ప్రత్యుపకారం

ప్రత్యుపకారం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:కాటేగారు పాండురంగ విఠల్

పెద్దగా శబ్దం వినిపిస్తే దిగ్గున లేచాడు రవి. కిటికీలు దబా దబా కొట్టుకుంటున్నాయి, పరదాలు గాలికి ఎగిరెగిరి పడుతున్నాయి. గాలి, వానల వలన ఇంట్లో కరెంట్ పోయింది. ఎండాకాలం సెలవులు కనుక పిల్లలు మారాం చేస్తుంటే, వారి తల్లిగారింటికి పోయింది. అప్పుడే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. బయట ఉరుములు, మెరుపులతో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. మెరుపుల వెలుతురు వచ్చినప్పుడు చూస్తే, కుండపోతుగా వర్షం కురుస్తున్నది. కొద్ది సేపటి తరువాత మరలా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ముసుగు వేసుకున్న వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు. గేటు తెరుచుకున్న శబ్దం వినబడింది. మరో ఇద్దరు వచ్చిన అలికిడి వినబడింది. రోడ్డు వైపున్న కిటికీలో నుండి చూస్తే, ముగ్గురు మూడు వైపులా తిరుగుతున్నారు. ముగ్గురి ముఖాలు కనిపించడం లేదు. తలపై నుండి మోకాళ్ళ వరకు ముసుగులు వేసుకున్నారు. వారిని చూస్తుంటే మనస్సులో రకరకాల అనుమానాలు కలుగుతున్నవి. సమయం చూస్తే మూడు గంటలు అయినది. ఇంట్లో ఒక్కడు, బయట ముగ్గురు. చీకటి, జోరు వాన, హోరు గాలి. కొద్ది సమయం మౌనంగా గడిసింది. అరగంట తరువాత కిటికీ తెరచి చూశాడు. కొంచెం ఉధృతి తగ్గినట్లనిపించినా, వీధిలో పారే వాన నీటి ప్రవాహం, భయం గొలిపేలా వున్నది. ఎవరు?ఎవరు?అని అరిచాడు !రవి !. తడిసి ముద్ద అయిన సోమయ్య మెల్లగా లేచి వచ్చాడు. పక్కనే అతని భార్య, ముసలి తల్లి కనిపించారు. అతన్ని చూడగానే మనసు కలచి వేసింది. రవికి మూడు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. సోమయ్య రిక్షా తొక్కుతుంటాడు. భార్య ఐదారు నెలల గర్భవతి. తల్లి అనారోగ్యంతో నడవలేని స్థితిలో వున్నది. తన కూతురికి అనుకో కుండా ఆ రోజు ఫిట్స్ వచ్చినది. రాత్రి రెండు గంటలప్పుడు, జన సంచారం లేదు. రోడ్డుపై పాపను ఎత్తుకొని నిలబడ్డాడు. అప్పుడు ఏ వాహనం లేక భార్యా భర్తలు అప్పుడప్పుడు అరుస్తూ వచ్చి పోయే వాహనాలను ఆపినా ఎవ్వరు ఆపడం లేదు. వీరి అరుపులు విని సోమయ్య లేచాడు. రోడ్డు వారగా పడుకున్న గర్భవతి భార్యను, ముసలి తల్లిని లేపి, పక్కింటి సారు, ఆయన భార్య అరుస్తున్నారని, చూసొస్తానని చెప్పి, వచ్చాడు. విషయం తెలిసి, తన రిక్షా తీసి, రమ్మని వారిని కూర్చోబెట్టుకొని హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు చేసి, డాక్టర్లు చికిత్స చేసి, ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఆలస్యమైతే పరిస్థితి చేయి దాటిపోయేదంటే, సోమయ్య రవి కళ్ళకు దేవుడిలా కనిపించాడు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనని, డబ్బులు ఇవ్వబోతే సోమయ్య తీసుకో లేదు. ఇది జ్ఞాపకం వచ్చి వెంటనే తలుపులు తెరిచి వారి దగ్గరకు వెళ్ళాడు. భార్య పురిటి నొప్పులతో బాధ పడుతుంది. ముసలమ్మ ఆమెకు ధైర్యం చెబుతుంది. సోమాయ్య భయంతో వాణికి పోతున్నాడు. రవి వారిని లోపలికి పిలిచి, వేరే బట్టలిచ్చి మార్చుకొమ్మన్నాడు. ఒక బెడ్ రూములో వెళ్లమంటే వెళ్లారు. ఒక అరగంట తరువాత గదిలో నుండి పాపాయి ఏడుపు వినిపించింది. సోమయ్య వచ్చి రవి చేతులు, కాళ్ళు పట్టుకొని, రెండు ప్రాణాలు కాపాడినారు. మీరే దేవుడని అంటుంటే, ఆ రోజు నా బిడ్డను నీవే కాపాడావు. నీ రుణాన్ని ఆ భగవంతుడు ఇలా తీర్చినాడని సోమయ్యను ఓదార్చాడు. భార్యకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. ఆమె సంతోషించినది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!