కాకి/ఊడుత సంవాదం

(అంశం: చందమామ కథలు)

కాకి/ఊడుత సంవాదం

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

    ఒక చెట్టు మీద, ఒక ఉడుత, కాకి, ఉన్నాయి.రోజు కాకి ఆ రోజు అందరి ఇళ్లలో చూసిన విషయాలు ఉడుతతో  పంచుకునేది.

అలాగే ఒకనాడు కాకి చాలా విచారంగా కూర్చోవడం చూసిన ఉడుత.” ఏం, కాకి బావ ఈ రోజు విశేషాలు ఏమిటి? ఎందుకో విచారంగా కనిపిస్తున్నావు.ఏం జరిగింది ఏమిటి. ” అని కాకిని అడిగింది.

“దానికి ఏం చెప్పాను ఉడుత బావ. నేను రోజు ఒకరి ఇంటికి తప్పక వెళ్తాను.అక్కడ నాకు కావలసినంత భోజనము దొరుకుతుంది. ఆ ఇల్లాలు ప్రతిరోజు తాను భోజనం చేసేటపుడు తొలి ముద్ద కళ్లకు అద్దుకుని, తమ పితృదేవతల పేరు చెప్పి పక్కన పెడుతుంది. అలా పెట్టిన ముద్ద తరువాత ఆ ఇంటి ప్రహరిగోడ మీద పెట్టినపుడు నేను వెళ్లి తృప్తిగా ఆరగించేదానను. కాని ఈ మధ్య ఏం జరిగిందో తెలియదు. ఆవిడ ఆ ముద్ద పెట్టడం మానేసింది.”  అని చెప్పి బాధ పడింది.

“పోని ఆవిడ పెట్టడం మానేస్తే దానికి అంత విచారం ఎందుకు. మరి ఎక్కడ నీకు ఆహారమే దొరకదా  ఏమిటి. “అని ఉడుత, కాకిని ఓదార్చింది.

దానికి” అయ్యో ఉడుత బావ నా బాధ నీకు తెలియడం లేదు. వాళ్లు తమ పెద్దల పేరు చెప్పి పెట్టిన అన్నం మేము తినడం వలన వారి పెద్దలే తిన్నారని ,వాళ్ల  ఆశీస్సులు తమ కుటుంబం మీద ఎల్లకాలము ఉంటాయని ఎంతో సంతోషంతో పొంగి పోతారు వాళ్లు. అలా ఒక జీవి ఆకలి తీర్చడం అనేది వారికి  తెలియకుండనే జరుగుతుంది. అందువలన వారికి కూడా ఎక్కడికి వెళ్లిన ఆహారానికి లోటు రాదు. అందుకోసమే మానవులు ఈ ఏర్పాటు చేసుకున్నారు.

తాము భోజనం చేసేటపుడు ఒక జీవికి ఆకలి తీర్చడం అనేది అలవాటుగా మారి, ఎవరూ ఆకలి అని తమ ఇంటికి వచ్చిన వాళ్ల ఆకలి తీర్చడం అలవాటు అవుతుంది. అందువలన, వారు కూడా ఎక్కడికి వెళ్లిన  ఆకలి వేసినపుడు ఈ అలవాటు కారణంగా ఎవరైనా వారి ఆకలి తీరుస్తారు.

ఈ మధ్య కాలంలో మానవులలో ఆ పిడికెడు అన్నం పారేయడమా, అలా ఎన్ని రోజులు ఎంత అన్నం వృధా అవుతుందన్న లెక్కలు వేసుకోవడం, ప్రతిది డబ్బుతో ముడి పెట్టడం వలన ఎవరికి కూడా ఆకలి వేసినపుడు ఆహారం దొరకడం లేదు. ఎవరికి వారు ఆకలి వేస్తే ఆహారం కొనుక్కోవడం, లేదా ఆకలితో మలమలమాడిపోవడమే అవుతుంది తప్ప మరి గతి లేకుండా పోతుంది.

పూర్వం నూతి గట్టు దగ్గర గిన్నెలు శుభ్రం చేసుకునేవారు. అందువలన మనలాంటి జీవులకు ఎంతో కొంత ఆహారం ఆ పరిసర ప్రాంతంలో దొరికేది. కాని ఇప్పటికే చాలా వరకు ఇళ్లలో ఉన్న సింకుల్లో గిన్నెలు తోమడం  వలన  మనలాంటి వారికి ఆహారం దొరకడం కష్టం అవుతుంది. ఏమైన గిన్నెల్లో ఆహారపదార్థాలు మిగిలిన వాటిని చెత్త బుట్టల్లో  వేసి పాడైపోయిన తరువాత పెంట కుప్పల్లో వేయడం వలన  మనకు అవి తినడానికి పనికి రావడం లేదు.

ఏదో  ఇంతవరకు ఆవిడలాంటి పెద్దవారి వలన ఎంతో కొంత ఆహారం దొరుకుతుంది ఇప్పటి వరకు. ఇక ముందు వారు కూడా ఆ ముద్ద పెట్టడం మానేస్తే మన పరిస్థితి ఆగమ్యగోచరమే.

ముందు ముందు ఈ కాలం మానవుల వలే మనం కూడా ఇళ్లలో దూరి ఆహారం దొంగతనం చేయవలసిన పరిస్థితి వస్తుంది కాబోలు. లేదంటే మనలాంటి జీవులు అంతరించిపోయి, ఎక్కడ చెత్త అక్కడే పేరుకు పోతుంది.

ఇప్పటి వరకు ఒక పూట వారు పెట్టిన అన్నం తిని మనకు చేతనైనంతలో వారి పరిసరాలు శుభ్రం చేస్తున్నాము. ఇక ముందు శుభ్రం చేయాలంటే మనలాంటి జీవులు మనగలగాలి కదా.

అందుకే నా బాధ. ఈ రోజు ఈవిడ, రేపు ఇంకొకరు, అలా అందరూ పొదుపు పేరు చెప్పి మనలాంటి వారికి ఆహరం పెట్టడం మానేస్తే, రేపు ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నపుడు ఆకలికి తట్టుకోలేక పడిపోయిన ఇక ముందు ఎవరూ పట్టించుకోరు. మరి అందరూ పోదుపు పాటించేవారే కదా. తమ వరకు వస్తే కాని ఆ కష్టం తెలియదు ఎవరికి.

ఎంత డబ్బు ఉన్న కూడా అందరికి వెళ్లిన ప్రతి చోట, ప్రతి సమయంలో ఆహారం దొరుకుతుందన్న నమ్మకం ఏమిటో ఈ వెర్రి జనాలకు.

సరే చూద్దాం. ఆ భగవంతుడు మనలాంటి జీవులకు ఏదో ఒక దారి చూపకపోడు. నాకు ఆకలి వేస్తుంది ఎక్కడైనా ఆహారం దొరుకతుందోమో ప్రయత్నం చేసుకుంటాను. బై. “

ఆ మాటలకి ఉడుత “సరే వెళ్లు.  మానవులు ఇంత పిసినారులు అవ్వడం వలనే పరిస్థితులు ఇలా తలకిందులు అవుతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన ఎండలు. సరియైన పంటలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాకు కూడా అందుకే  సరియైన పంటలు లేక పళ్లు, పలాలు  దొరకడం లేదు. మరి మేము ఆహారం ఎక్కడ వెత్తుక్కోవాలో. మీరు అంటే గాలిలో ఎంత దూరమైన ప్రయాణిస్తారు. మేము మీలా ఎక్కువ దూరం వెళ్ల లేము. మీ పరిస్దితే  ఇలా ఉంటే, రేప్పోద్దున్న మా పరిస్థితి ఏమిటో “అని ఒక నిట్టూర్పు విడిచి, కాకిని సాగనంపింది ఉడుత.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!