వీడని రహస్యం

(అంశం : “సస్పెన్స్/థ్రిల్లర్”)

వీడని రహస్యం 

-తిరుపతి కృష్ణవేణి

నారాయణ సరస్వతి దంపతులను అందరూ వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. వారికి జరిగిన కష్టం అంతా ఇంతా కాదు? అది విన్న వారికే, హృదయం ద్రవించి పోతుంది. వచ్చిన వారందరితో జరిగిన విషయాలను చెప్పుకుంటూ, గడచిన మధుర స్మృతులను తలచుకుంటూ గుండెలవిసేలా, రోదిస్తున్నారు.
వాళ్ళను చూస్తున్న ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.
అయ్యో! పాపం అనటం తప్ప వారి బాధను ఎవరు తీర్చగలరు? పైగా తమ బాధ కన్నా చుట్టు పక్కల వారి సూటి పోటి మాటలకే ఎక్కువ బాధగా బాధ పడుతున్నారు.
ఏమయి పోయావు చిట్టి తల్లీ! ఎటు వెళ్ళి పోయావు? ఎక్కడ వున్నావు? ఎందుకు వెళ్ళి పోయావు? ఏమి తక్కువ చేసాము తల్లీ నీకు!అంటూ గుండె పగిలేలా రోధిస్తుంది సరస్వతి .

నారాయణ సరస్వతి లకు ఒక్కగానొక్క కూతురు శ్వేత ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసారు. శ్వేత చూడటానికి ఎంతో ముచ్చటగాఉంటుంది. చదువుతో పాటు అందమైన ముఖ వర్చస్సు.
సరస్వతి దేవిలా ఉంటుంది.
తండ్రి నారాయణకు కూతురు శ్వేత అంటే, ఎంతో ఇష్టం. అలాగే శ్వేతకి కూడా తండ్రి అంటే ఎంతో గౌరవం,ప్రేమ! చిన్నతనం నుండి శ్వేతను చాలా అల్లారు ముద్దుగా పెంచారు. శ్వేతను విడిచి వుండే వారు కాదు. అలా,శ్వేత కాలేజీ చదువులకు బయటకు వెళ్ళినతరువాత అమ్మ కంటే నాన్న మీద ఎక్కువ బెంగ పెట్టుకునేది.
ఎంత కష్టం అయినా ప్రతీ వారం వెళ్ళి కూతుర్ని చూసి వచ్చే వాడు నారాయణ. అలా రెండు సంవత్సరాలు కష్టపడి చదువుకుంది ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ సాదించింది. టీచర్ ఉద్యోగం అంటే శ్వేతకు చాలా ఇష్టం. అందుగురించి డిగ్రీ తర్వాత బి.ఇడి. పూర్తి చేసింది. నారాయణ దంపతులు కూడా కుమార్తె కష్టపడి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినందుకు ఎంతో సంతోషించారు. ఉపాధ్యాయ పోటీ పరీక్షల్లో విజయం సాధించి టీచర్ ఉద్యోగం సాధిస్తే మంచి సంబంధం చూచి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
క్రొత్తగా స్వంత ఇల్లు కూడా నిర్మించుకున్నారు. అవసరమైతే కూతురు తమ కళ్ళముందే ఉండేట్లు వీలు అయితే ఇల్లరికపుటల్లుణ్ణి తెచ్చుకోవాలని, సరస్వతి నారాయణల ఆలోచన. అమ్మాయికి జాబ్ వచ్చిన తరువాత అన్నీ విషయాలు మాట్లాడుదాం! అని అనుకున్నారు. పోటీ పరీక్ష వ్రాసి ఇంటికి చేరుకుంది శ్వేత.
వచ్చిన వారం రోజుల తరువాత శ్వేత పుట్టిన రోజుసందర్భంగా ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరపాలని అమ్మ సరస్వతి ఆలోచన! ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ పుట్టిన రోజు వచ్చినా కూతురు హాస్టల్లో వుండటం గానీ, లేదా! పరీక్షలు ఉండటం వలన గానీ పుట్టిన రోజు జరుపుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ సారి అయినా మంచిగా జరిపించాలని తల్లి ఆలోచన. అనుకున్నట్టు గానే ఆరోజు రానేవచ్చింది. తెల్లవారితే శుక్రవారం శ్వేత బర్త్ డే, శుక్రవారం తమ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని ఆమె వుద్దేశ్యం ఈ రోజే,చుట్టు
ప్రక్కల వారిని,ముఖ్యమైన బంధువులను, స్నేహితులను పిలవాలని నిర్ణయించుకున్నారు నారాయణసరస్వతి
దంపతులు.
పెళ్ళీడుకు వచ్చిన అమ్మాయి కనుక నలుగురు బంధువుల దృష్టిలో పడుతుంది మంచిపెళ్లి సంబంధాలువచ్చే అవకాశం ఉంటుంది అని భారీగా ఫంక్షన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అనుకున్నట్లు గానే, అందరికి ఆహ్వానాలు పంపారు, నారాయణ దంపతులు. శ్వేత మాత్రం ఎందుకమ్మా! ఇంత ఆర్భాటం? మాములుగా జరుపుకుంటే బాగుంటుంది కదా? ఇంత పెద్దఖర్చు నాన్నకు భారం కదా! అని తల్లి దండ్రులను మందలించింది శ్వేత. నాకు ఇలాంటివి నచ్చవు అని మీకు తెలుసు కదా! ఇంతమందిని ఎందుకు పిలుస్తున్నారు నాన్న అంది గారాలు పోతూ శ్వేత.
పోనీలే అమ్మా!మీ అమ్మ సంతోషంగా చెయ్యాలి అన్నది, కాదంటే నానా రభస చేస్తుంది. ఉదయంలేచి తయారవ్వాలిగా పెందలాడే పడుకో అమ్మా! నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేయిస్తున్నాము.
సరే నాన్న!నాకు నిద్రవస్తూంది పడుకుంటాను అంటూ తన బెడ్ రూంలోకి వెళ్ళింది శ్వేత.
ఉదయం చేయాల్సిన పనులు అన్నీ మనసులో మెదులుతుంటే సరస్వతికి అసలు నిద్రే పట్టలేదు? ఎప్పుడో! తెల్లవారు జామున మెల్లగానిద్ర లోకి జారుకుంది.
ఉదయం లేచిన సరస్వతి అయ్యో! లేటుగా పడుకోవటం వలనకాబోలు అసలు మెళుకువే రాలేదు! ఫంక్షన్ సాయంత్రం 5=00 గంటలకు అనిఅందరికి చెప్పాము. త్వరగా పనులు ముగించు కొని అందరూ వచ్చే టైమ్ కి కాస్త రిలాక్షుగా తయారై వుండాలి అనుకుంటూ చిట్టితల్లీ ! లేచావా! అని శ్వేతను పిలిచింది. పోనీలే! కాసేపు పడుకోనీలే! లేచి మాత్రం ఏమి చేస్తుంది? సాయంత్రం కదా! బర్త్ డే పార్టీ ఇన్ని రోజులు చదువు పేరుతో హడావిడిగా పొద్దున్నే లేచేది! ఇప్పుడన్నా కాస్త రెస్టు తీసుకోనీ, చిట్టితల్లిని అన్నాడు భర్త నారాయణ సరేలే! అనుకుంటూ, భర్తకు టీ, ఇచ్చి టిఫిన్ సిద్ధం చెయ్యటంలో నిమగ్నమైంది సరస్వతి.
టిఫిన్ చేసిన తరువాత ఏంటి అమ్మాయి ఇంకా లేవలేదు, ఒంట్లో గానీ బాగోలేదా! అనుకుంటూ చిట్టి తల్లీ ! చిట్టితల్లి! అని పిలుస్తూ బెడ్ రూమ్ డోర్ కొట్టింది.
డోర్ తీసివుండటంతో ఓ! లేచావా! ఇంకా లేవలేదేమో! ఒంట్లో గానీ బాగోలేదా! అని భయపడ్డాను. అని శ్వేత బెడ్ వైపు చూసింది.
బెడ్ మీద లేకపోవటంతో బాత్ రూంకు వెళ్లిందేమో నని అటువెల్లి చూసింది. అక్కడా కనిపించక పోయిసరికి నారాయణ దంపతులు ఆందోళనతో బయటంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు ? నా కూతురుకు ఏమయింది, అని గుండెలు బాదుకుంటూ,
భోరున విలపించసాగింది సరస్వతి.
కొద్ది సేపట్లోనే ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది.
అందరూ వచ్చి ఓదార్చి పోతున్నారు. అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లిందేమి? ఫోన్ ఏమైనా చేస్తుందేమో చూడండి అన్నారు కొందరు.ప్రేమించిన వాడితో వెళ్లిందేమో అన్నారు
ఇంకొందరు! ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చర్చించుకుంటున్నారు.
ఇంతలో బెడ్ రూంలో ఒక ఉత్తరం కనిపించింది.
అమ్మా, నాన్నలకు, నేను వెళుతున్నాను. నాగురించి వెతకవద్దు. నన్ను క్షమించండి.
ఇట్లు.
మీ శ్వేత.. ఇదీ ఉత్తరం యొక్క సారాంశం.
వివరాలు ఏమి లేవు.
ఎక్కడకు వెళ్ళింది. ఎవరితో వెళ్ళింది. పోనీ తనకిష్టమైన వాడితో వెళితే ఆ విషయం వ్రాయవచ్చు కదా! నాలుగు రోజులు పోతే అదే తిరిగి వస్తుందని అనుకొనే వాళ్ళము. అంతు చిక్కని ఆలోచనలతో నారాయణ దంపతులు
సతమతమవుతున్నారు.
వారి దుఃఖాన్ని ఓదార్చే వారు కనపడంలేదు.
ఆమె స్నేహితులకు, బంధువులకు, సన్నిహితులకు ఫోన్లు చేసి వాకబు చేసారు. ఎవరుకూడా వచ్చినట్లు గాని, ఆమెను చూసినట్లు గాని చెప్పటం లేదు?
అన్ని ప్రాంతాలు వెతుకుతున్నారు. లాభం లేదు? శ్వేత ఆచూకీ ఏ మాత్రం లభించలేదు. అప్పటికి వారం రోజులు గడిచాయి.
ఇంక ఆలోచించకుండా అమ్మాయి కనిపించటంలేదని పోలీస్ లకు కంప్లంట్ ఇచ్చారు. ఒక ప్రక్క పోలీసులు వెతకటం ప్రారంభించారు.
ఎంత వెతికినా పోలీస్ లకు కూడా అమె ఆచూకీ లభించలేదు. రెండవ నెలగడుస్తుంది.
ఎవరో మేకల కాపరి అందించిన సమాచారం మేరకు గోదావరి తీరాన
దట్టమైనాచెట్లు, గుట్టల మధ్య
నిర్మామానుష్యoగా ఉన్న ప్రాంతంలో ఒక కాలి పోయిన శవం చెట్టుకు కట్టివేసి ఉన్నట్లు తెలుసుకొని పోలీస్లు శ్వేత తల్లి దండ్రులను తీసుకొని అక్కడికి వెళ్లారు.
శవం సగం కాలిపోయి, ఎండిపోయి చెట్టుకు అతుక్కొని ఉంది. వేసుకున్న బట్టలు కాలకుండా మిగిలిన ఆనవాళ్ళను బట్టి శ్వేత దుస్తులుగా గుర్తించారు. ఫోన్ పగులగొట్టి ప్రక్కన ఉంది. స్విమ్ము అందులో లేదు. అమె హ్యాండ్ బ్యాగ్ ప్రక్కన చించి వేయబడి ఉంది. ఈ ఆనవాళ్ళ ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు.
అన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేసి శవాన్ని తల్లి దండ్రులకు ఒప్పగించారు.ఎప్పటిలాగానే ఆందోళనలు, ధర్నాలు, మహిళా సంఘాల రాస్తా రూకోలు నిర్వహించారు.
పోలీస్ లు కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.
పుట్టెడు కన్నీటితో ఆమాంసం ముద్దను బట్టల్లో చుట్టుకొని ఉన్నఊరుకు తీసుకు వచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.
నేటికీ హంతకుడెవరో దొరక లేదు.
శ్వేతను ఎవరు తీసుకు వెళ్లారు? ఎందుకు చంపారు? ఉత్తరం ఎవరు వ్రాయించారు? శ్వేత మనస్సును మార్చింది ఎవరు? అన్నీ శేష ప్రశ్నలు గానే మిగిలి పోయాయి? అసలు మరణించింది
తమకూతురేనా? నారాయణ దంపతులకు వీడని రహస్యాంగానే మిగిలి పోయిందితమ కూతురు మరణం?హంతకున్ని ఎప్పటికైనా పట్టుకుంటారేమోనని,
భారమైన హృదయాలతో జీవచ్చవాల లాగా బ్రతుకు
ఈడ్చుకుంటూ కాలం గడుపు తున్నారు నారాయణ దంపతులు

.***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!