(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
ఆకాశ హార్మ్యాలు
రచయిత :: అనురాధ కోవెల
అలనాడు
చీమలు దూరని చిట్టడవి
కాకులు దూరని కారడవి
ఆకాశానికి నిచ్చెన వేసినట్టుండే మహావృక్షాలు
ప్రకృతి తల్లి ఒడిలో ఆడుకునే మనుషులు
పక్షుల కీలకిలారావాలతో సందడి
ఎంత విలువైనదో.!
ఈనాడు కూడా ఉన్నాయి
ఆకాశానికి నిచ్చెనలు
కానీ అవి ఊచల కోరలతో
కాంక్రీటు మహారణ్యంలో
ఆకాశ హార్మ్యాల రూపంలో
రేడియేషన్ అనే విషంతో కాకులు పిచ్చుకలు కనుమరుగు కాగా
గాలి ఆడని ఇరుకు మర గదుల్లో
చీమల్లా సంపద పోగేస్తూ
సున్నితత్వం కోల్పోయిన మనుషులు
మిగిలారు యంత్రాల్లా
మర మనుషుల్లా..!
ఆభివృద్ధి ఆకాశంలో
మనుగడేమో పాతాళంలో
నిజంగా ఊపిరాడని బ్రతుకులు