(అంశం : నా అల్లరి నేస్తం) మరవలేను నిన్ను
రచన ::బండి చందు
మిత్రమా ఏమయిపోయావ్
అలుపెరుగని పోరాటాలను
ముందుండి నడిపే బావుటవయినావా
ఏ పూటకాపూట కడుపు నిండని
నిరుపేదల పొట్టకు కట్టే బట్టయినావా
చిరునామెరుగని ఆకలి అనాథల
పాలిట అకాలవరమైనావా
నిజాల నిగ్గు తేల్చే నీరెండమావి
నీడలో కనుమరుగయినావా
రణభూమిలో రక్తపిపాసుల
దాహానికి బలైపోయినావా
సమాజ స్వేచ్ఛా స్వతంత్రపు
ఆకాంక్షలో అమరుడవయినావా
భాధ్యతల బరువులను మోసే నిన్ను
నా భుజాలపై ఎలా మోయగలను
నిశి ముసిరిన నీ పసిడి ముఖాన్ని
నిండా మట్టితో నేనెలా నింపను
నీ జ్ఞాపకాల ఊబిలో కూరుకుపోయిన
నాకు కాస్తైనా చేయందీయలేవా
నీవంటూ లేని నేను ఎప్పుడో జీవశ్చవమైనాను
నీ అల్లరి పొగరు లేక జీవిత ఖైదునైనాను
ఈ బానిస సంకెళ్ళ బ్రతుకు ఇక బ్రతకలేను
మరువక నన్నూ నీతో తీసుకుపో
స్వార్థపూరిత స్వేచ్ఛా ప్రపంచంలోకి…
