హమ్మయ్య దొరికాడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఆకుమళ్ల కృష్ణదాస్
ఏమండీ..!
లక్షణమైన లక్ష రూపాయల పట్టె మంచముండగా.
ఈ బండ రాళ్ళల్లో కొంగ జపం చేస్తున్నారా!
బంగారు జింకను తెమ్మన్నానా ఏమిటీ?
జస్ట్ బంగారు వడ్డాణం చేయించమన్నాను అంతే!
ఆకాశంలోని నెలవంకను తెమ్మన్నానా ఏమిటీ?
చిన్న వజ్రాల చంద్రవంక చేయించమన్నాను అంతే!
తల్లోకి మంకెనపూలు అడిగానా ఏమిటీ?
రెండు బంగారు వంకీలు చేయించమన్నాను అంతే!
పట్టుపురుగులను పట్టుకు రమ్మన్నానా ఏమిటీ?
పది పట్టుచీరలు కొనమన్నాను అంతే!
పచ్చని పొలాల్లో నన్ను తిప్పమన్నానా ఏమిటీ?
పండుగకు పచ్చల హారం చేయించమన్నాను అంతే!
పెద్ద బంగళా కావాలన్నానా ఏమిటీ?
చిన్న ఫామ్ హౌస్ కొనమన్నాను అంతే!
వంట మిమ్మల్ని చెయ్యమన్నానా ఏమిటీ?
రోజూ స్విగీ లో తెప్పించండీ అన్నాను అంతే!
మనందరి బట్టలు ఉతక మన్నానా ఏమిటీ
వాషింగ్ మిషన్ లో వేసి ఆరబెట్ట మన్నాను
ఆతర్వాత ఇస్త్రీ చేయమన్నాను అంతే!
అశ్వం మీద ఊరంతా తిప్పమన్నానా ఏమిటీ
జస్టు’ఆడీ’కారులో అలా తిరుగుదామన్నాను అంతే!
ఆమాత్రం దానికే ఇలా అలిగివస్తే ఎలా!
మీకోసం ఎక్కడెక్కడో తిరిగాను గూగుల్ ను
గిచ్చి గిచ్చి..
నాసా ను నస పెడితే గాని దొరకలేదు
మీ చిరునామా!
కొండెక్కి నక్కలా నక్కారు
రండి! రండి! కొండకింద హెలికాఫ్టర్ సిద్ధం చేశాను!