అమ్మ తోడిన మంచి నీళ్ళ బావి జ్ఞపకాల చారికలు

అమ్మ తోడిన మంచి నీళ్ళ బావి జ్ఞపకాల చారికలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:ఎల్.నిర్మలరామ్

ఒక్కోసారి కాలగమనం లో వెనక్కి చూస్తే కొన్ని కొన్ని మనసుని తట్టే క్షణాలు ఉంటాయి… సరిగ్గా నాకు అక్కడే మిగిలిపోయి ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిన్నటి  కాలం లోకి ప్రయాణం స్థిరం చేసుకుంటున్న క్షణాలు.. ఇప్పుడు.. నన్ను తడుతున్నాయి. విత్తనమేతానై మొలకెత్తడం తెలిసినవాల్లకి విధిని నమ్ముకుని ముందుకు సాగడమేకాదు మొండికేసిన ఎద్దును దారికి తెచ్చుకోవడం ముంచుకొస్తున్న ముప్పును చక్కదిద్దుకోవడం దుక్కిదున్ని సాగుచేసేనంత సులువైనదే కష్టం అనే జ్వాల అందుకోవడం జటిలమేమి కాదు. తలుచుకుంటే శ్రమ సేద్యం సాక్షిగా నివు సాధించిన విజయం ఏడు కొలల మంచినీళ్ళ బావి తోడి మా అందరి దాహం తీర్చడం నిదర్శనం మా అమ్మ రుక్కమ్మ అనేక చీకట్లు ముసిరిన దుఃఖ సమయాలను దీపం కింది నీడలోనే దాచుకుని ఇంటిల్లిపాది బతుకు దారికి వెలుగులు పంచిన జీవన దీపం మా అమ్మ తోటి వారు వారి పిల్లలకి జీతం (పనికి) పంపితే మాకు మాత్రం..

మా ఎదుగుదల కోసం
మూడింతలు కూలీ పని చేసి సాదినా భూదేవి
మా అమ్మ సముద్రమంత దుఃఖాన్ని కూడా కొంగులోనే ముడేసుకుని
కన్నీరంటకుండా మంచినీళ్ళ బావి పూడిక తీసి
నీటితో మా కాళ్లు దాటించినదిగులేరు మా అమ్మ
బాధల సుడిగుండాలు, అభద్రతా తుపానులూ
పేదరికపు ఉప్పెనలూ, మా అమ్మను తీరంలా
ముట్టడించినా మా బతుకు పడవల్ని
క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ధీశాలి
మా అమ్మ నిలువెత్తు కూలితనం కడుపు నిండా బువ్వతనం
బతుకంతా కన్నీరై ప్రవహించినా (పిల్లలకి)
మా నోటికి పన్నీరందించిన పాల చన్ను మా అమ్మ
ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నా ఫలాలే పంచిచ్చిన
చెట్టు తల్లి మా అమ్మ అందరికీ అన్నీ ఊడ్చి పెట్టి
తనకంటూ ఏమీ మిగుల్చుకోని ఒట్టి ఖాళీ పళ్లెం
మా అమ్మ ఎవరి ద్వేషాన్నయినా ఎందరి ఆవేశాన్నయినా
గుండెల్లోనే దాచుకుని ప్రేమను మాత్రమే పంచి పెట్టే
ఒట్టి పిచ్చి తల్లి మా అమ్మ ఏన్నో వ్రాయాలనిపిస్తుంది అమ్మ గురించి.. ఏం వ్రాయగలను!!!

అమ్మ విడిచిన తుదిశ్వాస నా నీడ నన్నోదిలి చేరుకున్న చివరి మజిలీ మునుపెన్నడూ స్పృశించనంతటి విషాద స్పర్శ క్షణకాలం  కాలాన్ని ఒడిసిపట్టుకుంటే బాగుణ్ణనిపించింది ప్రతి మలుపులోనూ అనుబంధాలు ఆప్యాయతల శిధిలాలే బ్రతికిచూడు అమ్మ లేకుండా భయమేస్తుంది నాకు వెలుతురులోనూ రెప్పకింద పారుతున్న
కన్నీటి ధారలో పాలిపోయిన చెంపలపై చారికలన్నీ అమ్మ జ్ఞాపకాలే గుండె ఒలికించిన అక్షరాలన్నీ
కాలం నా ముంగిట కూల్చిన తన గురుతులే రాలిపడిన ప్రతి ఆకులో ఊగుతున్న ప్రతీ కొమ్మలో
ఎన్నో గుసగుసలు నిర్లిప్తంగా..అన్నీ తన ఊసులే
అమ్మ మరణం వీడ్కోలు కాదు అమ్మ జ్ఞాపకాలకు మరణమూ లేదు..తన హృదయాన్ని నా దగ్గరే విడిచిపెట్టివెళ్ళింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!