ఆమె నాకాదర్శం

ఆమె నాకాదర్శం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

  ప్రతిరోజు కాలేజి కి వెళ్ళే దారిలో సీతంపేట బజారు దగ్గర దుర్గాగణపతి గుడి వద్ద కూర్చున్న పూలమామ్మని ఒకసారి పలకరించటం  నాకు అలవాటు. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి అదే త్రోవలో నడుచుకుంటూ బి.వి.కె కళాశాల కు వెళుతున్నాను. గుడి దగ్గర బోసినవ్వుతో ముడుతలు పడిన శరీరం తో గొడుగు వేసుకుని మందార, గన్నేరు, చామంతులు, గులాబీలు పొట్లాలు గా కట్టి ఐదు,పది రూపాయలకి అమ్మేది. మూడు రోజులయింది ఆమె నాకు కనిపించలేదు.
అవి ప్రధాని ఇందిరాగాంధీ ని రక్షకభటులే తుపాకీ గుళ్ళతో హతమార్చిన రోజులు.నాకు బాగా జ్ఞాపకం. అప్పుడే నేను విశాఖపట్నం లోని సీతంపేట ఇంటికి అనకాపల్లి నుంచి మకాం మార్చాను. ప్రొద్దున్నే స్నానం చేసి, సంధ్యావందనం, పూజ దేముడికి చేయడం అలవాటు. అందుకు ముందు రోజే పూలు కొందామని బజారుకి వెళుతుండగా గొడుగు వేసుకుని పూలను పొట్లాలుగా కట్టి మూడు, ఐదు రూపాయలకు అమ్మే ఏభై సంవత్సరాలు దాటిన పూలమ్మ దగ్గర పూలు పుచ్చుకున్నాను.వెంటనే ఆమె బాబు మీరు రోజు పూజ చేస్తారా,మాష్టారా అని అడిగితే అవునమ్మా అన్న వెంటనే ఆమె ఏమనుకోకోండి నా కొడుకు మీ లాగే దెబ్బపండులా ఉంగరాల జుట్టుతో ఉంటాడు. మీ  కాలేజి లోనే ఇంటర్ చదివి దేశంకోసమే ఏదైనా చేయాలని ఆర్మీలో చేరాడు. వాడి పేరు రాజాబాబు పెళ్ళి అయింది. ఇద్దరు మగపిల్లలు. కోడలు చాలా మంచిది అని తల్లి కొడుకు తో చెప్పినట్లుగా అన్నీచెప్పి, బాబు ఈ పొట్లంలోని పూలతో మా వాడి పేరున పూజ చేయండి వాడు కుటుంబం బాగుండాలి అని పువ్వుల పాకెట్ ఇచ్చింది. ఆమె మాతృహృదయ స్పందన తెలిసి పరదేవతయే తల్లి అన్నది అక్షరసత్యం అనుకున్నాను. ప్రతీ ఏడాది పువ్వుల మామ్మ కొడుకు, మనుమలను నా దగ్గర కి తీసుకొచ్చి దీవించండి బాబు మీ లాగే నా కొడుకు, మనుమలు పెద్దవాళ్ళు అయి నిండా నూరేళ్ళు పిల్లా పాపాలతో ఉండాలని అనేది. మనుమడిని నా ద్వారానే మా కళాశాలలో ఇంటర్ లో చేర్పించింది.
మాస్టారుగారు మా వాడు పెళ్ళం తో మా అమ్మవంటే బాగుంటుంది అని చెబితే ఏం బాగుంటుంది. వెర్రిబాగులది కోడలు నవ్వి ఊరు కుటుంది. ముసలిదాన్ని ఎన్నాళ్ళు ఉంటాను. మావాడికి అర్ధం కాదు అని కొడుకుతో చెప్పినట్లు నాతో అన్నీ పండగకి చీరకొన్నాడు, వాళ్ళవిడకి నగకొన్నాడు, పిల్లలకి బట్టలు, క్రికెట్ సామాను కొన్నాడు మా రాజాబాబు నిజంగా రాజే అని చెప్పేది. తల్లి ప్రేమ జీవితాన పొందిన వాడు అదృష్టవంతుడు అనుకున్నాను. అవి వాజ్ పాయ్ ప్రధాని గా ఉన్నరోజులు కార్గిల్ యుద్ధం జరుగుతుంది.
ఒకరోజు పొద్దున్న పువ్వులమామ్మ రొప్పుతూ ఆయాసం తో నా దగ్గరికి వచ్చి మాస్టారు మా రాజాబాబు ఈ ఆదివారం ఫోన్ చెయ్యలేదు యుద్ధం జరుగుతుంది. భయం గా ఉంది. కలెక్టర్ గారు మీ శిష్యులు కదా కనుక్కో బాబు అన్నది .అలాగే అమ్మ  తప్పకుండా అని ఉదయం పడకుండు గంటలకు కలెక్టర్ సంతోష్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్ళాను. రండి మాష్టారు బాగున్నారా ఇక్కడే ఉన్నారా అని ఆప్యాయంగా పలకరించిన
శిష్యుని ధీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి కార్గిల్ యుద్ధ సమాచారం అడిగేను. వెంటనే అతను కార్గిల్ లో వాజ్ పాయ్ గారి నేతృత్వంలో విజయం సాధించినా మీరు చెప్పిన మన విశాఖవాసి రాజాబాబు అమరుడయ్యాడని తెలిసింది అన్నాడు. ఒక్కసారిగా గుండె సాగినట్లయి చెమట పట్టింది. వెంటనే మాష్టారు మీరు పెద్దవారు ఎందరినో ఉన్నతులుగా, సంస్కారవంతులు గా తీర్చిదిద్దేరు విధిబలీయం. మీకు తెలియనిది కాదు అని డ్రైవర్ నిచ్చి కారులో నన్ను ఇంటికి పంపిస్తు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. ఇంటికి వచ్చి భార్యతో పూలమామ్మ కొడుకు సంగతి చెప్పగా నన్ను భార్య భాధ పడకండి. దైవనిర్ణయాన్ని ఎవ్వరు తప్పించలేరు. పాపం మామ్మ కష్టం తీర్చలేనిది. సాయింత్రం ఆమె దగ్గర కెళ్ళి నెమ్మదిగా చెప్పండి అన్నది. పక్కవీధిలో ఉన్న పూలమామ్మ ఇంటికి ఆలోచిస్తూ వెళుతున్న నాకు ఆమె ఇంటిదగ్గర జనం ఉండటం చూసాను. పోలీస్ వాళ్ళు ఉన్నారు.
నన్ను గుమ్మంలోంచే చూసిన పూలమామ్మ
రండి మాస్టారు రండి రాజాబాబు దేశంకోసమే ప్రాణం ఇచ్చాడుట. దేశపెద్ద పూలమాలల వేసి, మన జెండా కప్పుతారుట. ఎంత గౌరవం బాబు. నా కంటికి గాంధీ తాత లా కనిపిస్తున్నాడు నా కొడుకు.
దేముడు మురిసిపోతున్నడేమో ఈ ముసల్ది ఎలా బ్రతుకుతుంది అని నా మనుమలు, మీరు లేరు ప్రభుత్వం ఇచ్చే ఇరవై లక్షలు,పెన్షన్ తో కోడలి జీవితం గడచిపోతుంది. పెద్దమనుమడు కి  అదే మీ శిష్యుడికి ఉద్యోగం ఇస్తారుట. మామ్మ నేను జాయిన్ అవుతాను అన్నాడు. ఇంక నేనా మీ అందరి సహాయంతో పువ్వులమ్మి బ్రతికెస్తా. ఇంకెన్నాళ్ళు ఉంటాను మాష్టారు మా మనుమలని, కోడలకి మీ దీవెనలు ఎప్పుడు ఉంటాయి అని ఓదార్చడానికి వెళ్ళిన నాకు ఆమె పరదేవతయే అనిపించించింది. అందుకే నా జీవితాన ఆమె నాకాదర్శం……!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!