మళ్ళీ పుట్టిన మా చిట్టి తమ్ముడు

మళ్ళీ పుట్టిన మా చిట్టి తమ్ముడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

 “అమ్మో! అమ్మో! గుడ్లు తేలవేసేశాడు! భగవంతుడా! ఇప్పుడేంచెయ్యాలి? ఏమీ పాలిపోవడంలేదు. కాళ్ళు ఆడడం లేదు” అని లబోదిబోమంటూ కూలబడిపోయింది. కాంతమ్మగారు ఆ మ్యూజియం ఫ్లోర్ లోనే తన ఆర్నెల్ల ఆఖరి పిల్లాడు సూరిబాబుని గుండెలకు హత్తుకొని. అక్కడే కొంచెం ఓ మూలకు జరిగి పిల్లాడిచుట్టూ కొంగుకప్పి కడుపునింపడానికి చూసింది. పిల్లాడు పాలుకూడా తాగడంలేదని ఇంకా భయపడిపోయింది. పదిమంది పిల్లల్ని కని, పెంచిన తనకి ఇలా కంగారుగా ఉండడం తనకే ఆశ్చర్యం వేసింది. అవును, నిజంగానే ఈ అబ్బాయి పదకొండవ సంతానం. అన్ని కాన్పులూ ఇంట్లోనే, తమ పల్లెటూరిలోనే! ఏదో పూర్వకాలపు ముసలమ్మల సాయంతో, మనోధైర్యంతో అన్నీ నెట్టుకొచ్చేసిన తను ఇపుడు అలా భయపడ్డానికి కారణం లేకపోలేదు. రాత్రి నుండీ విరేచనాలు, వాంతులు అయిపోతున్న ఆ పిల్లాడికి చేతనైన సపర్యలన్నీ చేసినా, రాత్రి నిద్రలో తగ్గినట్లనిపించినా, ఇప్పుడు తిరాయించాయి. ఊరు కాని ఊరు వచ్చాము, ఏదీ తెలియదు, భాష కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చూపించాలి, ఏలా చెప్పాలి? అని పరిపరి విధాలుగా భయాందోళనలతో తనకూ తల తిరిగిపోతోంది. కాంతమ్మగారి భర్త కనకయ్యగారు పిల్లలందరినీ తీసుకొని, ఎప్పటిలాగే తిరుపతి యాత్ర ముగించేసుకొని, సుమారు ఒక రోజు రైలు ప్రయాణం దూరంలో ఉన్న తన ఊరికి వెళిపోవచ్చుననుకున్నారు. బంధుమిత్రులు చాలా సార్లు మద్రాసు కూడా చూసిరమ్మని చెప్పడం, చూడకపోతే ఏదో కోల్పోయినట్లు అనడం ఇలాంటివి గుర్తుకురావడంతోపాటు ఈ సారి యాత్ర సునాయాసంగా ముగియడం, పెద్ద పిల్లలు సాయం ఉండడం, వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో మద్రాసు కూడా చూసి రావచ్చునని బుద్ధిపుట్టింది. చకచకా మద్రాసు చేరి, రాత్రికి ఒక సత్రవులో బసచేసి, మర్నాడు ఉదయం టిఫిన్లు వగైరాలన్నీ పూర్తిచేసి, ఎగ్మోర్ మ్యూజియం చూడ్డానికి వచ్చేరు. ఓ అరగంటసేపు చూశారో లేదో ఈలోపునే ఈ ఆపద ముంచుకొచ్చింది. వచ్చీరాని భాషతో, కొన్ని సైగలతో అక్కడ పనిచేసేవాళ్ళని సంప్రదించగా, వాళ్ళు పక్కనే ఉన్న పిల్లల ఆసుపత్రికి శీఘ్రంగా తీసుకుపొమ్మన్నారు. అక్కడకు చేరి చూడగా అదొక పెద్ద అంతస్తుల భవనం. గేటువాడికి నచ్చజెప్పి, ఉరుకులు పరుగులతో అంతా లోనికి ప్రవేశించారు. ఆసుపత్రి వాతావరణం అలవాటు లేని వీళ్ళకు భయంగానూ, కంగారుగానూ ఉంది. రిసెప్షన్ లో సిస్టర్స్ కి పిల్లాడ్ని చూపించి, తమ గోడు అంతా విన్నవించారు మళ్ళీ అలాగే వచ్చీరిని భాషలో. వీళ్ళు చక్కగా అర్థం చేసుకొని, ధైర్యం చెప్పి, వెంటనే పిల్లాడ్ని జాయిన్ చేసుకున్నారు. ఓ నలుగురిని మాత్రమే అనుమతించి, మిగతావారిని బయట తోటలో కూర్చోమన్నారు. పిల్లాడిని నాలుగో అంతస్తుకి తీసుకెళ్ళి, కొన్ని పరీక్షలు చేసి, గ్లూకోజ్ ఎక్కించడం మొదలు పెట్టేరు. విరేచనాలు తగ్గలేదు, చల్లబడిపోయిన శరీరం ఇంకా వేడిని పుంజుకోలేదు, కళ్ళు విప్పడంలేదు. వీళ్ళకి ధైర్యం చెప్పేరు కానీ ఆ నర్సులు, డాక్టర్లు తమలో తాము చర్చించుకొనేది మాత్రం పిల్లాడి పరిస్థితి నమ్మకం లేదన్నట్లుగానే అనుకుంటున్నట్లు అర్థం అయ్యింది. కొన్ని ఫారాలు మళ్ళీ తెచ్చి, ఏవో సంతకాలు కూడా చేయించుకున్నారు తలిదండ్రులవద్ద నుండి. గ్లూకోజ్ సీసాలు అలా ఒకదాని తర్వాత ఇంకొకటి ఎక్కిస్తూనే ఉన్నారు. ముక్కులో ఏదో గొట్టాం పెట్టి, దాన్ని సోడా సిలిండరులాంటిదానికి కలిపేరు. మధ్య మధ్యలో ఓ నాలుగైదుసార్లు ఏవేవో ఇంజక్షన్లు చేసి వెళ్ళేరు. మద్యాహ్నం దాటిపోయింది. బయట కూర్చున్నవాళ్ళూ, లోపలి వాళ్ళూ ఇద్దరేసి చొప్పున మారుతూ అందరూ చూసి వచ్చారు పిల్లాడ్ని. ఒక సందర్భంలో తోటలో కూర్చున్నవాళ్ళు కనబడకపోతే మిగతావాళ్ళు కంగారు పడ్డారు. దూరాన ఇంకొక భవనం పక్కన నేలన బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. ఆరా తీయగా తెలిసిందేమిటంటే వీళ్ళు అంతవరకూ కూర్చున్నది శవాలగది దగ్గర అనీ, అక్కడ లోపలికి ఓ శవాన్ని తీసుకువెళ్ళడం చూసేరనీ, అంతే కాకుండా, అక్కడ కూర్చోకూడదని ఒకతను చెప్పేడనీ అన్నారు. అంతలోనే మరో శవాన్ని తీసుకెళ్ళడం చూసి, చాలా భయపడిపోయారు. సాయంత్రం అయింది. ఎవ్వరికీ తిండీ తిప్పలూ లేవు. పిల్లాడ్ని చూడ్డానికి లిఫ్టులో వెళ్ళిరావడంలో భయపడ్డారు అలవాటులేక కొందరు. పిల్లాడి చేతికి గ్లూకోజ్ గొట్టాం, ముక్కుకి ఇంకోరకం గొట్టాం, ఇవన్నీ చూసి కళ్ళుతిరిగినట్లై చతికిలబడ్డారు కొందరు. ఏమీ దొరకక, ఏమీ తినక, నకనకలాడుతున్న ఆకలితో మరి కొందరు నీరసించిపోయారు. ఇలా ఇక్కడికి తీసుకొచ్చి పిల్లాడ్ని పోగొట్టుకోవడం అవుతాదేమోనని ఇంకొందరు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇలా రాత్రి అయ్యేసరికి కాస్తంత మార్పు వచ్చింది. సమయానికి తీసుకువచ్చారు కాబట్టి సరిపోయిందనీ, ఓ అరగంట ఆలస్యం అయినా పిల్లాడు దక్కేవాడు కాదనీ, ఓ పూటలో తేరుకుంటాడనీ చెప్పేరు డాక్టర్లు. నర్సులు, డాక్టర్లు ప్రతీ పావుగంటకూ వచ్చి, పరీక్ష చేసి, ఏదేదో వ్రాసుకొని వెళ్తున్నారు. అర్ధరాత్రి అయ్యేసరికి పిల్లాడిలో అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయనీ విని అందరూ కాస్త ఊరడిల్లేరు. తెల్లారేక మరో ఇంజక్షన్ ఇచ్చి, ముక్కుగొట్టాం, చేతి గ్లూకోజ్ సూది, అన్నీ తీసేశారు. పిల్లాడు కళ్ళు విప్పి చూడడం, మామూలుగా ఏడ్వడం, ఆ తర్వాత అందర్నీ పలకరిస్తున్నట్లుగా బోసినవ్వులు నవ్వడం, ఇవన్నీ చూసి ప్రాణం లేచి వచ్చినట్లైంది అందరికీ. అవసరాన్నిబట్టి సందర్భాన్నిబట్టి మెల్లగా అర్థం చేసుకోగలగడంతో భాష సమస్య తీరిపోయినట్లైంది తాత్కాలికంగా. ఉదయం పదిగంటలకు పెద్ద డాక్టరు వచ్చి, కొన్ని జాగ్రత్తలు చెప్పి, మందులు వ్రాసి ఇచ్చి, బిల్లు ఇచ్చి, డిస్ఛార్జ్ ఇచ్చేరు. బిల్లు డబ్బులు ఇచ్చుకోలేనివారైతే ఇవ్వక్కర్లేదనీ, ఇవ్వగలిగి ఇస్తే, ఎవరికైనా ఇలాంటి ఆపదలో కాపాడడానికి వినియోగిస్తామనీ, ఇప్పుడు లేకుంటే ఇంటికి వెళ్ళేక మనియార్డరు చెయ్యవచ్చుననీ చెప్పి పంపించేరు. ఇంటికెళ్ళేక పంపిస్తామని చెప్పి, వాళ్ళందరికీ కోటి కోటి దండాలని చెప్పి, తమ సూరిబాబుని బతికించడం ద్వారా అందరి ప్రాణాలు కాపాడినట్లైందని కృతజ్ఞతా భావంతో అందరూ పదేపదే నమస్కరించి సెలవుతీసుకున్నారు కాంతమ్మగారు, కనకయ్యగారు, పిల్లలు అందరూ. తమ ఊరికి చేరిన రెండు రోజుల్లోనే ఆసుపత్రి వారి బిల్లు మొత్తం మనియార్డరు చేసి, మరోసారి ధన్యవాదాలు తెలుపుకున్నారు మనియార్డరు ఫారంద్వారా. ప్రాణదాత అయిన ఆ ఆసుపత్రి పేరు “ఎగ్మోర్ చిల్డ్రన్ హాస్పిటల్”. అప్పట్నుంచీ చాన్నాళ్ళపాటు మా సూరిబాబుని మద్రాసులో మళ్ళీ పుట్టేడు అనేవాళ్ళం. అదండీ! మళ్ళీ పుట్టిన మా చిట్టి తమ్ముడు కథ. నిజజీవితంలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన దానికి కొన్ని మార్పులు చేసి వ్రాయడమైనది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!