అద్దంలో నేను… నాలా తను

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

అద్దంలో నేను..నాలా తను

రచయిత :: శాంతి కృష్ణ

ఏమే పిల్లా… పొద్దస్తమానూ ఆ అద్దం ముందే అతుక్కుని ఉంటావ్. పడుకునే ముందుకూడా వదలవా! పోయి పడుకోవే పిల్లా అని బామ్మ పెట్టిన గావుకేకతో ఉలిక్కిపడి, నేను అందంగా ఉంటానని వీళ్ళందరికి కుళ్లు అని తిట్టుకుంటూ వెళ్లి మంచం మీద హాయిగా పడుకుని వెంటనే నిద్రలోకి జారుకుంది హరిత.
హఠాత్తుగా ఎవరో మీద కూర్చుని గొంతు నొక్కేస్తున్నట్టనిపించి ఊపిరి ఆడక కళ్ళు తెరిచి చూసింది. ఎవరు కనిపించలేదు. భయం తో మోహమంతా చెమటలు పెట్టేసాయి.
మెల్లగా మంచినీళ్లు తాగడానికని లేచి వెళ్లి నీళ్లు తాగుతూ అలవాటుగా అద్దంలోకి చూసింది.
మోహమంతా చెమటలు. తుడుచుకుందామని టవల్ తీసుకొని అద్దం ముందుకొచ్చి చూసుకునేసరికి చెమట బిందువులు రక్తపు బిందువులుగా మారిపోయాయి.
కంగారుగా కేక పెడదామంటే గొంతు పెగలడం లేదు. ఏమైందో అర్ధం చేసుకునేలోపే అద్దం లో తన రూపం మెల్లమెల్లగా వికృతంగా మారడం మొదలైంది. ముఖ్యంగా ఆ కళ్ళు… తెల్ల గుడ్డు నల్లగా, నల్ల గుడ్డు తెల్లగా…. ఆ భయంకరమైన రూపం చూసి అక్కడే బిక్కచచ్చిపోయినట్టై అలానే నిలబడిపోయింది.
ఆ వికృత రూపం గట్టిగా నవ్వుతూ అద్దం నుండి చేయి బయటకు పెట్టి తన గొంతు పట్టుకుంది. విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే హఠాత్తుగా హరితను అద్దంలోకి లాగేసి తను బయటకు వచ్చేసింది.
అద్దంలో బంధీయై బయట ఉన్న తనలాంటి రూపాన్ని చూస్తూ ఏం జరుగుతుందో అర్ధం కాక గట్టిగా ఏడుస్తుంది. కానీ తన ఏడుపు ఆ అద్దం దాటి బయటకు రావడం లేదు.
ఏడవకు! ఏడ్చావంటే ఈ అద్దంలోనే సమాధి చేసేస్తాను అని గంభీరంగా పలికింది ఆ రూపం.
హరిత కాస్త ధైర్యం కూడగట్టుకొని అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావ్? అని ప్రశ్నించింది.
దానికి సమాధానంగా ఆమె, నేను ప్రియా! అర్జున్ ని ఎంతగానో ప్రేమించాను. కానీ అర్జున్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. పెద్దలు కుదిర్చిన సంబంధం అని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. తను దక్కలేదని నేను ఆత్మహత్య చేసుకుని ఇలా మిగిలి పోయాను.
అయినా తను సంతోషంగా ఉంటే నేను ఇలా రావలసి వచ్చేది కాదు. నీవల్ల తను సంతోషంగా లేడు.
తను కోరుకున్న జీవితాన్ని నువ్వు ఇవ్వలేదు. అందుకే నేను వచ్చాను; నా అర్జున్ ని సుఖపెట్టడానికి, ఆనందంగా ఉంచడానికి అని చెప్పింది.
తను సుఖంగా లేనని నీతో చెప్పాడా? మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అని హరిత దబాయించింది.
అవునవును!! భర్త ఆఫీస్ కి వెళ్ళిపోయే ముందు నిద్రలేచి, పాచి నోటితో టాటా చెప్పే నీలాంటి పెళ్ళాం తో ఎంత ఆనందం గా ఉన్నాడో తెలుస్తూనే ఉంది! పడక సుఖానికి కూడా ఆంక్షలు విధించే నీతో ఎంత ఆనందంగా ఉన్నాడో నేను చూస్తూనే ఉన్నాను. ఇంకా చాలు! నా అర్జున్ ని నేనే చూసుకుంటాను. నువ్వు ఆ అద్దంలోనే బందీగా ఉండు అని చెప్పి హరితను మారు మాట్లాడనీయకుండా బయటకు వెళ్ళిపోయింది.
అద్దంలో తన రోధన అద్దం లోనే ఉండిపోయింది.
ఇంతలో గది తలుపు చప్పుడు అయితే అటువైపు చూసింది హరిత. చేతిలో చేయి వేసుకుని అర్జున్ తో నవ్వుతూ మాట్లాడుతూ ఆమె లోపలికి వచ్చింది.
ఏంటి మేడం గారు ఇంత పొద్దున్నే నిద్ర లేచి పోయారు. నేను వచ్చి కాఫీ ఇస్తే గాని లేవవు అనుకున్నాను అని అర్జున్ నవ్వుతూ ఒకింత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు.
శ్రీ వారి కోసం ఎప్పటినుండో వెయిటింగ్ ఇక్కడ అని ఆమె కిలకిలా నవ్వేసింది.
ఏంటి రెండు రోజుల క్యాంప్ కే బెంగ పెట్టుకున్నావా అని అర్జున్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. గువ్వ పిట్టలా అతని కౌగిలిలో ఒదిగిపోయింది.
ఇదంతా అద్దంలో నుంచి చూస్తున్న హరిత కు మతి పోయినట్టయింది. ఈయనకు మనిషికి దెయ్యానికి తేడా తెలియటం లేదా అని తిట్టుకో సాగింది.
సాయంత్రం త్వరగా వచ్చేయ్ అర్జున్. వచ్చేటప్పుడు నా కోసం మల్లెపూలు తీసుకురావడం మర్చిపోకు అని అర్జున్ తో వయ్యారంగా చెప్పింది ఆమె.
మేడమ్ గారు ఆర్డర్ పాస్ వేశాక తప్పుతుందా అని నవ్వుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు అర్జున్.
సాయంత్రం అర్జున్ వచ్చే సమయం అయ్యే సరికి అందంగా చీర కట్టుకుని ముస్తాబై అర్జున్ కోసం గుమ్మం దగ్గర ఎదురు చూడసాగింది.
ఆ రోజు ఆఫీస్ పని ఎక్కువగా ఉండడంతో అర్జున్ లేటుగా ఇంటికి చేరాడు. తను వచ్చేసరికి ఆమె రూమ్ అంతా అందంగా అలంకరించి ఉంచింది.
రావడంతోనే అదంతా చూసి ఆశ్చర్యపోయి, ఏంటి హరి ఇదంతా! ఏమైంది ఇవ్వాళ నీకు? కొత్తగా బిహేవ్ చేస్తున్నావ్!! అని అడిగాడు.
మీ మీద మనసైంది శ్రీవారు! ముందు డిన్నర్ చేయండి. తర్వాత మాట్లాడుకుందాం!! అని అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి భోజనం వడ్డించింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు.
అర్జున్ ని చూస్తూ కవ్వింపుగా నవ్వుతూ ఆమె పడక గదిలోకి వెళ్ళిపోయింది. అర్జున్ వచ్చేలోపు అద్దంలో బందీగా ఉన్న హరిత తో, అర్జున్ ఒక్కసారి నన్ను తనలో కలుపుకుంటే తనని నాతో తీసుకెళ్ళిపోతాను అని నవ్వుతూ చెప్పింది.
ప్లీస్… నీకు దండం పెడతాను. ఇక నుండి అర్జున్ కి నచ్చినట్టు ఉంటాను. నా అర్జున్ ని వదిలేయ్ అని హరిత అంటున్నా వినిపించుకోకుండా ఆమె పక్కకి వెళ్ళిపోయింది.
అర్జున్ గదిలోకి వచ్చేసరికి పూల పాన్పు పై రతీదేవి లా అర్జున్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
గది లోకి రావడం తోనే తన భార్య అందచందాలను, ఒంపుసొంపులను చూసి అర్జున్ కి మతి పోయింది. ఏదో మంత్రం వేసినట్లు ఆమెను చేరి, ఒక్కసారిగా ఆమెను తన బిగి కౌగిలిలో బందించేశాడు.
ఇదంతా అద్దం నుండి చూస్తున్న హరిత, అర్జున్ తన మాయలో పడొద్దు అని ఏడుస్తూ, కేకలు పెడుతుంది. కానీ ఇవేమీ బయటకు వచ్చి అర్జున్ చెవిని చేరడం లేదు.
ఇటుపక్క అర్జున్ తన భార్య ఎత్తుపల్లాలను కొలుస్తూ, ఒంపుసొంపులను ఒడిసిపట్టుకుంటూ శృంగార సామ్రాజ్యానికి ప్రయాణం మొదలు పెట్టాడు.
మునిపంటి గాయాలతో, వెచ్చటి నిట్టూర్పులతో ఆ గది వేడెక్కుతుండగా……
*నో…….* అంటూ పెద్ద కేకతో, ఒళ్ళంతా చెమటలతో ముద్దైపోయి నిద్రలేచి కూర్చుంది హరిత. ఇదంతా కల! నిజం కాదు… కాదు… అని తనలో తనే మాట్లాడుకుంటుంది.
ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోయింది అని కంగారుగా హరిత దగ్గరకి పరిగెత్తుకు వచ్చారు. బారెడు పొద్దెక్కేదాక పడుకోవడం, పిచ్చి పిచ్చి కలలు కని, కలవాట్లు పడడం, రోజు జనాలను భయపెట్టడం ఈ పిల్లలకి బాగా అలవాటైపోయింది అని బామ్మ బయట నుంచి దెప్పిపొడుస్తోంది.
హరితకి అవేమీ చెవికెక్కడం లేదు. కేవలం తన కల మాత్రమే కళ్ల ముందు మెదులుతుంది. వెంటనే బయటకు పరిగెత్తుకెళ్లి, అత్తయ్య అర్జున్ ఎక్కడ? ఆఫీస్ కి వెళ్లి పోయారా?? అని కంగారుగా అడిగింది.
హా…. నువ్వు బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటే ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటాడా!! ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఒకసారి గడియారం వంక చూడు అని బామ్మ లోపలినుండి రంకెలు వేసింది.
వెంటనే లోపలికి పరిగెత్తి, తన ఫోన్ తీసుకుని అర్జున్ కి కాల్ చేసింది. అర్జున్ తో మాట్లాడిన తర్వాత తన మనసు తేలిక పడింది.
భార్య మాటలలో కంగారు కనిపెట్టి, అర్జున్ ఆఫీస్ కి లీవ్ పెట్టి ఇంటికి వచ్చేశాడు. రోజంతా హరిత అర్జున్ తోనే ఉంది. ఒక్క క్షణం కూడా తనని విడిచి పెట్టలేదు. హరిత దేనికో భయపడిందని అర్థమై అర్జున్ కూడా ఆమెను వదలలేదు.
ఆ కలతో హరిత తన భర్తను ఎంత బాధ పెడుతుందో అర్థం చేసుకొని, అందంగా ఉంటే సరిపోదని, భర్తకు అనువైన భార్యగా మెలగాలని, ఆ క్షణం నుండే తను మారాలని నిర్ణయించుకుంది.
మరుసటి రోజు తెల్లవారగానే పొగలు కక్కే కాఫీ తో భర్తను నిద్ర లేపింది అచ్చమైన తెలుగుంటి ఆడపిల్లలా…..
పెళ్లి చేసుకున్న ఇన్నాళ్లకు అర్జున్ కోరిక తీరింది తనను ప్రేమించిన ప్రియ వల్ల……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!