లక్ష్మి చిల్లర కొట్టు

లక్ష్మి చిల్లర కొట్టు

రచయిత::శివరంజని

ఆరోజే పెళ్లయి, పెళ్లి బట్టలతో కొత్తజీవితాన్ని ప్రారంభించటానికి అత్తారింటికి వస్తోంది వసుధ. “మొదట గుడికి వెళ్లాలి” అని అత్తగారు అనడంతో వీధి చివరి లక్ష్మి కిరాణా కొట్టులో కొబ్బరికాయ, అగరొత్తులు కొని గుడికెళ్ళారు . గుడిలో పూజ అయ్యాక, గృహప్రవేశం జరిగింది. అలా ప్రారంభమైనది లక్ష్మి కిరాణా కొట్టుతో వసుధ అనుబంధం.

వసుధకు కొత్త పెళ్లికూతురు నుండి లక్ష్మి కిరాణా కొట్టులో ఎప్పుడూ ఏదో ఒకటి కొనడం జరుగుతూనే ఉండేది. నెలవారీ సరుకులు హోల్ సేల్ షాప్ నుండి తెచ్చుకున్నా, పూజకు పూలు, నెల మధ్యలో అవసరమైన సరుకులు, పిల్లలకు బిస్కట్లు, బ్రెడ్, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు శీతల పానీయాలు, వర్షం వచ్చేప్పుడు బజ్జీలు వేసుకోవడానికి, ఏ ఆలుగడ్డలో, మిరపకాయలో అవసరమైతే పిల్లలు అయిదు నిమిశాలలో తెచ్చేవాళ్లు. ఇంటింటికి ఫోన్లు లేని ఆరోజుల్లో, వసుధ ఫోన్ చేయాలన్నా, వసుధకు ఫోన్ రావాలన్నా లక్ష్మి కిరాణా కొట్టు ఫోనే ఆధారం. లక్ష్మి కిరాణాకొట్టుని లక్ష్మయ్య, అతని భార్య లక్ష్మమ్మ, పిల్లలు అందరు కలిసి నడిపేవారు. మంచి మాటకారితనమున్న లక్ష్మమ్మ, లక్ష్మయ్యలు సరుకులు కూడా నాణ్యమైనవే ఇచ్చేవారు. లక్ష్మమ్మ కొట్టులోనే ఒకమూల బట్టలు కూడా కుట్టేది.

వసుధ పిల్లలతో పాటు వాళ్ల చదువులు పెరిగాయి, సరుకులు తెచ్చుకునే తీరిక లేకపోవడంతో, కావలసిన సరుకుల వివరాలు ఫోన్ లో చెప్తే, మరుసటిరోజు పాల పాకెట్ తో పాటు ఇంటికొచ్చేసేవి లక్ష్మి కిరాణా కొట్టు నుండి. ఏదైనా అత్యవసరమై ఫోన్ చేసినా అప్పటికప్పుడు, ఇంటికి పంపేవారు. ఈ సౌకర్యం కోసం నెల మొదట్లోనే కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చేది వసుధ. డబ్బు లెక్కల్లో ఎప్పుడు తేడా రాలేదు.

పిల్లలతో పాటు వసుధ ఆర్థిక హోదా పెరిగింది. కారు కొన్నారు, లక్ష్మి చేతిగుణం మంచిదని, కారు పూజ కోసం అన్ని సామానులు లక్ష్మి కిరాణాకొట్టు లోనే కొన్నారు.

వసుధ కొడుకు చైతన్యకు గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతంతో పాటు, షాపింగ్ మాల్ కూపన్స్, కార్డు వసుధ చేతిలో పెట్టాడు కొడుకు.
“ఇదేమిట్రా” అని వసుధ అడిగితే, “ఇకమీద మనం పోష్ అమ్మా, మన షాపింగ్ అంతా మాల్స్ లోనే” అని వారాంతంలో తల్లిని స్వయంగా షాపింగ్ మాల్ కు తీసుకెళ్లాడు.

బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంటింటి సామానులతో పాటు షోకేసుల్లో అందంగా అమర్చిన, రకరకాల బ్రాండుల కిరాణా సరుకులు, కూరగాయలు, పళ్లు, డ్రైఫ్రూట్స్ అన్ని ఒకేచోట దొరకడంతో వసుధ ఉబ్బితబ్బిబ్బైపోయింది . అన్ని వస్తువులు ఒకేచోట దొరకడం, పైగా డబ్బు చెల్లించక్కరలేకుండా కార్డు, కొన్న సరుకులపై ఉచితంగా ఇచ్చే సరుకులు, సరుకుల ఉచిత హోమ్ డెలివరీ అన్ని కలిసి వసుధను, లక్ష్మి కిరాణా వైపు వెళ్లకుండా చేసాయి.

వసుధ భర్త ప్రకాష్ ఎప్పటిలాగానే పాలు, లక్ష్మి కిరాణా నుంచే తెప్పిస్తున్నాడు. కోవిడ్ 19 భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించింది. వసుధ, ప్రకాష్, చైతన్య మాస్క్, శానిటైజషన్, సాంఘిక దూరం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టసాగింది.
వసుధ, ప్రకాష్ లను ఆరోగ్య పరీక్షల కోసం చైతన్య కార్లో ల్యాబ్ కు తీసుకొచ్చాడు. ఆరోగ్య పరీక్షలు పూర్తవడానికి ఇంకా చాలా సమయం ఉంది. చైతన్యకు బాగా ఆకలేసింది. చాలా రోజుల తర్వాత, కోవిడ్ భయాన్ని వదిలి, అక్కడి ప్రముఖ హోటల్ లో తనకిష్టమైన బిర్యానీ తిన్నాడు చైతన్య.

ముగ్గురు తగు జాగ్రత్తలతో ఇంటికొచ్చాక, మీడియాలో కోవిడ్ రెండో దశ ప్రారంభమైనదని వార్తలు ప్రసారమవుతున్నాయి. చైతన్య బయట తిననైతే తిన్నాడు కానీ, మనస్సులో భయపడసాగాడు. తల్లి తండ్రులతో మునుపటికంటే ఎక్కువ సాంఘిక దూరం పాటించాడు. ఎవరితో కలవలేదు. ఇరవై రోజుల తర్వాత, చైతన్య పరీక్షలు చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

కోవిడ్ తీవ్రంగా లేదని, ఇంటి నుండే వైద్యం పొందామని వైద్యులు అన్నారు. చైతన్య ఇంట్లోనే ఉన్నాడు. ఇంటికి కాస్త దూరంగా పోలీసుల పహారా, ఇంట్లోనుంచి ఎవరు బయటికి రాకుండా. చుట్టుపక్కల అందరు తమ ఇంటివైపు ఉండే తలుపులు, కిటికీలు మూసేసుకున్నారు. వసుధ కుటుంబం ఒంటరిది అయ్యింది.

ఇంట్లో సరుకులు అయిపోయాయి. కూరగాయలు కూడా లేవు. బయటికి వెళ్లే పరిస్థితి లేదు.
ఏం చేయాలో వసుధకు పాలు పోవడం లేదు. ఇంతలో లక్ష్మయ్య, ప్రకాష్ గారికి ఫోన్ చేసి, “కూరగాయలు, పళ్లు ఇంకా ఏమైనా తెమ్మంటారా సార్” అని అడిగాడు. కోవిడ్ 19 వచ్చినప్పటినుండి, లక్ష్మయ్యకు చిల్లర కొట్టులో గిరాకీ ఎక్కువ ఉంది, అస్సలు తీరిక ఉండడం లేదు. కానీ మానవతా దృక్పతంతో, వసుధ కుటుంబం బయటికి వెళ్ళలేదు కనుక, వారికి సహాయం అవసరం అని ఊహించి, ప్రకాష్ గారికి ఫోన్ చేసాడు లక్ష్మయ్య.
ప్రకాష్, ఫోన్ వసుధకు ఇచ్చాడు. కావలసిన సరుకులన్ని చెప్పి, “సార్ ఇప్పుడే నీకు గూగుల్ పే చేస్తారు లక్ష్మయ్యా” అన్నది వసుధ.

“మీ దగ్గర డబ్బులెక్కడికి పోతాయమ్మ, వచ్చే నెల తీసుకుంటా, ఇప్పుడు తొందరేం లేదు” అన్నాడు లక్ష్మయ్య. మందులకు, ఆస్పత్రులకు ఎక్కువ డబ్బు అవసరముంటుందని లక్ష్మయ్య మధ్య తరగతి మనస్సు ఆలోచించి, తనకు డబ్బులు తర్వాత ఇవ్వమన్నాడు.

కావలసిన సరుకులు, కూరగాయలు, పళ్లు అన్ని బస్తాలలో తెచ్చి, గేట్ బయట పెట్టి, వసుధకు ఫోన్ చేసి చెప్పాడు లక్ష్మయ్య. అవి లోపలికి తెచ్చుకొని, వంట చేసింది వసుధ.

అదేరోజు, చైతన్య తో తనకు ఇచ్చిన షాపింగ్ మాల్ కార్డులు అన్ని కాన్సల్ చేయించింది వసుధ.
మానవత్వంతో ఆలోచించిన, లక్ష్మయ్య ఉండగా ఈ కార్డులెందుకు దండగ అని సరదాగా అన్నాడు ప్రకాష్.

***

You May Also Like

One thought on “లక్ష్మి చిల్లర కొట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!