ఆలోచించు
రచయిత :: కమల ముక్కు( కమల’శ్రీ’)
ఎందుకా ఆవేశం
ఎందుకా ఉద్రేకం
నీ నిర్ణయం
ఎంతమందిని వేదనకు గురి చేస్తుందో
ఓసారైనా
ఆలోచించావా…!!!
నీ నిర్ణయం
నీ కన్నవారికి
కడుపుకోతని మిగులుస్తుందని
ఆలోచించావా…!!!
నీ నిర్ణయం
నీ తోడబుట్టిన వారు
కన్నీరు మున్నీరయ్యేలా చేస్తుందని
ఆలోచించావా…!!!
నీ నిర్ణయం
నీ ప్రాణ స్నేహితుల
ప్రాణాలు తోడేసేలా చేస్తుందని
ఆలోచించావా…!!!
ఎలా చూడగలరు వారు
తునాతునక లైన
నీ దేహాన్ని
ఎలా భరించగలరు
అల్లారుముద్దుగా
పెంచుకున్న బిడ్డ
మరి తిరిగి రాడని
ఎందుకంతటి తీరని శోకాన్ని
వారికి కానుకగా ఇచ్చి
క్షణికావేశంలో నీ జీవితాన్ని
రైలు బోగీల క్రింద నుజ్జునుజ్జైయ్యేలా
చేసుకున్నావు
అప్పులా
ఇంట్లో వాళ్లకి చెప్తే
ఓ చేయందివ్వరా
మేమున్నామంటూ
స్నేహితులతో గొడవా
నీ మిత్రులే గా
నిన్ను అర్థం చేసుకుని
వారే మళ్లీ తిరిగి వస్తారు
ప్రేమ విఫలమైయ్యిందా
నిన్ను కాదనుకుని వెళ్లినామె కోసం
నీ జీవితం త్యజించడం ఏమిటి
ఆమె ముందు దర్జాగా రాజాలా తిరగాలి గానీ
నీ క్షణికావేశాన్ని
కాస్త తగ్గించుకుంటే
ఓ తల్లికి గర్భశోకం ఉండేది కాదు
ఓ తండ్రికి చేతికందిన బిడ్డ పోయాడన్న
వేదన మిగిలేది కాదు
ఓ అక్కా చెల్లి తన కష్టనష్టాల్లో తోడుండే
అన్నదమ్ముడిని కోల్పోయేది కాదు
యువతా!
ఆలోచించు
సమస్య కి చావు ఒక్కటే పరిష్కారం కాదు…!!!