“వట్టిమర్తి గట్టి పిడికిలి మట్టి రూపం” నర్రా ప్రవీణ్ రెడ్డి

” వట్టిమర్తి గట్టి పిడికిలి మట్టి రూపం ” నర్రా ప్రవీణ్ రెడ్డి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: బూర్గు గోపికృష్ణ

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన నర్రా వెంకటలక్ష్మి, రాంరెడ్డి దంపతులకు జన్మించినవారు నర్రా ప్రవీణ్ రెడ్డి. పాఠశాల చదువుకునే రోజుల్లో నుండే సాహిత్య సేద్యం చేస్తూ తెలుగు సాహిత్య జగత్తులో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న యువకవితా తరంగం నర్రా. 1 నుంచి 10వ తరగతి వరకు నార్కట్ పల్లిలో పాఠశాల స్థాయి విద్యను అభ్యసించి, ఇంటర్ రామన్నపేట

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నల్లగొండలో, పీజీని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. అక్కడే చదువుతుండగా పీజీ రెండవ సంవత్సరంలోనే జాతీయ స్థాయిలో జే ఆర్ ఎఫ్ సాధించి పి.హెచ్ డీని పొందారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే నాటి ప్రజాశక్తి దినపత్రికకు లేఖలు రాసి సామాజికాభివృద్ధికి బాటలు వేశారు. పాలకులకు ప్రశ్నలు సంధించారు. నాడు “ముఖ్యమంత్రి గారూ వినండి ఓ విద్యార్థి విషాద గాథ”, “అక్రమ ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలి” వంటి లేఖలు దినపత్రికలో రాగా నర్రాను ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళూ ఉన్నారు. అయినా వారికి జంకకుండా సమాధానాలు ఇచ్చిన అభ్యుదయవాది నర్రా.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తన కళ్ల ముందు జరుగుతున్న సంఘటనలను తెలంగాణ పల్లె జీవన విధానాన్ని, చరిత్రను ఆనాటి సామాజిక రాజకీయ విద్యా సంస్కృతిని తనలో నింపుకుని నడిచిన ఈ కాలపు ప్రజా రచయిత నర్రా. అందుకే తను రాసిన పొత్తి నవల తెలంగాణా మట్టి పొత్తిళ్ళ పరిమళంతో పురుడుపోసుకుంది. “గాయాల పాలవ్వడం నర్రాకు కొత్తేంకాదు,మనసుకైనా గాయం నుండి ఉద్భవించే భావన లోంచి రచన చేసే నేర్పరి ఆయన” అంటూ పబ్లిషర్స్ నర్రాను గురించి పుస్తకంలో రాసారు అవి అక్షర సత్యం. నేను కళ్ళారా ఆయన కష్టాలను, నష్టాలను చూసాను. చిన్న వయసులో అపరిమిత జ్ఞానం ఉండటమే కాక ఎంతటి కష్టాన్నైనా జయించగలిగే ధృడ స్వభావం కలవాడు ఆయన. అందరినీ అక్కున చేర్చుకునే సంస్కారం గలవాడు. ఎందరికో సహాయం చేయాలనే , జ్ఞానం పంచాలనే తపన కల విజ్ఞాన వివేకవంతుడు నర్రా.
తన స్వగ్రామం వట్టిమర్తి ఆ వూరి నుండి ఎదిగొస్తున్న చైతన్యపు కోట ప్రవీణ్. అలవోకగా అన్ని అంశాలపై తిరుగులేకుండా మాట్లాడటం ఆయనలో నేను గమనించిన ఒక విషయం మాత్రమే. నాతోటి స్నేహితులలో ఎవరూ ఇలా కనిపించలేదు నాకు ఇప్పటి వరకు. తను వేదికలపై మాట్లాడుతుంటే, పాట పాడుతుంటే విని నేనూ, నాతోపాటు ఉండే మరో మిత్రుడు కడారి మల్లేష్ ఆశ్చర్యపోయే వాళ్ళం. మట్టి మాట్లాడుతున్నట్టు, మా వట్టిమర్తి ఘర్జిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయన మాట్లాడుతుంటే. తన ప్రసంగంలో బిగబట్టిన గట్టిపిడికిలి, దిశా నిర్దేశం చేసే చేతి వేళ్ళు, నిట్ట నిలువుగా నిలబడ్డ విగ్రహం లాంటి శరీరం మాకో స్ఫూర్తి పాఠం. అలా నర్రా ఆలోచన చేసి చెప్పిన మాట భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. మళ్లీ మళ్లీ వినాలని ఉంటుంది.
కూరెళ్ళ విఠలాచార్యగారు పుస్తకానికి ముందుమాట రాస్తూ నర్రా రాఘవరెడ్డికి సాహిత్య, సాంసృతిక వారసుడు ప్రవీణ్ అన్నారు. తన తాత వరస అయిన నర్రా రాఘవరెడ్డి నకిరేకల్లుకు 35 సంవత్సారాలు శాసన సభ్యులుగా పనిచేసారు. అప్పుడు ఆయన గొల్లసుద్దుల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. ఇప్పుడు ప్రవీణ్ కూడా తన పొత్తి వంటి రచనలతో సాహిత్య, సాంస్కృతిక చైతన్యాన్ని జిల్లా వ్యాప్తంగా పంచుతున్నారు. నిజానికి నల్లగొండ జిల్లాలో ఉధృతంగా సాహిత్య సభలు, కార్యక్రమాలు చేసి సచ్చుబడి ఉన్న కవులను నిద్ర లేపిన ఘనత ప్రవీణ్ ది. వయసు చిన్నదైన అందరినీ ఏకం చేసి సభలను నిర్వహించారు. ముఖ్యంగా ఉపాధ్యాయ సాహితీకారులను ఒక దగ్గరికి చేర్చి వారిలో సాహిత్య స్పృహను రెట్టింపు చేసిన సాహితీ సవ్వడి ప్రవీణ్ రెడ్డి. చిరుప్రాయంలో అది సాధ్యం చేయడం చెప్పదగిన అంశం.
“కాలం బంధించిన క్షణాలు” అనే కవితా సంకలనం కరోనా నేపథ్యంలో తీసుకువచ్చారు నర్రా. ఇది మొత్తం తెలుగులోనే మొదటగా కరోనాపై వచ్చిన సంకలన గ్రంథం. పుల్వామా ఘటన

దృష్ట్యా “ఎవరెస్టు కన్నా ఉన్నతం” కవితా సంకలనానికి సహాసంపాదకత్వం వహించారు. అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించారు. వ్యాసాలు రాశారు. కవితలు ఎనిమిదవ తరగతి నుండే రాస్తూ వచ్చారు. పానం, రేగివండ్లు, పార్ట్ టైం, మైల వడ్డ ఇళ్ళు కథలు రాశారు. ఫ్లోరోసిస్ పై, హరితహారంపై, ఎన్ ఎస్ ఎస్ పై, నిరుద్యోగంపై డిగ్రీ పూర్తయ్యే నాటికే పాటలు రాశారు.” హరిత హారమే .. నీకు హరిత హారమే” అనే పాటను జిల్లా జాయింట్ కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ విడుదల చేశారు.
“నల్లగొండ జిల్లారా విప్లవాల ఖిల్లారా… నీలగిరి జిల్లారా ఈ గడ్డ ఉద్యమాల బిడ్డరా.. ఫ్లోరైడ్ కు బలైన బిడ్డల జూస్తూ దీనంగా జూస్తుంది రా ఈ గడ్డ దిగులు చెంద బట్టెరా…” అనే పాట సామాజిక చైతన్యానికి బాటలు పరిచిన పాట. ఈ పాటలో ఎడవెల్లి, నైబాయి వంటి గ్రామాల ప్రస్తావన , పాలకుల పట్టింపులేని తనం రాయబడినవి.
ఉద్యమ ఖడ్గం- పోరు పతాకం ‘ పొత్తి ‘ :
తెలంగాణ మాండలికంలో అచ్చమైన పల్లెభాషలో నర్రా ప్రవీణ్ రాసిన నవల పొత్తి. పలుకుబడులు, తెలంగాణా నుడికారం , పల్లెల జీవితం కలగలిస్తే రూపొందిన నవలగా ఇది చెప్పవచ్చు. డా.ఎస్ రఘు ఈ నవలను , రచయితను గురించి ఇలా అంటారు – “నాడు వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి ద్వారా ఆనాటి తెలంగాణ ప్రాంతంలోనెలకొన్నతీవ్రమైన పరిస్థితులను , సంక్షోభాలను, ధిక్కారాలను శక్తివంతంగా ప్రకటించాడు.నర్రా ప్రవీణ్ క్యాంపస్ విద్యార్థి ద్వారా సమకాలీన తెలంగాణ సమాజాన్నిచిత్రిస్తూ సంక్షేమజీవన గమనాన్ని ఆశిస్తున్నాడు.”. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రధానంగా రాయబడిన ఈ నవల దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, వట్టికోట ప్రజల మనిషి వంటి నవలల కోవకు చెందుతుంది. ప్రముఖ విమర్శకులు ఆంజనేయులు గారు అన్నట్లు నర్రా నల్లగొండకు మరో వట్టికోట. ఇటీవలే ఈ నవలకు సాహితీ బృందావన జాతీయ వేదిక అధ్యక్షురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత గారు “పొత్తి” నవలకి పాలపిట్టాతొలి యువ పురస్కారం ప్రకటించారు. రాజావాసిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం కూడ ఈ నవలకు గతంలో వచ్చింది. అలా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది పొత్తి.

ఒక సామాజిక కార్యకర్తగా నర్రా :
తను ఇంటర్ చదువుకున్న రోజుల్లోనే రామన్నపేట ప్రభుత్వ కళాశాలలో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. వేమవరంమనోహర్ పంతులు వంటి వాళ్ళ ఆశీస్సులతోఅక్కడ గ్రామాల్లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. తన కాలనీలోనూ మొక్కలను నాటారు.
విద్యార్థిచైతన్యప్రసంగాలను రామన్నపేట ప్రభుత్వ కళాశాలలో చేసేవారు. పర్యావరణ పరిరక్షణ కోసం NSS వాలింటర్ గా తను చేసిన కృషిని గుర్తించిన విశ్వవిద్యాలయం తను డిగ్రీద్వితీయసంవత్సరంలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని నార్ఖండ ప్రదేశానికి సాహస కృత్య శిబిరానికి పంపింది. డా. ఆకుల రవి గారి సలహాలు, సూచనలతో అక్కడ పది రోజుల క్యాంప్లో పాల్గొని ఏ గ్రేడ్ సంపాదించి తెలంగాణకు వచ్చారు. మెగా క్యాంప్, వింటర్ క్యాంపులతో పాటు వన్ డే క్యాంపుల్లో భాగంగా ఎయిడ్స్అవగాహన, మెడికల్, మొక్కలు నాటడం- హరితహారం, వ్యక్తిత్వ వికాస అవగాహన, ఎలక్షన్ క్యాంపులు , యువజన ఉత్సవాల సందర్భంలో క్యాంపులు తదితరాలు పాల్గొని సమాజంకై కలిసి నడిచారు.మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ ఏర్పాటు చేయాలని సమితిని ఏర్పరిచి పోరాడి నాటి ఉపకులపతి అల్తాఫ్హుస్సేన్ ను , రిజిస్ట్రార్యాదగిరి గార్లను ఒప్పించి తెలుగు శాఖను సాధించిన ఘనత నర్రా ప్రవీణ్దే.జన భారతి సాహిత్య సంస్థ నిర్వాహకుడి గానే గాక తెలంగాణ తెలుగు పరిశోధక మండలికి అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. చిన్న వయస్సులోనే దానగుణం ఉండటం నర్రాలో కనిపించే ఒక లక్షణం. ఉన్నదాంట్లోనే నలుగురికి పంచే గుణం ఆయనదని చెప్పవచ్చు. సూర్యాపేట, కక్కిరేని గ్రామీణ లైబ్రరీలకు పుస్తకాలను చేరువ చేశారు. మిత్రులకు నా కళ్ళముందే ధన సహాయం చేసిన విషయాలూ ఉన్నాయి. తన తాత గారైన నర్రా భగవంత రెడ్డి కూడా వట్టిమర్తి గ్రామంలో దళితులకు భూమిని ఇచ్చారు. గ్రామపంచాయతీ కార్యాలయం, ఖాదీ సెంటర్, ప్రైమరీ స్కూల్ కి కూడా నర్రా భగవంత రెడ్డి భూమిని నిస్వార్థంగా రాఘవరెడ్డి సూచన మేరకు ఉదారంగా దానం చేయడంతో ఊరికి ఎంతో మేలు జరిగింది.

నర్రా ఆత్మీయ మిత్రుడు. మా సొంత ఊరు వట్టిమర్తి కావడం నాకు చాలా సంతోషించదగ్గ విషయం. నర్రా రాఘవరెడ్డి వారసుడు కావడం ఇంకా గొప్ప విషయం. ఆయనలో గుణమే నర్రా ప్రవీణ్ లోనూ మనకు కనిపిస్తుంది.నాకైతే ఒక నర్రా రాఘవరెడ్డి లేని లోటును ప్రవీణ్ తీరుస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను ప్రోత్సహించటంలో నర్రాతో పాటుగా కూరెళ్ల విఠలాచార్య, ఏనుగు నరసింహారెడ్డి,నెల్లుట్ల సునీత, కూరెళ్ళ శ్రీనివాస్, ఉప్పలయ్య పాత్ర మరువలేనిది.ఎక్కడ ఏ సాహిత్య కార్యక్రమాలు జరిగినా నాకు తెలియపరచి, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మిత్రుడు నర్రా ప్రవీణ్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

ఉద్యమాభినందనలతో..
మీ బూర్గు గోపికృష్ణ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!