(అంశం:”రక్షిస్తుందా ఈ బంధం”)
విశ్వాస జంతువు
రచన ::శృంగవరపు శాంతకుమారి
పట్టిడన్నం పెట్టి
ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తూ….
మృదువుగా శరీరాన్ని నిమిరితే చాలు
అంతులేని ప్రేమ,విశ్వాసం చూపిస్తూ…..
ప్రాణాలైనా పణంగా పెట్టి తన అనుకున్నవాళ్ళని రక్షిస్తుంది !
వచ్చిన వారు దొంగలో దొరలో, పరిచితులో అపరిచితులో, పసిగట్టి గేటు దాటి రానీకుండా ఇంటికి కాపలాగా ఉండి రక్షిస్తుంది !
అమ్మ పొత్తిళ్ళలో ఉండవలసిన పురిటిలోని పసికందు పెంట కుప్పమీద గుక్క పెట్టి ఏడుస్తుంటే…..
స్పర్శించి నేనున్నా నీకు అని భరోసా ఇచ్చి కాకులు,గెద్దలు, రాబందులు,జంతువులు పీక్కుతినకుండా కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది!
ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా భయం వేసినప్పుడు ధైర్యంగా వెన్నెంటే ఉండి శత్రువుల బారి నుండి రక్షిస్తుంది!
చంటి బిడ్డలకు ఆట బొమ్మగా మారి ఆడించి లాలించి బుజ్జగించి ఏ హాని తలబెట్టకుండా ప్రక్కనే ఉండి రక్షిస్తుంది!
ఈ సృష్టిలోనిజీవులన్నిటి కన్నా చేసిన మేలు మర్చిపోకుండా గోరంత ప్రేమకి కొండత విశ్వాసం చూపించే జంతువు”శునకం”!