ఓ రాత్రి

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

ఓ రాత్రి

రచయిత :: కమల ముక్కు(కమల’శ్రీ’)

మత్తుగా పడుకుని ఉన్న కీర్తన ఉన్నట్టుండి నిద్ర మేల్కొని చుట్టూ చూసింది. హాస్టల్ లో తన బెడ్ మీద పడుకుని ఉండాల్సిన తను క్లాస్ రూమ్ బయట పడుకుని ఉండటం ఏంటో అర్ధం కాక ముందు ఎలాగైనా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని పరుగున మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లింది. అదేమో తాళం వేసుంది.

“ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ గేట్ ఓపెన్ చేయండి. ” అంటూ డోర్ పట్టుకుని గట్టిగా ఆడించడం మొదలుపెట్టింది. కానీ ఎటువంటి సమాధానం లేదు. దానికీ కారణం లేకపోలేదు తమ స్కూల్ కీ,హాస్టల్ కీ దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పోనీ స్కూల్ దగ్గర వాచ్ మెన్ కి వినపడుతుందా అంటే అదీ లేదు వాచ్ మెన్ ఉండే స్థలం క్లాస్ రూమ్ కి కొంచెం దూరం, ఇంకా అది పడుకునే సమయం కావడం తో అతను పడుకున్నాడేమో ఎంత పిలిచినా పలకడం లేదు.

ఇంతలో ఘల్ ఘల్ మని గజ్జెల చప్పుడు వినిపించడం మొదలైయ్యింది. అప్పుడు గుర్తొచ్చింది కీర్తనకి తన ఫ్రెండ్స్ చాలా సార్లు చెప్పింది.స్కూల్ కి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో ఎన్నో ఏళ్ల క్రితం ఒక అమ్మాయి చనిపోయిందటా, రాత్రి వేళల్లో ఆమె ఆత్మ ఆ ప్రాంతం అంతా తిరుగుతుందటా.

అంటే ఆ గజ్జెల చప్పుడు దెయ్యం రూపం లో ఉన్న ఆమె వేనా అనుకుని భయపడుతూ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మనసులో అనుకుంటూ ఇక ఆ గేట్ దగ్గర నిలబడకుండా పక్కనే ఉన్న క్లాస్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది.

కానీ ఆ గజ్జెల చప్పుడు చాలా ఎక్కువ అవ్వడంతో ఆమెకి భయం చాలా ఎక్కువై వంట్లో వణుకు మొదలైంది.

‘ఈ రోజు తను దెయ్యానికి ఆహారం కావాల్సిందే. ఎన్ని ఆశలు పెట్టుకుంది జీవితం పై.కానీ అవన్నీ అడియాసలే అయ్యేలా ఉన్నాయి’అనుకుంటూ గుండెలపై చేతులు వేసుకుని కూర్చుంది. కాసేపటికి కళ్లు మూతలు పడుతుంటే నిద్రపోయింది. కానీ ఇంతలో ఆ చప్పుడు తను ఉన్న రూమ్ కి బయటే వినిపించడం మొదలు పెట్టింది.

భయం తో ఫ్యాన్ కింద ఉన్నా కూడా కీర్తన కి చెమట్లు పట్టేస్తున్నాయి. కాళ్లూ చేతులూ వణికేస్తున్నాయి. ఆ రాత్రి గడిస్తే తను మరుసటి రోజు సూర్యోదయాన్ని చూడగలదు. కానీ రాత్రి గడుస్తుందన్న నమ్మకం లేదు తనకి.అప్పుడప్పుడూ వినిపించే గజ్జెల చప్పుడు, అది చాలదన్నట్టు కీచురాళ్ళ రొదలు.

లైట్ ఫ్యాన్ వేసి ఉండటంతో ఎక్కడ తను దెయ్యానికి కనిపిస్తానో అని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి లైట్ ఆఫ్ చేసి ఓ కుర్చీ ఓరగా కూర్చుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఉంది. మెల్ల మెల్లగా కళ్లు మూతలు పడుతున్నాయి.కళ్లు మూస్తే ఏ వైపు నుంచి దెయ్యం వచ్చి చంపి తినేస్తుందో అనే భయంతో మూతపడే కళ్లను బలవంతంగా తెరుచుకుంటూ కూర్చుంది.

ఇంతలో ఈల చప్పుడు వినిపించడం తో ‘వాచ్ మెన్ డాడీ కామోసు వస్తున్నాడు. గేట్ దగ్గరికి వెళ్తే తను కనిపించి తాళం తీస్తాడు కదా.’ అనుకుని డోర్ తీసుకుని వెళ్దామనుకుని నెమ్మదిగా తలుపు తీసి అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ వరకూ వెళ్లింది. తను ఉండే రూం గేట్ కి దూరంగా ఉండటంతో తను వెళ్లేసరికి వాచ్ మెన్ వెళ్లిపోయాడు. డాడీ డాడీ అంటూ అరిచింది కానీ ఆమె అరుపులు అతనికి వినపడే లేదు.

ఇక చేసేదేం లేక నెమ్మదిగా నడుచుకుంటూ గేట్ పక్కనే ఉన్న రూం లోకి వెళ్లింది మళ్లీ విజిల్ వినిపిస్తే వెంటనే పిలవొచ్చనే ఆలోచనతో. లైట్ వేయకుండా ఫాన్ మాత్రం వేసుకుని కిటికీ దగ్గరే ఉన్న కుర్చీ పక్కన కూర్చుంది.

సమయం ఎప్పుడూ లేనిది ఆలస్యంగా గడుస్తుంది. అప్పటికే భయం తో బిక్కచచ్చి పోయిన కీర్తన కి గత సంవత్సరం శీతాకాలం లో చనిపోయిన వాచ్ మెన్ బహుదూర్ గుర్తొచ్చాడు. యూరినల్ వెళ్లే సమయంలో వెనుక నుంచి ఎవరో ముళ్ల పొదల్లోకి తోయడం, ఊపిరి ఆడకుండా చేయడంతో చనిపోయాడు. అందరూ అంటారు ఆయన్ని దెయ్యమే చంపేసిందని. ఆయన్ని చంపేసినట్టే తననీ చంపేస్తే…‌అమ్మో…ఆ ఆలోచనకే కీర్తన ఒళ్లు జలదరించింది.

నరాలు తెగే భయం. ఒళ్లంతా వణుకు. కళ్లు మూస్తే చాలు జడలు విరబూసుకుని, తెల్లచీర కట్టుకుని, ముఖం మీద రక్తపు చారికలతో, కాళ్లు రెండు వెనక వైపు కి తిరిగి చూస్తేనే భయంతో ఊపిరి ఆగిపోయేలా ఉన్న భయంకరమైన ఆకారం కళ్లముందు కదలాడుతోంది. ఆ భయానికి ఇక నిద్రపట్టడం మానేసింది.

“తల్లీ! నువ్వు బాగా చదువుకోవాలిరా. భోజనం బాలేదు, హాస్టల్ లో నీరు రావడం లేదు, ఫ్రెండ్స్ పేదపిల్లవని, నల్లగా ఉంటావనీ గేలిచేస్తున్నారు అని బాధపడకు.నీకు చదువు తప్పించి ఇంకేమీ గుర్తు రాకూడదు. నువ్వు అదైనా తింటున్నావు. ఊర్లో నీ చెల్లెల్లు రోజూ చారన్నమే తింటారు అదీ కాకపోతే రాగిసంకటి. వారికంటే నీ పరిస్థితి కాస్త బెటర్ కదా.అదే ఆలోచనలో ఉంచుకో. ఎలాంటి విపరీత పరిస్థితి వచ్చినా భయపడకు. ఆ దేవున్ని మనసులో ఉంచుకుని అవి దాటి విజేతవు కా.” అంటూ నెలరోజులకు ఒకసారి తన దగ్గరికి రావడానికి డబ్బులు లేకపోతే తన తల్లి విజయ దగ్గర ఓ ముప్పై రూపాయలు తీసుకుని, ఇరవై బస్సు ఛార్జీలు కట్టి, పది రూపాయలు తన చేతిలో పెట్టి తల్లి లక్ష్మి చెప్పే మాటలు గుర్తొచ్చాయి.

ఆ మాటలు గుర్తుకు రాగానే ‘లేదు నేనిలా భయం తో ఉంటే ఎలా.అమ్మ నా మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. నా కూతురు బాగా చదివి ఉద్యోగం చేసి మమ్మల్ని బాగా చూసుకుంటుంది అని నాన్న కనపడిన వారికి అందరికీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేనిలా స్కూల్ లో చనిపోయానంటే ఎంతటి అప్రతిష్ట. ఆడపిల్ల చనిపోయిందంటే ఎన్నేసి మాటలు ఆడుతుంది ఈ సమాజం. అవన్నీ అమ్మా నాన్న భరించగలరా. చెల్లెల్లు ఎంతలా ఏడుస్తారు. లేదు తను భయపడకూడదు. భయపడితే దెయ్యమే కాదు నా నీడని చూసినా గుండె ఆగి చనిపోతాను. అలా కాకూడదు. కీర్తనా నీకు చాలా ధైర్యం అని అందరూ అంటారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం వీడవు అంటారు. ఇదేనా నీ ధైర్యం. ఈ రాత్రి గడవాలి. నువ్వు రేపు సూర్యోదయం చూడాలి. చదివి మంచి ఉద్యోగం సాధించాలి.’ అని ధృడంగా అనుకుంది.

అలా అనుకోగానే ఆమెలో అంతవరకూ ఉన్న భయం స్థానే ధైర్యం వచ్చింది. ‘ఇలా భయం తో ఉంటే భయటపడలేను. తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చే పాలవ్యాన్ వాళ్లని పిలిస్తే వాళ్లు వెళ్లి వాచ్ మెన్ డాడీ కి పిలుస్తారు. తను బయటపడొచ్చు. ‘ అనుకుంటూ పాలవ్యాన్ రాకడ కోసం ఎదురుచూస్తూ ఈ లోపు తన ధైర్యం సడలకుండా ఉండేలా చేయమని ఆ ఆంజనేయ స్వామి ని మనసులోనే తలుచుకుంటూ ఉంది.

ఓ అరగడియ దాటే సరికి వ్యాన్ వస్తున్న శబ్దం వినిపించింది. గేట్ వరకూ వెళ్లే సరికి వాళ్లు వెళ్లిపోతారేమో అని భయపడి కిటికీ నుంచే “అన్నయ్యా! అన్నయ్యా వాచ్ మెన్ డాడీ కి పిలవరా. నేను క్లాస్ రూం లో ఇరుక్కుపోయాను.హెల్ప్ మీ ప్లీజ్.” అంటూ పిలవడం మొదలుపెట్టింది.

కానీ వ్యాన్ ఆన్ చేసి ఉండటం తో తన కేకలు వారికి వినపడనే లేదు. తలుపు తెరుచుకుని బయటకు వెళ్లేసరికి ఆ వ్యాన్ వెళ్లిపోయింది. నిరాశగా గేట్ నే పట్టుకుని నిలబడి పోయింది. ఇంకో గంట పాటు ధైర్యంగా ఉండు కీర్తనా, ఆరింటికి పీఈటీ మేడమ్ వచ్చి డ్రిల్ చేయిస్తారు. అప్పుడే వాచ్ మెన్ డాడీ గేట్ తీసి మోటర్ వేసి గార్డెన్ లోని మొక్కలకు నీళ్లు పోస్తాడు. అంతవరకూ ధైర్యంగా ఉండాలి.’ అనుకుని మళ్లీ క్లాస్ రూం లోకి వెళ్లింది. ఇప్పుడెందుకో గజ్జెల చప్పుడు కానీ, కీచురాళ్ళ రొదలు కానీ ఆమెలో భయాన్ని కలిగించడం లేదు. కేవలం బయటపడాలనే ఆలోచన తప్పించి. ఇక భయం వీడి ఆ క్లాస్ రూంలో ఉండే బుక్స్ తీసి చదవడం మొదలుపెట్టింది. ఓ రఫ్ నోట్స్ తీసుకుని ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్ చేసుకుంటూ గడిపింది.

అలా అలా ఓ రెండు గంటలు దాటాక పీఈటీ మేడమ్ వేసే విజిల్ వినిపించింది. అది వినిపించిన కాసేపటికి వాచ్ మెన్ డాడీ వచ్చి గేట్ తీసాడు. గేటు తీసిన చప్పుడు కాగానే పరుగున గేట్ దగ్గరికి వెళ్లి అది దాటి గ్రౌండ్ వైపు గా నడుచుకుంటూ వెళ్లి మేడమ్ చూడకముందే లైన్ లో కలిసిపోయింది.

క్లాస్ రూం ల వైపు నుంచి వస్తున్న కీర్తనని చూడగానే ఫ్రెండ్స్ లో ఆశ్చర్యం. “ఏంటే క్లాస్ రూం వైపు నుంచి వస్తున్నావు?. రాత్రి ఎక్కడ ఉన్నావు?.” అంటూ ప్రశ్నలు మొదలుపెట్టారు.

జరిగింది మొత్తం చెప్పి, “అదంతా కాదే రాత్రి నైట్ స్టడీ కి వచ్చినప్పుడు కరెంట్ పోతే అందరం కబుర్లు చెప్పుకుంటూ అక్కడే పడుకుండి పోయాము అందరం. మరి మేడమ్ వెళ్లిపోమని చెప్పినప్పుడు నన్నేం లేపకుండా వెళ్లిపోయారు.” అంటూ వారిపై విరుచుకు పడింది.

“అదికాదే నువ్వు కనపడకపోవడం తో మీ పిన్ని వాళ్ల రూం లో పడుకున్నావేమో అనుకున్నాం కానీ నువ్విలా క్లాస్ రూం లోనే ఉండిపోయావని అనుకోలేదు. సారీ కీర్తనా. నువ్వు కాబట్టి రాత్రి ఒంటరిగా ఉన్నావు. అదే మేమైతేనా చచ్చూరుకుండేవాళ్లం. అయినా తొమ్మిదో తరగతి చదివే నీకు ఇంత ధైర్యం ఏంటే బాబూ. నీ ధైర్యానికి హేట్సాఫ్.” అన్నారు అందరూ. ఇంతలో పీఈటీ మేడమ్ విజిల్ వేయడంతో రన్నింగ్ చేయడానికి పయనమైనారు లైన్ లో.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!