విచారణ

(అంశం : “సస్పెన్స్/థ్రిల్లర్”)

విచారణ

– చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

కరెక్టుగా రాత్రి పన్నెండయ్యింది.సుమన్ ఫోన్ రింగ్ అయింది.బయటికెళ్ళాలని సుమన్ బయలుదేరాడు.అర్థరాత్రి అపరాత్రి లేకుండా ఏంటండీ ఈ పరుగులు అని విసుక్కుంటూ తలుపు తీసి బయటకి పంపింది ఎస్.పి సుమన్ భార్య మైత్రి.

సుమన్ కాల్ చేసి
“హలో..వెంకట్ విచారణ పూర్తయిందా ”
“సార్…అసలు విషయం నేను చెప్పలేను సార్.హోం మినిస్టర్ గారు రమ్మంటున్నారు వెంటనే రండి”అన్నాడు వెంకట్.

మీటింగ్ అయిపోయాక విపరీతమైన టెన్షన్ తో వచ్చాడు సుమన్.మళ్ళీ ఫోన్ వచ్చింది.
సుమన్ హడావిడిగా బయట అడుగు పెట్టగానే చినుకులు మొదలయ్యాయి.”మైత్రీ ..గొడుగు తీసుకురా” అన్నాడు.గొడుగు తీసుకు రావడానికి వెళ్ళింది మైత్రి.
కారు వెనుక ఎవరో కదిలినట్లనిపించింది.సుమన్ వానని లెక్కచేయక కారు చుట్టూ వెతికేశాడు.గుండె వేగంగా కొట్టుకుంటుంది.కోపం తన్నుకొస్తూ ఉంది.ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు. మైత్రి ఇంకా రాలేదేమిటి అనుకుంటూ తలుపుకి తాళం వేసి లోపలికి వెళ్ళాడు.ఇంట్లో మైత్రి లేదు పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు.”మైత్రీ “అంటూ రెండు మూడు సార్లు అరిచాడు.కాసేపటికి “వస్తున్నానండీ”అనడంతో టెన్షన్ తీరింది.సుమన్ సోఫాలో పడుకొని అలాగే నిద్రపోయాడు.నిద్ర లేచే సరికి ఇంట్లో ఎవరూ లేరు మేడపైకెళ్ళుంటారనుకొని పైకెళ్ళాడు.అక్కడా లేరు.మైత్రీ అంటూ అరిచాడు.ఉలుకూ పలుకూ లేదు.పక్కింటి మేడవైపు చూశాడు.పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు.అందరూ అక్కడే ఉన్నట్లున్నారని వెళ్ళాడు.”మైత్రీ చెప్పకుండా వచ్చేస్తే ఎలా.”అనడంతో “ఏంటండీ..ప్రతీ దానికీ టెన్షన్ పడతారు.మీ టెన్షన్ లన్నీ స్టేషన్ లోనే వదిలేయండి.ఇంట్లో ప్రశాంతంగా ఉండండి”అంది మైత్రి.పక్కింటి ఎస్.ఐ పద్మారావు భార్య శకుంతల “అదేంటన్నయ్య గారూ ఎస్.పి అయ్యుండి మీరే టెన్షన్ పడితే ఎలా.ఇంట్లోనైనా హ్యాపీగా ఉండండి “అనడంతో సుమన్”ఒక ఇన్వెస్టిగేషన్ లో ఇబ్బంది పడుతూ ఉన్నాలేమ్మా,
మైత్రీ రా ఇంటికి “అంటూ అందరూ ఇంటికెళ్ళారు.
అసలేమైందండీ అని మైత్రి అడగడంతో సుమన్ కథ మొదలెట్టాడు.”విజయ్ విలేఖరి గా పనిచేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాడు.జనాల్లో సామాజిక స్పృహ కలిగించే వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో హుందాగా వ్యవహరించేవాడు.విజయ్ టాలెంట్ కి మెచ్చి ఎంతో మంది ఆఫర్స్ ఇచ్చినా తిరస్కరించి తనను నమ్ముకున్న చిన్న చానెల్ లోనే ఉండిపోయాడు.అంత ఆనందంగా ఉండే సమయంలో ఆత్మహత్య చేసుకొని కలకలం రేపాడు.అభిమానులంతా ఎవరో హత్య చేసి ఉంటారని,విజయ్ అంత పిరికివాడు కాదని వారి వారి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేశారు.దాంతో హోమ్ మినిస్టర్ విచారణకి ఆదేశించారు.”అదే పెద్ద టెన్షన్ అన్నాడు.మైత్రి విచారణ అయ్యాక దోషిని పట్టుకుంటారు అంతే దానికెందుకు టెన్షన్ ఇలాంటివి ఎన్ని కేసులు చూడలేదు మీరు అంటూ ధైర్యం చెప్పింది.ఇంతలో సుమన్ ఫోన్ రింగ్ అయింది ,ఫోనెత్తిన సుమన్ టెన్షన్తో వణికిపోతున్నాడు.తల తిరిగిపోవడంతో సోఫాలో కూలబడి ఏడుస్తున్నాడు.అంతా చూస్తున్న పిల్లలు ,మైత్రి దగ్గరికి వచ్చి కూర్చున్నారు.మైత్రి ఏంటండీ మీ సర్వీసులో ఎప్పుడూ ఇలా చూడలేదు ఏమైందో చెప్పండి అంటూ అడగడంతో సుమన్ తడబడుతూ బెరుకు స్వరంతో “విచారణ పూర్తయిపోయింది.నిజానికీ అది ఆత్మహత్యే.ఇంట్లో పర్సనల్ గొడవల వల్ల విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.”అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.మైత్రి ఎందుకండీ బాధపడుతున్నారు.ఎంక్వయరీ అయిపోయాక ఇంకేముంది .హాయిగా ఉండండి అంటుండగా ఫోన్ రింగ్ అయింది ఫోన్ ని చూసి సుమన్ దూరంగా పరిగెత్తి దాక్కుంటున్నాడు.మైత్రి ఫోన్ తీసి ఎవడ్రా నువ్వు ఎస్.పి గారినెందుకో బెదిరిస్తున్నావ్.నాకు అసలు విషయం తెలిసిందంటే అందర్నీ ఊచలెక్కిట్టిస్తా అంటూ ధైర్యంగా హోం మినిస్టర్ లెవెల్లో మాట్లాడింది.సుమన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం మాట్లాడావే ప్రాణాలమీదకి తెచ్చేశావు అంటూ మోకాళ్ళపై కూర్చున్నాడు.మీరు అసలు విషయం చెప్పకుండా ఇలా టెన్షన్ పడితే నేను భరించలేను ఏదైనా ఫటాఫట్ క్లారిటీ ఉండాలి అంటూ మైత్రి హద్దులు దాటి మాట్లాడుతుంటే సుమన్ ఓపెన్ అవ్వక తప్పలేదు.”మైత్రీ ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎవరితో అనుకుంటున్నావ్ భయం లేకుండా మాట్లాడావ్?”అన్నాడు సుమన్.”ఎవడో రౌడీ వెధవ ,ఆయనేమైనా హోం మినిస్టరా భయపడేదానికి”అంది మైత్రి.దానికి సుమన్ “అవును ఆయన హోం మినిస్టరే”అనడంతో మైత్రికి గుండె గతుక్కుమంది”ఆయనెందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు “అని అడిగింది.చెప్తా విను”విజయ్ ది ఆత్మహత్యేనని తెలిశాక ఈ కేసుని రాజకీయం చేయడానికే విచారణకి ఆదేశించారు.అది నాకు తెలియక మళ్ళీ విచారణ పూర్తిగా చేసి నివేదిక సమర్పించే సమయంలో ఎదురుగా ఉన్న హోం మినిస్టర్ ఈ నివేదికను ప్రతిపక్షంలో ప్రధానమైన నాయకుడే హత్య చేసినట్లు మార్చమని ఆదేశించాడు.దాంతో నేను ఖంగు తిన్నా.నేను ససేమిరా చేయను అనేసరికి మిమ్మల్ని చంపేస్తానంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు.ఆయనకి చదువురాకపోయినా నాకు సుపీరియర్ కదా అని ఆయన చెప్పిన తప్పు చేసి నా నైతికతకి పాడి కట్టలేను.మిమ్మల్ని పోగొట్టుకోలేను.ఇప్పుడేం చేయాలో తెలియక ఆవేదనలో ఇలా ఉన్నానంటూ అసలు విషయాన్ని చెప్పడంతో మైత్రి ఆశ్చర్యంతో ప్రజలు నమ్ముకున్న నాయకులే ఇలా నేరాలు చేస్తూ అధికారులను ఒత్తిడికి గురిచేస్తుంటే మీకు హక్కులు లేవా అంటూ ప్రశ్నించింది.సుమన్ ఎందుకు లేవు హక్కులు పుస్తకాల్లో నిద్రపోతున్నాయంటూ నిట్టూర్చాడు.మా ప్రాణాలు పోయినా సరే మీరు తప్పు మాత్రం చేయకూడదు,నేనూ ఓ పోలీస్ కూతుర్నే అంటూ భర్తకి భరోసా ఇవ్వడంతో సుమన్ తలవంచకుండా మీడియా ముందుకొచ్చి జరిగిన విషయాన్ని వీడియోలు,కాల్ రికార్డింగ్ ల సాక్షిగా చూపించడంతో కేంద్ర ప్రభుత్వం జ్యోక్యం చేసుకొని రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని కూలదోసింది.సుమన్ కి శత్రువులు పెరిగినా జంకు ఎరుగని నిజాయితీ గుండెనిండా చేరి నిద్రపుచ్చింది.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!