అవనిపై అద్భుతము..!(రామప్ప దేవాలయము)
రచన: పిల్లి.హజరత్తయ్య
అక్కడ శిల్పం కదులుతుంది
పురివిప్పి నాట్యం చేసే మయూరంలా!
పెదవి విప్పి పలుకుతుంది
కుహూ కుహూమనే కోయిల రాగములా!
మధుర భావాలను పలికిస్తుంది
సరిగమలు పలికించే వీణలా!
హృదయాలను పులకింపజేస్తుంది
చల్లగా వీచే మలయమారుతంలా!
అందరి దృష్టిని ఆకర్షిస్తుంది
అబ్బురపరిచే నవరసాల సంగమమై!
కళాత్మకతతో కట్టిపడేస్తుంది
సాంస్కృతిక సాంప్రదాయాలకు నెలవై!
ఇసుక పునాది ఔరా అనిపిస్తుంది
అపురూప శిల్ప కళాతోరణమై!
శతాబ్దాల నిర్మాణాన్ని గుర్తుకుతెస్తుంది
అవనిపై వెలిసిన అద్భుతమై!
కాకతీయుల కళాతృష్ణకు నిదర్శనమై..
ప్రపంచ ఖ్యాతి నార్జించింది..!
చరిత గలిగిన రామప్ప దేవాలయమై..
చరిత్రను చిరస్మరణీయం చేసింది..!
***