అనాధ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
అన్నపూర్ణ అనాధ. అనాధ అంటే ఎవరూ లేరనికాదు. అన్నీవున్న అందరూ ఉన్న అనాధ.అష్టాఐశ్వయర్యాలు ఆమెకు దేవుడిచ్చాడు .అన్నీ ఇచ్చిన దేవుడు సంతానమివ్వలేదు. ముందుగా చెప్పినట్లు అష్టైశ్యర్యాలలో సంతానముంటే ఉండొచ్చుగాక. అందుకే తాను కనకపోయినా మరో తల్లి కన్నబిడ్డను పెంచుకునేట్టు చేశాడు. పెంచుకున్న బిడ్డని కన్నబిడ్డకన్నా ఎక్కువగా మక్కువతో పెంచి పెద్దచేసింది. ఆ బిడ్డ ఎవరోకాదు తన తోటికోడలు కన్నబిడ్డ, పుట్టిన ఆరునెలలలోపే తెచ్చేసుకుంది.
కన్నబిడ్డకి జరిపినట్టే అన్నీ సంబరాలు చేసింది. నామకరణం చేసి అరవిందని పేరు పెట్టింది. కంటికిరెప్పలా కాపాడుకుంది. తానే స్వయంగా గోరుముద్దలు తినిపించింది. అల్లారుముద్దుగా పెరిగాడు అరవిందు. ఎటువంటి అసౌకర్యములేదు. ఎదీకావాలన్నా క్షణాలలో దొరికేది. అరవింద్ బాగా చదువుకున్నాడు. ఉన్నతచదువులు చదివాడు. విదేశాలకు వెళ్ళి కూడా చదువుకున్నాడు. అక్కడే ఉన్నతోద్యోగం సంపాదించాడు. విదేశి అమ్మాయీనే పెళ్ళికూడా చేసేసుకున్నాడు. అక్కడే స్థిరనివాసమేర్పాటు చేసేసుకున్నాడు. ఎప్పుడో సంవత్సరానికొకసారి స్వదేశానికి వస్తాడు. ఒ నెలరోజులు ఉండి వెళ్ళిపోతాడు.
అన్నపూర్ణ ఇప్పుడు అన్నపూర్ణమ్మ అయ్యింది. కాని మళ్ళీ అనాధ జీవితమే గడపాల్సి వచ్చింది. అరవింద్ తన దగ్గరకు వచ్చేయమంటాడు. కాని అన్నపూర్ణమ్మ వెళ్ళదు, వెళ్ళలేదు. ఇక్కడే ఒంటరిజీవితం గడుపుతుంది. అన్నపూర్ణమ్మ కి ఆరోజు పండగే పండగ. కొడుకు అరవింద్ వస్తున్నాడు. అరవింద్ కి ఇష్టమైన వంటలన్నీ చేయించింది. అరవింద్ తన భార్యా పిల్లలని కూడా తెస్తున్నాడు. చాలా ఆనందంగా వుంది అన్నపూర్ణమ్మ కి. చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది తన కొడుకు కోడలు మనవలనిచూడడానికి.
ఆమె ఆతృతకు ఇక అవకాశం ఇవ్వకుండా కాంపౌండులో కారు ఆగింది. కారులోంచి కొడుకు అరవింద్ భార్యా ఇద్దరు పిల్లలతో దిగారు. లోపలికి వచ్చిరావడంతోనే తమ గదులెక్కడని అడిగి వెళ్ళిపోయారు.
గంటలు గడుస్తున్నా గదులలోంచి బయటకు రావడంలేదు. అలా వాళ్ళకోసం ఎదురుచూడసాగింది అన్నపూర్ణమ్మ, అలా రెండుగంటల సమయం గడిచాక అందరూ గదులలోంచి వచ్చారు. భోజనాలకి రమ్మని పిలిచింది. కాని బయటకు వెళ్ళిచేస్తామని వెళ్ళిపోయారు. అన్నపూర్ణమ్మ బాధపడింది. కనీసం తనకు భార్య పిల్లలని పరిచయం చేస్తాడనుకుంది చెయ్యలేదు సరికదా తాను వండించిన భోజనాలు కూడా చేయలేదు. ఇలా నెలరోజులు గడచిపోయాయేగాని ఏనాడు తనతో కూర్చోని మాట్లాడిందిలేదు. నోరు విడిచి అడిగితే మనభాషవాళ్ళకు తెలియదు. వాళ్ళభాషనీకు తెలియదని దాటవేశాడు. ఉన్నన్నిరోజులు ఊళ్ళు పట్టుకొని తిరిగారే తప్ప తనతో కలసిమాట్లాడింది లేదు. ఎదో పర్యాటకప్రదేశానికి వచ్చినట్టు తన ఇల్లు ఒక అతిధిగృహమైనట్లు ప్రవర్తించారు. నెలరోజులొపోయాక ఇక వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతకుముందు తానొక్కడు వచ్చినప్పుడు తనతొపాటు తీసుకొని వెళతాను రమ్మనేవాడు. ఈసారి మాత్రం అలా మాటవరసకైనా అనలేదు. అన్నాకూడా అన్నపూర్ణమ్మ వెళ్ళేదేకాదు. వాళ్ళు వెళ్ళిపోయారు.మళ్ళీ అన్నపూర్ణమ్మ ఒంటరిగా అనాధలా మిగిలిపోయింది.
Excellent.