బ్రతుకు ప్రయాణం

బ్రతుకు ప్రయాణం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

కొన్ని కొన్ని ప్రయాణాలు బ్రతుకు గమనాన్ని మార్చేస్తాయి. తరువాతి కాలంలో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటిదే వినయ్ జీవితంలో కూడా జరిగింది. అది 1992 వ సంవత్సరం మార్చి నెల. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, సమయం ఉదయం ఆరు గంటలు కావస్తోంది. అప్పుడే దక్షిణ ఎక్స్ ప్రెస్ ఆగింది, స్టేషన్ చాలా రద్దీ గా, కోలాహలం గా ఉంది. మన ఇరవై రెండేళ్ల వినయ్ రైలు దిగి అటూ ఇటూ చూశాడు, గుండె గుభేల్ మంది. అనుకున్నంతా అయ్యింది తన బావ ప్రణయ్ రాలేదు స్టేషన్ కి. మదిలో ఎన్నో భయాలు తో కూడిన ఆలోచనలు. ఓ పదిహేను రోజుల క్రితం ఉత్తరం వ్రాశాడు తను వస్తున్నానని, స్టేషన్ కి రమ్మని. అసలు ఆ ఉత్తరం అందిందా, లేదా వచ్చాడా లేదా ఇలా భయం భయంగా చూస్తున్నాడు. అదేమిటి భయం ఎందుకు అనుకుంటున్నారా, ఇది చూడండి.
మన వినయ్ ది కాకినాడ. ఏదో డిగ్రీ వరకూ చదివాడు కానీ అసలు హిందీ రాదు. మన వాడికి డిల్లీ లో ఇంటర్వ్యూ వచ్చింది. వరుసకు అత్త అవుతుంది వాళ్ళ అబ్బాయి ప్రణయ్ అక్కడ ఉంటున్నాడు అని మనవాడు బయలు దేరాడు. ఇంటి సభ్యులు స్నేహితులు ఏమీ పర్వాలేదు వెళ్ళు. ఏదో ఒకటి చెయ్యాలి, ఉద్యోగం వస్తె అక్కడ ఉండు, లేదంటే వచ్చేయ్ అని రైలు ఎక్కించారు. అయితే మనవాడు మాత్రం తన బావ స్టేషన్ కి వస్తే సరే, లేదంటే సాయంత్రం దాకా అక్కడే కూర్చుని అదే రైలు లో తిరుగు ప్రయాణం అనుకుని ఎక్కేసాడు.
కొంచెం ఈ ప్రయాణం ముచ్చట్లు చూద్దామా. కాకినాడ నుంచి కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు పక్కనే ఉన్న సామర్లకోట వరకూ వచ్చి వినయ్ ని రైలు ఎక్కించారు. రెండు రోజుల రైలు ప్రయాణం అని తిండికి సరిపడా చపాతీలు, జంతికలు లాంటివి చేసి ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రం దాటితే ఏమి కొనుక్కుని తినాలో తెలీదు, భాష రాదు కదా. రైలు మెల్లిగా కదిలింది, రాజమండ్రి గోదావరి అంటే వాళ్ళ జిల్లా దాటింది. మరునాడు ఉదయం సిరిపూర్ కాగజ్ నగర్ అంటే రాష్ట్రం దాటింది అలా పరుగెడుతూ, మధ్యలో స్టేషన్ల లో ఆగుతూ నడుస్తోంది రైలు, మన వాడి బుర్రలో ఆలోచనలులా. ఏదో రైలు ఎక్కాడు, వెళ్తున్నాడు కానీ తన బావ రాకపోతే ఏం చెయ్యాలి అనే భయం తోడు ఉండనే ఉంది. నాగపూర్, భోపాల్, అగ్రా ఇలా అన్నీ దాటుకుంటూ వచ్చి ఇక్కడ ఆగింది. అదండీ ప్రయాణం. మళ్లీ వాస్తవంలోకి వద్దాం.
ఓ పక్కన కొంచెం ఆకలి వేస్తోంది. అంతగా చలి లేదు అది మార్చి నెల కావడంతో. వెళ్లి ఓ కాఫీ యో టీ నో తాగుదామంటే భాష అండి భాష, ఏమని అడుగుతాడు. ఏమిటీ అలా చూస్తున్నారు అవునండీ బాబు అవును మరి మన వాడి హిందీ భాషా ప్రావీణ్యం అదీ. ఎవరెవరో వస్తున్నారు హై హాల్లో అనుకుంటూ వాళ్ళ వాళ్ళని తీసుకుని వెళ్లి పోతున్నారు. ఈ బావ మాత్రం రావడం లేదు. ఏం చెయ్యాలి ఏమీ తోచడం లేదు. ఎవడో వస్తాడు చాయ్ చాహియే క్యా అంటాడు, ఒకడేమో అరే భాయ్ కహా జానా అంటాడు, ఇంకొకడేమో రేహనా కహా హై అంటాడు. ఎవడు ఏమంటే నాకేంటి అనుకుంటున్నాడు మనవాడు మాత్రం ఓ నవ్వు నవ్వుకుంటూ, ఎందుకంటే ఏమి అడుగుతున్నారో తెలిస్తే కదా. అదో రకమైన అవస్థ లో ఉన్నాడు. ఏదో దేశ రాజధాని ఆహా ఓహో అనుకున్నాడే కానీ ఇన్ని అవస్థలు ఉంటాయి అని ఏమి తెలుసు. ఇంగ్లీష్ కొంచెం బానే వచ్చు నాకేంటి అనుకున్నాడు. కానీ ఆఫీస్ లో నడుస్తుంది కానీ ఇలా రైల్వే స్టేషన్ లోనూ ఆటో వాల్లతోను ఇంగ్లీష్ ఏమి సాయం చేస్తుంది. ఇప్పుడు పోనీ బావ ఇంటికి పోదామంటే అతని ఆఫీస్ అడ్రెస్స్ తప్ప ఏమీ తెలీదు. అప్పట్లో ఫోన్లు కూడా అంతగా లేక పోవడం తో వేరే దారి లేదు. ఆఫీస్ ఫోన్ నంబర్ అయితే ఉంది కానీ అది పని చేస్తుందో లేదో. పని చేసినా ఎన్నింటికి వస్తారో ఏమిటో. అన్నీ సందిగ్దాలే. అసలు తను వ్రాసిన ఉత్తరం అందిందో లేదో తెలీదు. ఎందుకంటే జవాబు రాలేదు.
లేస్తాడు అటు ఇటు తిరుగుతాడు, మళ్లీ కూర్చుంటాడు లేస్తాడు. ఎటైనా కదిలితే మళ్లీ బావ వస్తె, అమ్మో ఎటూ పోను అంటూ బిగుసుకుని కూర్చున్నాడు. వెళ్ళే టప్పుడు ఎవరో చెప్పారు అక్కడ దిగాకా జాగ్రత్త, మోసం చేసే వాళ్ళు ఉంటారు, బేగ్గులు అవీ కాజేస్తారు అని. ఇంకేముంది ఇలా బిక్కు బిక్కుమంటూ ఉండగా ఒరేయ్ అన్న పిలుపు విన్నాడు. ఏదో తెలుగు పిలుపు లా ఉంది నా బావ అయితే బాగుండు అనుకున్నాడు. మళ్లీ నా పిచ్చి కానీ వస్తె ఈ పాటికి వచ్చే వాడు కదా అని ఓ పక్క. అదే పిలుపు మళ్లీ విన్నాడు, చెవులకు సంగీతం విన్నట్టు, మంచి ఎండలో మజ్జిగ ఇచ్చినట్టు, వారం ఉపవాసం ఉన్నవాడికి భోజనం దొరికి నట్టు ఉంది ఆ పిలుపు. అటు చూసాడు హమ్మయ్య, ఇంకెవరు నా బావ. బ్రతుకు జీవుడా అనుకున్నాడు. వామ్మో బావ హడలి పోయాను, నువ్వు రాకపోతే ఏం చెయ్యాలో తెలీదు. నా ఉత్తరం అందిందా, ఎలా ఉన్నావ్, ఏమిటి సంగతులు అని ఓ వర్షం కురిపించాడు ప్రశ్నలతో. అన్నిటికీ ఓ నవ్వు నవ్వాడు. స్వతహాగా కార్యదక్షత ఎక్కువ, మాటలు తక్కువ తన బావకి. మొత్తానికి వచ్చాగా నడు అని ఇంటికి తీసుకు పోయాడు. అదండీ అలా చేరాడు మన వినయ్ డిల్లీకి. ఆ రోజు అంతా విశ్రాంతి, మరునాడు ఇంటర్వూ. బావ దగ్గరుండి తీసుకు వెళ్ళాడు. మొత్తానికి ఆ ఇంటర్వూ లో ఉద్యోగం ఏమీ రాలేదు కానీ బావ సాయం తో ఆ ప్రయాణం మనవాడికి జీవన ప్రయాణం అయింది.
తరువాత ఏదో మాన్ పవర్ కన్సల్టెంట్ ద్వారా వేరే ప్రైవేట్ ఉద్యోగం రావడం బావ ఇచ్చిన చేయూత తో అక్కడ జాయిన్ అవడం. మెల్లిగా ఓ రూం అద్దెకు తీసుకుని ప్రయాణం సాగించడం అన్నీ తన ప్రమేయం లేనట్టే జరిగి పోయాయి. కొంత కాలానికి మెల్లిగా నిలదొక్కుకుని స్థిరపడ్డాడు. భాష గురించి ఓ రెండు ముక్కలు చెప్పాలి కదా. హిందీ లో బస్ ఎక్కడం ఎలా, దిగడం ఎలా, టికెట్ కొనుక్కోవడం అన్ని తెలుగులో వ్రాసుకొని, ఓ అడ్రెస్స్ చీటీ కూడా జేబులో పెట్టుకుని తిరిగేవాడు. అప్పటికి బావ కి పెళ్ళై ఓ కూతురు ఉండేది. అతని భార్య అంటే వినయ్ కి అక్క కదా. మహా సాధ్వి, మహా ఇల్లాలు అని చెప్పాలి. లేదంటే ఆ మహా నగరం లో కొన్ని రోజులు ఉంచుకుని అన్నీ తెలిసే దాకా వెనకుండి నేర్పడం అంటే మామూలు విషయమా. మనవాడు ఎక్కడెక్కడో బస్ దిగి పోయి, అడగడం రాక కిలో మీటర్లు నడవడం చేసేవాడు. బేకరి లో బిస్కట్లు అవీ అయితే కనిపిస్తూ ఉంటాయి ఎవరినీ అడకక్కర్లేదు అని కొనుక్కునే వాడు. లేదంటే ఏదో తిందా మనుకుని ఏదో కొనుక్కుని తినలేక మాడడమే. ఎవరెవరో ఏదో మాట్లాడితే తిడుతున్నారో ఏమో తెలీక పోవడం తో లాభం లేదు అనుకుని మెల్లి మెల్లిగా హిందీ పదాలు, వాక్యాలు తెలుగు లో రాసుకుని బట్టి పట్టాడు. ఇప్పుడు తల్చుకుంటే భలే నవ్వు వస్తుంది. ఇలాంటి డక్కా ముక్కలు తిని, బాగా రాటు దేలి మంచి భాష మీద పట్టు తో బాటు అవసరం అంటే ఏమిటో, ఎలా బ్రతకాలో అన్నీ అక్కా బావ ల దగ్గర బాగా నేర్చుకున్నాడు. అంతకు ముందే కొంచెం చిన్న వయసు లోనే తండ్రి పోవడం తో సొంత అన్న దగ్గర చదువు తో బాటు రా’బంధువులు చూపిన బ్రతుకు అర్థాలు తెలుసుకున్నాడు. ఇప్పటికీ వినయ్ కి, ప్రణయ్, అక్క వాళ్ళంటే ఎంతో అభిమానం. వాళ్ళు కూడా స్వతహా గా మంచి వాళ్ళు కావడం, బావ సొంత వ్యాపారం లో మంచి స్థాయి లో ఉండండం తో వాళ్ళకీ మన వినయ్ అన్నా వాళ్ళ కుటుంబం అన్నా బాగా అభిమానం. ఏం సాయం కావాలన్నా కాదనరు. ఇదండీ అలా జీవితంలో స్థిరపడి ముందుకు సాగుతున్నాడు మన వినయ్.
అదండీ జీవిత ప్రయాణం గా మారిన మన వినయ్ ఢిల్లీ ప్రయాణం.

You May Also Like

24 thoughts on “బ్రతుకు ప్రయాణం

  1. చాలా ఉపయోగకరమైన కథ. కృషి, పట్టుదల ఎప్పటికి విజయం సాధిస్తాయి

    1. బ్రతుకు ప్రయాణం బాగుంది.సూపర్. ప్రయాణం పూలబాటలో సాగాలి.

  2. జీవిత గమనాన్ని మార్చే ప్రయాణాలు… చక్కగ వివరించిన తీరు బాగుంది

  3. అవునవును అన్నయ్యా కొన్ని ప్రయాణాలు బతుకు గమనాన్నే మార్చేస్తాయి… బాగా వ్రాసారు. మనసుకు దగ్గరగా ఉంది. సూపర్👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!