అంశం: చీకటి వెలుగులు
తప్పు ఒప్పులు
రచన: కవిత దాస్యం
సూర్యుడు పడమర కొండల్లో అదృశ్యం కాగానే …
భూమిపై నలుపు రంగును ఒం పేస్తుంది…
తూర్పు దిక్కు ఒలికిందే తడవుగా చీకటై ఎగజిమ్మి.. ఆకాశాన్ని అంటుతుంది
కనుచూపు మేరల నిశి కంటి వరకు చేరి రాత్రి అయిపోతుంది…
సాగె మబ్బులు, వీచే గాలి, చుక్కల తీరంలోని ఆకాశం వరకూ…
నలుపు వర్ణాభిషేకం …
అలసిన జీవకోటికి ఏకీకృత అనునయ గీతం …
కాగడ ,చమురు దీపాలను వెలుగుతోరణపు విద్యుల్లతల
నాగరిక నైపుణ్యాలను అంచెలంచెలుగా గాంచిన పూర్వ చరిత్ర …
సంధ్యోదయ సంధాత …
కుట్రలు ,కుతంత్రాలు దౌర్జన్యాలు,దోపిడీలు నిశాచరులకు
విశ్వమంతా మూగసాక్షి దిన దినం …
వింత శోభాకృతిలో చందమామ తిన్నెలు …
వెన్నెల జలతారులో…
గోదావరి ఇసుక తిన్నెల సౌందర్య శుభగీతం…
సాగరమంత వెన్నెల విరుపులే…
పున్నమి వెన్నెల తమకం లోనూ…
అమావాస్య కారుచీకటి విలవిల లోను…
చీకటి వెలుగుల జీవన సత్యాల…
సంయుక్త సందేశంలా ప్రతి రాత్రి …
ఉదయం కోసం పోరాటం చేసి…
వెలుగుల విజయం సాధిస్తుంది…
ఇది కదా జీవిత కేళివిలాసం