(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
అంతరంగ ఆక్రోశం
రచన: శ్రీదేవి విన్నకోట
అంతరంగం ఆక్రోశం గా
ప్రశ్నిస్తే ప్రతి మనిషికి ఎన్ని అభ్యుదయభావాలు
అశువుగా తన్నుకొస్తాయో
జ్ఞాపకాల లోతుల్లో తడుముతూ మరెన్ని
ఆలోచనలు రేకెత్తిస్తాయో.
అంతరంగ తరంగాల్లో
అంతులేని అగాధాలు
కళ్ళముందు కదిలేవి కొన్ని
కలలుగా రాలిపోయేవి మరికొన్ని.
అంతరంగం ప్రశ్నిస్తే నిజాయితీగా
జవాబు చెప్పుకోలేని చిక్కు ప్రశ్నలెన్నో.
అందుకే ప్రశ్నలతో
భారాన్ని పెంచుకోలేక
అందుకే ఇలా మౌనంగానే మౌనాన్ని ఆశ్రయించా.