అనుకుంటే అనుకోని

అనుకుంటే అనుకోని
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన – మాధవి బైటారు ” దేవి తనయ”

ఆఫీసులోకి అడుగుపెట్టగానే కావ్య ని అందరూ చుట్టుముట్టారు. అభినందనలు ,పొగడ్తలతో ముంచెత్తుతుంటే అందరికీ వినయం గా చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పింది. “జాక్ పాట్ కొట్టేశావు. పార్టీ ఎప్పుడు?” అంటూ పద్మ షేక్ హాండ్ ఇస్తూ చేతులు ఊపేస్తూ అడిగింది .
”మీరందరూ ఎప్పుడంటే అప్పుడే” అని కావ్య అనగానే
“ముందే చెప్పమ్మా , ముందు రోజు నుండి కడుపు కాస్త ఖాళీగా ఉంచుకుంటాం” నవ్వుతూ అన్నాడు లోకనాధం.
“అవునవును” అంటూ వత్తాసు పలికారందరు చప్పట్లతో. సందడి అంతా సద్దుమణిగాక ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. అభిన౦దనలు తెలిపిన సహద్యోగులందరికి మరోమారు కృతజ్ఞతలు చెప్పి ఎప్పటిలాగే శ్రద్దగా పనిచేసుకోసాగింది కావ్య. పనంతా అయ్యాక ఇంటికి బయలుదేరుతుండగా పక్కగదిలో తన పేరు వినిపించి చెవులు రిక్కించి౦ది.
“చూశావా !, మేడంగారు ప్రమోషన్ కొట్టేశారు. మనతోనే జాయిన్ అయ్యింది అప్పుడే ప్రమోషన్ ఇచ్చేశారు. మనం ఎంత కష్టపడుతున్నా మనల్ని ఎవరూ పట్టించుకోరు. ” అంది పద్మ అసూయతో “ఆ వెంకటేష్ కూడా లిస్ట్ లో ఉన్నాడు కదా. ఎలాగైనా వస్తుందనే నమ్మకం తో ఉన్నాడట కానీ రాకపోయేసరికి ఒకటే ఫీల్ అవుతున్నాడు” అనగానే
“అంతేలే, అందరికంటే ముందు వచ్చేయడం . ప్రతిపనిలో తలదూర్చడం . అది చూసి ఈవిడ ఒక్కర్తే మహా పనిమంతురాలు అని మేనేజర్ అనుకోవడం.
అయినా నీకు, నాకు చేతకాదు పైవాళ్ళతో అంత చనువుగా ఉండటం, ఊరికే ఇచ్చేస్తారా ఏంటి “ అంది కసిగా కల్యాణి.
పక్కగదిలో తలుపు ఓరగా వేసి ఉండటం వలన కావ్య అక్కడ ఉందన్న విషయం వాళ్ళు గమనించలేదు.
ఆమాటలు వింటున్న కావ్య ముఖం కోపంతో జేవురించింది. ఇంతసేపు నవ్వుతూ అభినందనలు తెలిపి మనస్సులో నేనంటే ఇంత కసి పెట్టుకున్నారా?
వీళ్ళకి ఏవైనా సందేహాలు ఉంటే నా దగ్గరికే వస్తారు. నా పని పక్కన పెట్టి మరీ వాటిని తీరుస్తాను. అయినా ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు.
పైగా ప్రమోషన్ కోసం తనతో పోటీపడ్డ వెంకటేష్ మాటలు కూడా పొద్దున్న ఏదో తేడాగా అనిపించాయి.
ఇక అక్కడ ఉండలేక వెంటనే ఇంటికి బయలుదేరింది. భారమైన మనస్సుతో ఇంటికి చేరాక ఎంతో ఏడ్చింది. తరువాత తేరుకుని ఉద్యోగం లో చేరిన దగ్గర్నుండి అన్నీ గుర్తు తెచ్చుకుంది. తనెప్పుడు పనిలో చాలా సిన్సియర్ గా ఉంటుంది. ఎప్పటిపని అప్పుడే పూర్తి చేస్తుంది .మొదట్లో ఎవరు పెద్దగా ఏమనేవారు కాదు కాని రానురాను తన మీద కొందరు కామెంట్ చెయ్యడం గమనిస్తుంది.
తనేమిటో తనకి తెలుసు తన కుటుంబానికి తెలుసు. ఎప్పుడు తన హద్దుల్లోనే ఉంటుంది. దిగజారాల్సిన అవసరం తనకి లేదు.
తాము ముగ్గురం ఇంచుమించు ఒకేసారి జాయిన్ అయినా తను వాళ్ళకంటే ఉన్నత స్థితికి చేరుకోవడం వాళ్ళకి కంటగింపు గా ఉంది. అసూయతో రగిలిపోయి నిందలు వేస్తున్నారు.
ముందు ఏమి అనని వాళ్ళు ఇప్పుడు తన గురించి మాట్లాడుకుంటున్నారంటే తను అభివృద్ది చెందుతున్నట్లే కదా.
ఇంకా ఎక్కువ పని చేసి మరింత గుర్తింపు పొందాలి. ఎవరేమైనా అనుకుంటే అనుకోని. వెళ్ళే దారిలో ఎదురయ్యే ముల్లుల్ని తొలగించుకుంటూ వెళ్ళాలి కానీ ఎవరో ఏదో అంటారని పరుగు ఆపేస్తే ఎలాగ” అంటూ మనసును తేలికపరుచుకుని మరుసటి రోజు కోసం ఉత్సాహం గా ఎదురుచూడసాగింది కావ్య.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!