యాంటీ వైరస్

యాంటీ వైరస్

రచయిత :: రాజ్

రూపం లేని నీరు ..
నిత్య ఏకరీతి ప్రవాహం వల్ల
బండ రాయికి సైతం ఘాటు పెడుతుంది!
అతి మెత్తని వానపాము..
నిరంతర శ్రమ వల్ల..
నేలను సైతం తొలుచుతుంది!
అతి చిన్న చెద పురుగు..
అతి దృఢమైన మానును..
కొంచెం కొంచెంగా కొరికి పారేస్తుంది!

ఇలాంటి…
నిర్జీవులు…అల్పజీవులే..
అసాధ్యమేమో అనుకొనే పనులను
సుసాధ్యం చేస్తుంటే…

సృష్టిలో..
అతి ఉత్కృష్టమైన జన్మ..
అత్యున్నతమైన మేథస్సు కలిగి…
కోటానుకోట్ల అణువులతో..నిర్మితమైన
అత్యంత శక్తి కలిగిన జన్మ..
మానవ జన్మ!

అలాంటిది
ఒకే ఒక అణువంతుండే..
కరోనా వైరస్ కు..
కలత చెంది..కకావికలం అయ్యి..
కృశించి.. నశించిపోతున్న..
ఓ..మానవుడా!

ఏమైంది? నీ పోరాటం!
ఏది..నీ మేథస్సు!
ఏది నీ అద్వితీయ శక్తి!
ఆంజనేయుడిలా అచేతనంలో ఉందా
కర్ణుడి లా.. మరుపు కలిగిందా!

ముల్లు బలమైనదే..
దృఢమైన.. పాదరక్ష లేనంత వరకు!
అట్లే..కరోనా ఎంతో బలమైనదే కావచ్చు
కానీ! నీ శక్తి ముందు అదెంత… జుజు బి!😀

నిన్ను బతికించేది..
హాస్పిటలో..మందులో.. వైద్యుడో కాదు
బతకాలన్న..నీ బలమైన కోరిక!
శరీరం చలనంలో ఉండేదెపుడంటే!
లోపల జీవుడు అంటే..
ఆత్మ చైతన్యంగా ఉన్నపుడు!

తినటం.. ఆడుకోవటం..పడుకోవటం
మాత్రమే కలిగి ఉన్న జింక..
తన ప్రాణాన్ని చిరుతనుండి..
కాపాడుకొనేందుకు ఎంతో పోరాడుతుంది!
మరి!
యెన్నో రుచులు ..యెన్నో రంగులు..
మరెన్నో అనుభూతులు ఉన్న
మానవ జీవితం కోసం .
నువ్వెంత తపన పడాలి..
ఎంత ఆశపడాలి..
మరెంత పోరాటం చెయ్యాలి!

జ్వలించే తపనే…
నీ ఆత్మను చైతన్య పరుస్తుంది
ఆ ఆత్మే..నిన్ను ప్రాణాలతో నిలబెడుతుంది!
మానవా…మేలుకో!
నీ ఆత్మ బలమే..
నీకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!