అంది వచ్చిన అదృష్టం

అంది వచ్చిన అదృష్టం

రచన: వేముల ప్రేమలత

రాధ, స్నేహ చిన్ననాటి స్నేహితురాళ్ళు..
టెన్త్ కాగానే రాధ పెళ్లయి హైదరాబాద్ లో స్థిరపడింది స్నేహ ఎమ్మే, బీఈడీ చేసి టీచర్ జాబ్ తెచ్చుకుంది.

ఒకరోజు రాధ నుండి ఫోన్ ” మా ఇంటి పక్కన కొత్తగా ఫ్యామిలీ దిగారు . అబ్బాయి చరణ్ చాలా బాగుంటాడు సాఫ్టువేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తారు . నీకు తగిన జోడీ . పిన్ని బాబాయి గారికి కూడా చెప్పాను. నువు కూడా ఒప్పుకోవే . ఇద్దరం ఇక్కడే ఉండొచ్చు ” అని.

పెళ్లి చూపులు. ఎంగేజ్మెంట్.. పెళ్లి చకచకా జరిగిపోయాయి.. ఒకగానొక్క అమ్మాయి అని స్నేహ పెళ్లి అంగ రంగ వైభవంగా చేశారు తల్లిదండ్రులు.

స్నేహితులు .. బంధువులు అందరూ స్నేహ అదృష్టాన్ని మరి మరి కొనియాడారు. ఎంత చక్కని జంట.. మంచి సంబంధం దొరికింది అని. తన అదృష్టానికి తనే మురిసిపోయింది స్నేహ. వాళ్ళ స్నేహితులలో.. బంధువులలో ఎవరికీ ఇంతమంచి సంబంధం దొరకలేదు అని.

అత్తవారింటికి వచ్చాక ఒక నెల రోజులు హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రదేశాలు చూసేసారు. వారాంతాలు సినిమాలు, హోటల్లో డిన్నర్ లు. తను ఎంతో అదృష్టమని మురిసి పోయింది.

హైదరాబాద్ కి బదిలీ చేయించుకుంది. రోజు చరణ్ తనని స్కూల్లో దింపి తను ఆఫీస్ కి వెళ్ళేవాడు..కొత్తలో అంత బాగానే ఉన్నారు .
అంతలోనే రాధ వాళ్ళ ఇంటి పక్క నుండి ఇల్లు ఖాళీ చేశారు. రాధ చాలా బాధ పడింది .. పక్కనే ఉండేవాళ్ళం .. అని

అప్పుడే తెలిసింది ఒక్కొక్కరి గుణాలు. చరణ్ చూడ్డానికి బాగానే ఉన్నా అన్ని దుర్గుణాలకు బానిస అని. ఇన్నాళ్ళు తనకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
రోజు తాగి వచ్చేవాడు. అనవసరంగా తనని తన పుట్టింటి వాళ్ళని తిట్టేవాడు. కొట్టేవాడు కూడా. ఎంతో ఓపిక పట్టినా , ఎంత నచ్చజెప్పినా వినేవాడు కాదు. దానికి తోడు అత్తమామలు, ఆడపడుచు కలిసి కట్నం తేలేదని.. మావాడికి కోటి రూపాయలు కట్నం ఇస్తాము అన్నారని… ఏదో నిన్ను నచ్చాడని చేసాము అని… నీవేమో సగం జీతం మీ అమ్మానాన్నలను ఎందుకు ఇస్తావు? అని రోజు గొడవ .. “నరకం లా ఉంది ఇల్లు’ అని రోజు బాధ పడేది.

ఒకరోజు చరణ్ తనని స్కూల్లో దింపి వెళ్తుండగా తన తోటి టీచర్ చూసింది.. తను వెళ్ళాక అడిగింది .. “ఇతను మీకేం అవుతారు” అని..” అదేంటి మేడం! అలా అడుగుతారు తను మావారు” అని .. “ఔనా…మీరు చాలా మంచివారు .. మీరేం అనుకోనంటే ఒక విషయం చెప్తాను”.. అంటే “సరే చెప్పండి” అండి స్నేహ. “తనని తనకి ఇంతకు ముందు రెండు పెళ్లిళ్లు అయ్యాయి మీకు తెలుసా? అని. “తనకు తెలియదు” అంది స్నేహ.

“మా ఫ్రెండ్ ఆ అమ్మాయి, తను జాబ్ చేసేది, జాబ్ చేసే ఆడవాళ్లకి మాయ మాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటాడు… వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇతనికి సపోర్ట్ చేసి డబ్బులు బాగానే తీసుకుని వదిలేయడం వాళ్లకు అలవాటు అయింది “”అని చెప్పింది.

తనకు ఇప్పుడు క్లియర్ గా అర్థం అయింది.. “వీళ్ళు నా జాబ్ చూసి చేసుకున్నారు.. కొడుకుకు వచ్చేది తన తాగుడుకు ఇంటికే సరిపోదు… తన పెళ్ళికి చేసిన అప్పు తన జీతం నుండి కడుతుంది కనుక అలా కట్టకూడదు అని వాళ్ళ గొడవ.”

ఒక్కసారి గా పాతాళానికి దిగిపోయినట్లు అనిపించింది. ఇవన్నీ తల్లిదండ్రులకు తెలిస్తే తట్టుకోలేరు ఏం చేయాలో తెలియడం లేదు. స్టాప్ రూం లో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది.

ఒక నిర్ణయానికి వచ్చి ,మర్నాడు స్కూల్ కి వచ్చి, లీవ్ పెట్టీ రాధ దగ్గరకు వెళ్లి అంతా చెప్పి బోరున విలపించింది. “మా స్కూల్లో తరుణ్ చాలా మంచివాడు నన్ను చాలా ఇష్ట పడ్డాడు . కానీ అతనికి ఒక కాలు పోలియోతో పోయింది. కర్ర సహాయం తో నడుస్తాడు.. అందుకే అతనిని కాదని , అందమైన చరణ్ నీ చేసుకున్నందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే ” అని ఏడ్చింది.

“నువ్వు బాధ పడకు , నిజంగా ఇవన్నీ నాకు తెలియదు .మా ఇంటి పక్కన ఉన్నపుడు అంతా బాగానే ఉన్నారు కదా! అని పెళ్లి కుదిర్చాను..ఇప్పుడు నేనే సరిదిద్దుతాను. “

జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు…. అలాగే వివాహం కూడా అందరికీ సంతోష కారకం కాదు. తామే సంతోషాన్ని కల్పించుకోవాలి అంది రాధ.

ఇద్దరు కలిసి తల్లిదండ్రులకు అన్ని విడమరిచి చెప్పారు.
“నేను ఆ ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను” అని భీష్మించుకుంది స్నేహ… కూతురి సంతోషమే తమ సంతోషం అని చరణ్ కు విడాకులు ఇప్పించారు. ముందుగా ఇవ్వనని బెట్టి చేసినా ఇంతకు ముందు పెళ్లి చేసుకున్న ఇద్దరి సాక్ష్యాలు.. స్కూల్లో టీచర్ సాక్ష్యం … అన్ని విని విడాకులు మంజూయ్యాయి .

అందరి ఆమోదం మేరకు తరుణ్ తో పెళ్ళి కుదిర్చారు..
స్నేహ నాకు అంది వచ్చిన అదృష్టం
అన్నాడు తరుణ్.

ఇరు కుటుంబాలు, రాధ ఫ్యామిలీ.. స్కూల్ లో టీచర్లు సమక్షంలో తోటి టీచర్ తరుణ్ నీ పెళ్లి చేసుకుంది స్నేహ.

వివాహ బంధం లో ఇంత మాధుర్యం ఉంటుందా అనేలా చూసుకుంటున్నాడు తరుణ్ స్నేహనీ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!