకుండా. సమీర వెళ్ళినవైపే చూస్తూ, తను ఎందుకలా చెప్పాల్సి వచ్చిందోనని గుర్తుచేసుకున్నాడు శ్రావణ్.  శ్రావణ్, సమీరల కలయిక వింతగా జరిగింది. శ్రావణ్ తన స్నేహితుడు ప్రవీణ్ పెళ్ళి చూపులకోసం తోడుగా వెళ్ళాడు, అక్కడ కలిసింది సమీర పెళ్లికూతురుగా. శ్రావణ్ కి సమీర చూడగానే నచ్చేసింది, కానీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి అని కాస్త మనసులో బాధ పడినా సర్దుకున్నాడు. కానీ ప్రవీణ్ కి సమీర పెళ్లయ్యాక కూడా ఉద్యోగం చేస్తాననటం నచ్చలేదు. దాంతో ఆ సంబంధాన్ని కాన్సల్ చేసుకున్నాడు. తర్వాత రెండు మూడు సార్లు ఏదో వంకన సమీర ని కలిసేవాడు శ్రావణ్. నెమ్మదిగా ఆమెతో స్నేహం పెంచుకుని, తన ప్రేమని తెలియచేసాడు. దాదాపు సంవత్సరం తర్వాత అతని ప్రేమని ఆక్సిప్ట్ చేసింది సమీర. ఆ తర్వాత అంతా బాగుంది. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భవిష్యత్తు గురించీ ఎన్నో ప్లాన్లు వేసుకున్నారు. కానీ అంతలో జరగరానిది జరిగింది.

ఒకరోజు ఆఫీస్ నుంచీ ఇంటికి వెళ్తుండగా కార్ ఢీకొట్టి శ్రావణ్ కి ఆక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. హాస్పిటల్లో చేరాక తెలిసింది అతనికి పిల్లలు పుట్టే అవకాశం లేదని. అలాంటి తనతో జీవితం ఎలా పంచుకుంటుంది అని సమీరను దూరం పెట్టసాగాడు. ఆ విషయం తెలియని సమీర అతను దూరం పెడుతుంటే సహించలేక పై మాటలు చెప్పి వెళ్ళిపోయింది. అప్పటినుండి శ్రావణ్ ఆమెకి ఫోన్ కూడా చెయ్యలేదు. కొద్దీ రోజుల్లో అసలు విషయం తెలుసుకున్న సమీర శ్రావణ్ దగ్గరకి వచ్చింది. “శ్రావణ్ నువ్వెందుకు నాతో అలా ప్రవర్తించావో, ఎందుకు నన్ను దూరంగా ఉంచావో నాకూ తెలిసిపోయింది. అసలు సంగతి దాచి పెట్టి, ఏవేవో కారణాలు చెప్పి నన్ను వదిలించుకుంటావా?” అంటూ ఏడుస్తూ చెప్పింది సమీర. సమీర అలా ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక పోయాడు శ్రావణ్. “అది కాదు సమీరా, నాతో నీకు ఏ రకమైన సుఖం సంతోషం ఉండదు, అలాంటి నన్ను జీవితాంతం ఎలా భరిస్తావు?” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా అడ్డుపడి,
“చూడు శ్రావణ్ నేను నీలో నీ అందాన్ని నీ మగతనాన్ని చూసి కాదు నిన్ను ప్రేమించింది, నీ మంచి మనసుని చూసి. మనకి పిల్లలు పుట్టక పోతే ఏమి, లోకంలో ఎంతో మంది అనాథ పిల్లలున్నారు. వాళ్లలో ఎవరో ఒకర్ని మనం దత్తత తీసుకోవచ్చు. నాకూ నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఒకవేళ నాకూ అదే పరిస్థితి వస్తే నువ్వు నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోగలవా చెప్పు?” అని నిలదీసింది.
దాంతో సమాధానం చెప్పలేని శ్రావణ్ సమీర చూపించే ప్రేమకి చలించిపోయాడు. వెంటనే సమీరని అక్కున చేర్చుకున్నాడు. “సమీరా అలా మాట్లాడకు. నువ్వంటే నాకు ప్రాణం. నీకు దూరంగా ఉండటం అంటే ప్రాణం వదిలెయ్యటమే. కానీ నా గురించీ తెలిసీ మన పెళ్ళికి ఎవరూ అంగీకరించరు. నీ భవిష్యత్ నాశనం చెయ్యటం నాకు ఇష్టం లేక అలా అన్నాను. నన్ను క్షమించు సమీరా!” అన్నాడు కన్నీళ్ళని కంటి కొనల నుండి బయటకి రానివ్వకుండా.      “శ్రావణ్, అదే నీ బాధ అయితే మా పెద్దవాళ్ళని నేను ఒప్పిస్తాను. చూడు మన ఈ ప్రయాణం సాగుతూనే ఉండాలి మరో మైలు రాయి ఆహ్వానం పలికే దాకా!” అని శ్రావణ్ ని హత్తుకుంది సమీర.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!