దుస్వప్నం 

దుస్వప్నం 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఆనంద డొలికల్లో మునిగిపోతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చాను ఆ రోజు. ఇంటికి వస్తూ వస్తూ వేడి వేడిగా పకోడీ తెచ్చుకున్నాను. వంట మనిషి అమ్మ సూచనల మేరకు, నాకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర, సాంబారు, ఉల్లి కారం ఏర్పాటు చేసింది. నేను ఇంటికి రాగానే, వేడిగా టీ పెట్టి ఇచ్చింది. అసలే బయట సన్నగా చినుకులు మొదలయ్యాయి. చిరు చీకట్లు అలుముకున్నాయి. ఆ వాతావరణాన్ని నేను ఆస్వాదిస్తూ టీ లో పకోడీ నంచుకుని తింటున్నాను.
ఇంతలో వంట పూర్తి చేసి, కరుణా బేబీ నేను వెళ్తాను అంటూ చెప్పింది  రమ. అలాగే, రేపు ఉదయం త్వరగా రావాలి అంటూ గుర్తు చేశాను.
సరే తల్లీ, నువ్వు పరీక్ష కు తొందరగా వెళ్లాలి అని చెప్పారు అమ్మగారు. నాకు గుర్తుంది అంటూ వెళ్ళి పోయింది. అప్పటి వరకూ నాలో ఉన్న హుషారు ఎగిరిపోయింది. బిక్కు బిక్కు మంటూ, ఇంటి మొత్తంలో నేను ఒక్కదాన్నే అని గుర్తుకు వచ్చి, చెమటలు పడుతున్నాయి. కాలేజీలో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళాక కాసేపు చదువుకుని, కాసేపు టి. వి. చూసి, ఎప్పటికో నిద్ర పోవచ్చు అనుకున్నాను. కానీ, చీకటి పడితే బయట ఇలా భయంకరంగా ఉంటుందా అని ఆశ్చర్య పోయాను. నిజం వేరు, ఊహా వేరు, ఉహాల్లో జీవితం అద్భుతం, నిజంలో జీవితం ఊహాతీతం, ఈ రెంటి కలయికే మన జీవనం, వామ్మో, ఇంకా ఇలాగే కూర్చుంటే ఇంకా చీకటి పడుతోంది. ముందు స్నానం చేసి వస్తే సరిపోతుంది. మళ్లీ భయం వేస్తుంది అనుకుంటూ లేచాను. అయినా నేనేంటి ఇంత భయపడుతున్నాను. ఎంతో ధైర్యంగా ఉండే నాకు ఇంత భయం మనసులో ఉందా అనుకుంటూ స్నానానికి వెళ్లాను. మనసులో ఉన్న భయం దెయ్యంతో సమానం. మనసున ఉన్న ధైర్యం కోటి ఏనుగుల బలం. ఒక్కదాన్నే ఉన్నాను అన్న ఆలోచన గుండెల్లో రాంగానే, ఒక సినిమా గుర్తుకు వచ్చింది. హీరోయిన్ అందానికి ముగ్ధుడైన ఒక దెయ్యం, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు, ఆమె బాత్రూంలో, బెడ్ రూమ్ లో చేరి, చేసే అల్లరి అంతా కళ్ళ ముందు కదలాడింది. అయినా సరే, మొండి ధైర్యం తెచ్చుకుని నేను ఈ రోజు హాల్ లో పడుకుంటాను అని నిశ్చయించుకున్నాను. అమ్మ ఫోన్ చేస్తే మాత్రం, చాలా ధైర్యంగా ఉన్నట్టు మాట్లాడి, వాళ్లు  వెళ్ళిన పెళ్ళి గురించి మాట్లాడి, ఫోన్ పెట్టెశాను. కాసేపు చదువుకున్నాను. కాదు కాదు చాలా సేపు చదువుకున్నాను. అక్కడ నుంచి  లేవటానికి భయం వేసి, చాలా సేపు చదివాను.
అన్నం పెట్టుకుందామని కిచెన్ లోకి వెళితే, సింక్ లో ఉన్న గిన్నెలు ఒక్కసారిగా కదిలి పోయాయి. నేను హడలి పోయాను. తీరా చూస్తే, అక్కడ నుంచి ఒక బల్లి కదలి ముందుకు పోతోంది. మనలో భయం, మనసు అల్లకల్లోలం, మనిషిలో ధైర్యం, సాధించే విజయం. ఒక్కసారిగా అమ్మనాన్నలు గుర్తుకు వచ్చారు. అన్నం కూడా తినాలనిపించలేదు. కానీ, రేపు అమ్మకు నేను అన్నం తినలేదని తెలిస్తే బాధ పడుతుంది అనుకుంటూ అన్నం తిన్నాను. ప్రేమకై పరితపించే హృదయం. ప్రేమ కోసం అల్లులుతాచే మనసు. ప్రేమతో పిలిచే పిలుపుకై ఆశ పడే మది.
మనిషులు దూరమైతే తెలిసెను విలువ. ఇక ఆ రాత్రి అంతా ఒకటే కలవరింతలు, కలతనిద్ర.
అర్దరాత్రి ఒక మనిషి ఆకారం నా మంచం చుట్టూ తిరుగుతున్నట్టు ఆలాపన. కాదు అది నిజం. ఆ ఆకారం ఎవరిదో కాదు, మొన్నీమధ్యనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన మా స్నేహితురాలు సౌమ్యది. నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటునట్టుగా ఉంది. కానీ, నాకు ఆ నిమిషం భయం కాదు గుండెల్లో బాధ. బాధ గుండెను పిండేస్తోంది. భయం మనసును వదిలేసింది. మనసు మనిషి కోసం తపిస్తోంది. మనిషిలో మానవత్వం మేలుకుంది. నా మనసు నాతో యుద్ధం చేస్తోంది. ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అని అందరికీ తెలుసు. కానీ, కొన్ని పరిస్థితులకు, కొందరి వ్యక్తులకు జడసి, కేసు కొట్టివేశారు. అందులో నేను చేసిన తప్పు, కనీసం వాళ్ళ అమ్మానాన్నను, తన మీదే ఆశలు పెట్టుకున్న, సౌమ్య తమ్ముడు సాగర్ ని కనీసం పలుకరించటానికి కూడా వెళ్ళలేదు. వాళ్ళందరూ నన్ను సౌమ్య తో సమానంగా చూసుకుంటారు మరి.
అందుకే, రేపు పరీక్ష అవ్వగానే, నేను సౌమ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని నిశ్చయానికి వచ్చాను. హాయిగా నిద్రలోకి జారుకున్నాను. ఆ రోజు నా తప్పు నేను సరిదిద్దుకున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!