ప్రేమ – సమాజం

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

ప్రేమ – సమాజం

రచన:ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

మనిషి దేవుడ్ని యిలా ప్రశ్నించాడట. నా ప్రేమకు, నీ ప్రేమకు తేడా ఏమిటి? అని. దానికి దేవుని సమాధానం “పక్షి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంటే అది నా ప్రేమ, పంజరంలో బంధించి వుంటే అది నీ ప్రేమ” అని. అవును కదా నిజమైన ప్రేమ ఎంత మధరమో కదా.

రామకృష్ణ పరమహంస చెప్పారు ప్రేమ మూడు రకాలని. ఒకటి నువ్వు ఏమైతేనేం నాకెందుకు, నేను బాగుంటే చాలు అనే సాధారణమైన ప్రేమ. నువ్వు, నేను కూడా ఆనందంగా వుండాలనేది సమంజస ప్రేమ రెండోది. ఇక మూడోది నాకు ఏమైనా ఫర్వాలేదు, నువ్వు సంతోషంగా వుంటే అంతకంటే నాకు కావాల్సింది యేముంది అనే సమర్థ ప్రేమ. ఇప్పుడు సమాజంలో యే రకం ప్రేమ వుందో తెలుస్తోంది కదా!
……
జనార్థన్, జీవిత అన్యోన్య దంపతులు. వారికి కొడుకు హర్షవర్ధన్, కూతురు చందన. వారి కుటుంబం అంటే ఇలా ఆనందంగా వుండాలనుకునేలా వుంటుంది.

సాంప్రదాయం, కులం, జాతకం చూసుకుని హర్షవర్ధన్ కు పరిపూర్ణతో వివాహం చేసారు. వివాహానంతరం కొడుకులో మార్పు గమనించారు తల్లిదండ్రులు. పుట్టింటి నుంచి యేమీ ఆశించని ఆస్తిపరుల ఏకైక కూతురు పూర్ణ. ఎన్నో విశాల భావాలు వున్న ప్రేమ మూర్తి. భర్త వుద్యోగం చేయమని పోరు పెడుతున్నప్పటికి, అత్తమామల మంచిచెడ్డలు చూడటానికి యింట్లో వుండటానికే ప్రాధాన్యత యిచ్చింది.

ఇక చందన అందాలరాశే కాదు సుగుణాల కుప్ప. ఈ గుణాల్లో వదిన గారికి సమవుజ్జీ. స్నేహితుల్లా వుంటారు.
……
చందన, సహ ఇంజనీరింగ్ విద్యార్థి వేణు ఒకరికొకరు ఇష్టపడి, ప్రేమించుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా వేణును వదినకు పరిచయం చేసింది. తను వేణుతో మాట్లాడిన తర్వాత అన్ని విధాలా తగినవాడే అని నిర్ణయానికి వచ్చి, అత్తమామలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాను కానీ వాళ్ళ ఆలోచనా ధోరణి బట్టి సందేహం చెప్పింది. ఏమైనప్పటికీ చందనా, వేణు ఒక నిర్ణయానికి వచ్చేసారు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది పూర్ణ.
……
పరిపూర్ణ అవకాశం చూసుకుని, చందన ప్రేమ విషయం ప్రస్తావనకు తీసుకుని వచ్చింది. కులాంతర వివాహం చేసుకున్నా అబ్బాయి మంచివాడు, అమ్మాయిని పోషించగలిగే స్థితిలో వుండి, మనలో కలిసిపోయే వాడైతే చాలు కదా అత్తయ్యా అంటూ మామగారి వైపు చూసింది.

“అది కాదు పూర్ణా నాకు చందన అంటే చాలా ప్రేమ. దాని యిష్టాయిష్టాలను కాదనలేను. కానీ వివాహం విషయంలో కులగోత్రాలు, సమాజంలో పరువు, ప్రతిష్ట కూడా చూసుకోవాలి కదా” .. జనార్థన్

“ఈ విధంగా వివాహం చేసుకుని, ఎంతమంది సంతోషంగా వున్నారో చూస్తూనే వున్నాం కదా మామయ్యా” .. పరిపూర్ణ

అప్పుడే ఆఫీసునుండి వచ్చిన హర్షవర్ధన్ వీళ్ళ మాటలు విని, “నాన్నగారు చెప్పింది కరెక్టే, నువ్వేమీ ఈ విషయంలో కలుగజేసుకోకు” అని ఖరాఖండిగా చెప్పి తన రూముకి వెళ్ళిపోయాడు.

భర్త అలా అనడంతో పూర్ణకు యేమీ పాలుపోలేదు. అక్కడితో సంభాషణ ఆగిపోయింది. ఈ సంభాషణ లోపలినుంచి చందన గమనిస్తోంది. ఏ అభిప్రాయం చెప్పనూ లేదూ, వాళ్ళు అడగనూ లేదు.

నెలలు గడిచిపోయాయి. చందన ఇంటినుంచి వెళ్ళి, వేణును రిజిస్టర్ వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. వేణుకు మంచి వుద్యోగం వచ్చింది. చందనను అత్తమామలు బాగా చూసుకుంటున్నారు. పైగా చందన కోసం అంతా శాఖాహారులుగా మారారు. సాంప్రదాయం కట్టుబాట్లు కూడా నేర్చుకున్నారు.

ఎవరో తెలియకపోయినా, చందన కులాంతర వివాహం చేసుకుందని, సమాజంలో తమలో వున్న కుళ్ళు చూడని జనం మొరుగులు, అరుపులు వినలేక తమకు పరువు పోయిందని బాధపడ్డారు తల్లిదండ్రులు.

రోజులు గడుస్తున్నాయి. అత్తమామలతో కలిసి పూర్ణ గుడికి వెళుతుండగా జనార్థన్ శోష వచ్చి పడిపోయాడు. పూర్ణ మామగారిని దగ్గరలో వున్న ఆసుపత్రికి తీసుకుని వెళ్లి, భర్తకు ఫోన్ చేసింది. మీటింగ్ లో వున్నాను, నాకు రావడానికి కుదరదు అని చెప్పి ఫోన్ పెట్టేసాడు యిక ఏమీ మాట్లాడకుండా. మీటింగ్ అనేది నిజం కాదని పూర్ణకు అర్థం అయినా ఏమీ చేయలేక చందనకు ఫోన్ చేయగానే చందనా, వేణు వచ్చి, డాక్టర్ తో అన్ని విధాలా మాట్లాడితే, మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, కానీ బీ-పాజిటివ్ రక్తం ఎక్కించాలి అనగానే, తనది అదే కాబట్టి రక్తం యిచ్చాడు వేణు. తన దగ్గర డబ్బు లేనప్పటికీ, స్నేహితుల సహకారంతో ఆసుపత్రికి సొమ్ము చెల్లించి, స్పృహలోకి వచ్చిన జనార్దన్ ను ఇంటికి తీసుకుని వచ్చాడు వేణు. అంతవరకూ ఆసుపత్రిలో వున్న చందన, తనను చూసి నాన్న ఎక్కడ ఎమోషన్ అవుతాడో అని కనిపించకుండా తన యింటికి వెళ్ళి పోయింది.

ఇంటికి వచ్చాక జనార్థన్ పలకరించాడు వేణుని పూర్ణకు తెలిసి వారనుకుని. ఈలోపు జీవిత అతను తమకు స్వయంగా ఎంతగా సహాయం చేసాడో చెప్పింది.

జనార్థన్ వేణుతో మీకు కృతజ్ణతలు, మీవారందరినీ రేపు మా ఇంటికి భోజనానికి తీసుకుని రండి అని మనస్పూర్తిగా ఆహ్వానించాడు.

అలా థ్యాంక్స్ చెప్పుకండి పెద్దవారు మీరు. మేము ఆర్థికంగా, కుల పరంగా తక్కువ వారమండి. నాకు ఈమధ్యనే వుద్యోగం వచ్చిందండి. మా అమ్మానాన్నలు పాత తరం వారండి. మీ లాంటి వారింటికి రావడానికి మొహమాటపడతారండి – వేణు

తన కొడుకును దృష్టిలో వుంచుకుని “ఏమిటయ్యా కులం కూడు పెట్టదు, ఉపకారం చేయదు, డబ్బుతో ఆప్యాయత కొనలేము, ప్రేమ ఎంతో మధురమైనది, అది వుంటే చాలయ్యా మనుషుల మధ్య” – జనార్థన్

ఆ మాట మామగారి నోట వినగానే పూర్ణ మేను పులకరించింది. అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన హర్షవర్ధన్ నాన్నగారితో యెటువంటి పలకరింపు లేకుండా తన రూముకి వెళ్ళిపోయాడు.

అయినా మామగారు వింటూ వుండగా, వేణు మీరంతా రేపు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు అని కన్ఫర్మ్ చేసేసింది పూర్ణ.

ఈలోపు మన ఇంటి భోజనాలు వారికి నచ్చుతాయో లేదో అన్నారు మామగారు నవ్వుతూ వారు మాంసాహారులని మాటల్లో తెలిసి.

“లేదు మామయ్యా, వారు వారి కోడలు కోసం శాఖాహారులుగా మారడమే కాదు, సాంప్రదాయ పద్ధతులు నేర్చుకున్నారు” – పూర్ణ

చాలా సంతోషం అని, వేణు వైపు తిరిగి “కులరహిత, మధురమైన ప్రేమ సమాజాన్ని కోరుకునే కుటుంబం వారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పి, రేపు మా ఇంటికి భోజనానికి అందర్నీ తీసుకుని రండి” – జనార్థన్.

వేణు యింటికి వచ్చిన తర్వాత వివరం తెలుసుకున్న చందన ఆనందానికి అవధులు లేవు. వదినకు మనస్సులోనే నమస్కరించింది.

తరువాత జనార్థన్ ఇంటికి వెళ్ళారంతా. కోడలు ద్వారా చందన వివరం తెలుసుకుని సంతోషంతో చందనను గుండెలకు హత్తుకోగానే పూర్ఢ ఆనందభాష్పాలతో కళ్ళు చెమర్చాయి, అలాగే భర్తలో కాలం మార్పు తీసుకుని రాకపోతుందా అని చిరు ఆశ కూడా మదిలో మెదిలింది .

తనకు తెలియకుండానే అందరి ముందూ అత్తగారు పూర్ణకు ఎమోషన్ తో ముద్దు పెట్టింది.

……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!