అడవి పూలు
రచన: చంద్రకళ. దీకొండ
అడవి పూలలా సహజ సౌందర్యాలు
నూలు చీర రవికలే వస్త్రాలంకరణలు
ముఖంపై చిరునవ్వులే విలువైన ఆభరణాలు…!
మౌలిక వసతులు లేని
నివాసాలు
మాయా మోసం ఎరుగని
స్వచ్ఛ హృదయాలు
పంచభూతాలే వారి నేస్తాలు…!
ప్రకృతితోనే సహజీవనం
సహజ వనరులే ఆధారం…!
వైద్యం,విద్యకు నోచుకోని
జీవితాలు
గర్భిణీ స్త్రీలకైనా డోలీలే
వాహనాలు…!
కష్టించి పంటలు పండించే
శ్రమజీవులు
నగర వాణిజ్య రీతులెరుగని
బేల మనసులు…!
నలుగురితో కలిసి
వాయిస్తారు డప్పు చప్పుళ్ళు
ఆశువుగా పాటలు పాడుతూ
ఆనందంతో చేస్తారు నెమలి నృత్యాలు…!
ఆహారం ప్రసాదించేది
ఆకాశదేవుడేనంటారు
అమ్మి అధిక సొమ్ము చేసుకునే
తెలివి తమకు లేదంటారు…!
ఎన్ని సమస్యలున్నా
సంతసాల తేలే మనస్తత్వాలే
తప్ప సంతలో బేరాలు
తూకంలో తేడాలు
తమకసలు తెలియనే తెలియవంటారు…!!!
***