మానులు…మౌనగీతాలు
రచన:: బత్తిన కృష్ణ
అప్పుడప్పుడు ఈ చెట్లగొంతుకలు
మౌన గీతాల్ని ఆలపిస్తూ
మూగబోతుంటాయి
కురవని మేఘం కాలయాపన చేస్తూ
వనంలో కొంగజపం చేస్తుంది చల్లనిగాలికోసం
వనం చుట్టూ పహారాకాసే కొండలు
ఇంతింత చెవులేసుకొని పక్షులు చెప్పే
కవిత్వం వింటూంటాయి
లోకంతీరును తప్పుబట్టే ఆయా
నోటిమాటలను కాలం కడుపులో
దాచుకొంటూ కొత్తకోడలి పాత్ర
పోషిస్తుంది
గాయమైన గుండెవెనుక ఎన్ని
గాయాల గొంతుకలు
ఈ చెట్లలాగానే మౌనగీతాల్ని
ఆలపిస్తుంటాయో కదా…
ఓదార్చడానికి ఎవ్వరూ లేరని
చెట్లు పక్షులు నదులు కొండలు
గాయమైన గుండెనేసుకొని తిరుగుతుంటాయి
అందుకనే…
అప్పుడప్పుడు మనిషిలాగానే
ఈ చెట్లన్నీ మౌనగీతాలనే ఆలపిస్తుంటాయి
నిశ్శబ్దపు యుద్దాలు చేస్తుంటాయి!!
***