మంచు పలికే మౌన రాగాలు

మంచు పలికే మౌన రాగాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: అపర్ణ

దూరంగా ఉన్న కొండలు మంచు దుప్పటి కప్పుకుని, ఊపిరి పీల్చుకుని చల్లని గాలులు వదులుతుండగా, తను కప్పుకున్న దుప్పటిని ఒక్కసారిగా విదిల్చిందో ఏమో తెల్లని మంచు అలా పొగలాగా అల్లుకుంటూ ఆ పిల్ల గాలితో కలిసి ప్రయాణిస్తూ అసలే శీతాకాలం ఉదయాలు ఆయే ఎంత తెల్లవారినా, ఆ తెల్లని మంచు దాటికి ఆ సూర్యుడు కూడా తన ప్రతాపాన్ని కాస్త పక్కన పెట్టి, ఇంకాసేపు నిద్దరోతాను అన్నట్లు ఇంకా తొంగి చూడకుండా అంతే మొబ్బుల చాటు దాక్కుని తన అదును కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. పిల్ల గాలితో కలిసి చక్కర్లు కొడుతున్న మంచు అలా నలుగురిని పలకరించి తన పరవశం లో పడేసి తన దాసులు చేసుకుందాం అనుకుని అలా బయలుదేరి ముందుగా కిటికీ పక్కనే ఉయ్యాలలో బజ్జుకున్న బుజ్జాయి దగ్గరికి వెళ్లి తన నున్నని బుగ్గలని ఒక్కసారి నిమరగా, ఆమ్మో ‘బూచి’ అనుకుని హాచ్చి!!  మని తుమ్మేసరికి, చీమ చిట్టుక్కు మన్నా లెగవని ఆ కన్న తల్లి, తన బుజ్జాయి తుమ్ము శబ్దానికే లేచి కూర్చుని “అయ్యో! ఈ ‘మంచో’డికి పని పాటా లేనట్లుంది, నా బిడ్డని హాయిగా పడుకోనివ్వదే అని కసిరి తన చంటి బిడ్డని ఆనిచ్చుకుని దుప్పటి కప్పుకుని పడుకుంది.’ బాగానే ఉంది సంబడం’ అని ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి బయలుదేరింది.
కొంత దూరం వెళ్ళాక “ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే” అనే పాట వినపడగా, ‘అబ్బో ఈ కాలంలో ఆ కాలం పాట ఎవరబ్బా! అని ఓ ఇంటి పెరట్లో నుంచుని తొంగి, తొంగి చూడగా అది ఓ సెల్ రింగ్టోన్ అని అర్ధమైంది. ఆ ఫోన్ ఎత్తిన ఆ పిల్ల వంక చూస్తూ తన మనసైన వాడితో చిర్రుబుర్రులు ఆడుతున్న తనని చూసి పుసుక్కున నవ్వానో లేదో నా నోటినుంచి జాలువారిన మంచు ముత్యాలు ఒకదానికి ఒకటి జోడిగా అల్లుకుని మంచు తెర చాప లా ఆ అమ్మాయి ముందు నిలువగా నాలోని సృజనాత్మకు మెచ్చుకుంటాది అనుకుంటే, తన కోసం వస్తాను అని చెప్పి, రాలేకపోయిన చెలికాడిని తలచి అందుకు నా తెర చాపే వారిద్దరికీ అడ్డుగా ఉన్నది అని అనుకున్నదో ఏమో “ఏమే మాయదారి మంచు, నీవల్ల నా ప్రియ సఖుని చూడలేకపోయాను కదే, ఎన్ని రోజులు అయినదో తనని కనులారా చూసి అని మూతి మూడు వంకరలు తిప్పి ఇంటిలోకి వెళ్ళిపోయింది.
ఆ మాటకి మనసు మదనపడగా చటుక్కున అక్కడి నుంచి మాయమై గాలిలో కలిసి, “ఛీ, ఛీ ఇంకోసారి నీ ఇంటి తలుపు తడితే చూడు” అని ముద్దుగా తిట్టుకుని ఇంక ఎవరింటికి వెళ్లినా ఇలా అవమాన భారంతో తల దించుకుని తీరుగాడ వలసినదేనా అని భాదపడుతూ అలా వెళుతూ వెళుతూ ఉండగా ఏదో మధురమైన స్వరాన్ని తను దాటి వచ్చినట్లుగా అనిపించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగా, తన ఇంటి ముందు ముచ్చటపడి వేసుకున్న మల్లె పందిరి లోని మల్లె మొగ్గలని కోస్తూ “మంచు కురిసే వేళలో మల్లెలిరిసేనెందుకో అంటూ తన మదిలోని ఊసులకి ఆయువు అయిన తన మొగుని తలచి పాడుకుంటున్న ఆ పాటకి అప్పటిదాకా ఉక్కపోతగా ఉండి చెమటలు పట్టిన శరీరానికి ఒక్కసారిగా చల్లగాలి తాకితే ఎలా పరవశిస్తుందో అలా తాను పరవశించి తనకు కలిగిన ఆనందాన్ని ఆ మగువకి కూడా తెలియ చేయాలి అనుకుందో ఏమో తనని ఒక్కసారిగా చుట్టి వేసి మంచు వాన కురిపించిగా, తన పమిటతో తలను కప్పుకుని ఒక్కసారిగా లోనికి పరిగెత్తుతూ, అప్పుడే బయటికి వస్తున్న తన భర్తని చూసుకోకుండా పరుగు పెట్టేసరికి తనని తట్టుకుని కింద పడబోతున్న తనను, కింద పడనీయకుండా పట్టుకుని అంతే తేరిపారా చూస్తూ ఉండగా తన చేతిలోని మల్లెపూలు వారిద్దరి మీద మల్లెల వర్షంలా కురిసేసరికి ఇద్దరి మోములో నవ్వులు పూయగా వారి నవ్వును చూసి తాను జతకలిపి ఇద్దరిమీద ‘మంచు, మల్లెల వర్షం’ కురిపించి వారి అన్యోన్యతకు కారణం తాను చేసిన పని అని తలిచి అక్కడి నుంచి కనుమరుగవుతూ ఈరోజుకి ఇక చాలు అనుకున్నదో ఏమో మొబ్బుల చాటున కమ్మగా నిదరోతున్న సూర్యుని దరి చేరి అతని చెవిలో ‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’ అంటూ తన అలారం ను మోగించగా, భద్దకంగా ఆవులిస్తూ నిద్దర లేచిన రవి ని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ అప్పుడే విచ్చుకున్న ప్రొద్దు తిరుగుడు పూవువలే వస్తున్న వెచ్చని రవి కిరణాలు తనని తాకగా ఆ కిరణాలకు తను కరిగిపోతూ మరి రేపు మళ్ళీ వస్తానే అన్నట్లుగా వీడుకొలు చెబుతూ సెలవు తీసుకుంది మన మంచు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!