అసలు “దొంగ ఎవరు”?

అసలు “దొంగ ఎవరు”?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కందర్ప మూర్తి

 అసలు “దొంగ ఎవరు?” భారతమ్మ ఉదయం నుంచి ఇల్లంతా చిందర వందర చేసి చికాకు పడిపోతోంది. బీరువాలో బట్టలు బయట పడేసింది. అలమరలోని కొడుకు పుస్తకాలు నేలమీద విసిరేసింది. బెడ్ మీద పక్క బట్టలు చెల్లాచెదురు చేసేసింది. ఎంత వెతికినా రాత్రి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన నాలుగు తులాల
బంగారు గొలుసు కనబడలేదు. నిన్ననే బ్యాంక్ లాకర్ నుంచి ఫంక్షన్ కోసం తెచ్చింది. ఇంట్లో ఉంటే దొంగల భయం కొద్దీ బంగారు గాజులు, నాలుగు తులాల గొలుసు భద్రం కోసం లాకర్లో ఉంచవల్సి వచ్చింది. ఆడపడుచు కూతురు నిశ్ఛితార్దమని తెచ్చి రాత్రి పడుకునే ముందు తీసి చిన్న ప్లాస్టిక్ సంచిలో ఉంచి డ్రెస్సింగ్ టేబుల్ అరలో పెట్టింది. ఉదయం లేచి స్నానం చేసి మెడలో వేసుకుందామంటే ప్లాస్టిక్ కవర్తో సహా బంగారం గొలుసు కనబడక కోపంతో రంకెలేస్తోంది. ఉదయం వాకింగుకెళ్లిన భర్త గుర్నాథం ఇంట్లో అడుగు పెడుతూనే అక్కడి వాతావరణం చూసి విస్తుపోయాడు. ట్యూషన్ కెళ్ళి వచ్చిన కొడుకు విశ్వనాథం తన పుస్తకాల సెల్ఫ్ లో పుస్తకాలు నేల మీద పడి ఉండటం చూసి ఏమైందో అర్ధం కాక అయోమయంలో పడ్డాడు. అసలు ఇంట్లో ఏమైంది తెలియక తండ్రి కొడుకులు తలలు బాదుకుంటున్నారు. అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన మొగుణ్ణి చూసి “ఏమండీ, రాత్రి డ్రెస్సింగ్ టేబుల్ అరలో పెట్టిన  నా బంగారు గొలుసు చూసారా?” అంది. “లేదే, నేను బెడ్ మీద నుంచి లేస్తూనే బ్రష్ చేసుకుని వాకింగుకి వెళ్లేను. అప్పుడు నువ్వు బాత్రూమ్ లో ఉన్నావు. విశ్వం పెరట్లో ఉన్నాడు. “సమాదానం చెప్పేడు గుర్నాథం.”మరేమైంది టేబుల్ మీద ఉంచిన బంగారం గొలుసు? ఏరా , విస్సూ నువ్వు చూసావా?” అసహనంగా అడిగింది.”లేదే, అమ్మా! నేను కూడా బ్రష్ చేసి పుస్తకాల బేగ్ తీసుకుని ట్యూషన్ కి. వెళ్లేను. నీ గొలుసు సంగతి నాకు తెలవదు.”అమాయకంగా సమాధానమిచ్చాడు. ఇంట్లోని నాలుగు తులాల బంగారు గొలుసు ఎలా మాయమైందో తెలియక
అందరూ సతమతమవుతున్నారు. ఉదయం నుంచి ఇంటికి ఎవరెవరు వచ్చారో వాకబు చేస్తే పనిమనిషి రాములమ్మ ఊరెళుతున్నాను ఈరోజు పన్లోకి రానని చెప్పి వెళ్లిందట.
పాలబ్బాయి గుమ్మంలో కొచ్చి గిన్నెలో పాలు పోసి పోయినాడు. కూరలమ్మి తోటకూర కట్ట ఇచ్చి వెళ్లింది. ఎవరూ ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు
లేవు. మరి బంగారు గొలుసు ఎలా మాయమైంది అంతుబట్టడం లేదు. చివరకు పోలీసు స్టేషన్లో కంప్లైంటు ఇవ్వవల్సి వచ్చింది. పోలీసు సబ్ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి గుర్నాథం ఇంటికి వచ్చి ఎంక్వయరీ మొదలెట్టారు. బంగారు వస్తువు ఎప్పుడు ఎక్కడ పెట్టింది, ఉదయం నుంచి ఎవరెవరు
వచ్చింది వాకబు చేసారు. మరొకసారి ఇంట్లో పప్పులడబ్బాలు, పోపులగిన్నెలు కిచెన్ సామాన్లు దగ్గరుండి వెతికినా ఫలితం లేకపోయింది. పనిమనిషి రాములమ్మను పిలిచి గట్టిగా భయపెట్టినా తనకేమీ తెలియదని
అసలు తను ఇంట్లోకే  రాలేదని వీధి గుమ్మం నుంచే చెప్పి వెళ్లేనని గోడు వెళ్లబోసుకుంది.
కూరలమ్మి, పాలబ్బాయిని పిలిచి గదమాయించినా వాళ్లు కూడా తమకే
పాపం తెలియదని గొల్లుమన్నారు. ఇన్ స్పెక్టరు ఎన్ని విధాల ప్రయత్నించినా అసలు దొంగలెవరో తేల్చలేకపోయారు. మళ్లీ ఇల్లంతా క్షుణ్ణంగా వెతికినా పోయిన బంగారు గొలుసు జాడ లేదు. సాద్యమైనంత తొందరలో దొంగను
పట్టుకోడానికి  ప్రయత్నిస్తానని చెప్పి వెళ్లాడు పోలీసు ఇన్స్పెక్టరు. మూడురోజులు గడిచిపోయాయి. బంగారు గొలుసు జాడ తెలియలేదు. రోజూ ఇల్లంతా వెతుకుతూనే ఉన్నారు. ఇంతలో కిచెన్ నుంచి మురుగునీరు వెళ్లే  డ్రైనేజి పైపు బ్లాక్ అయి గిన్నెలు
కంచాలు కడిగిన వేస్టు వాటర్ పోక షింక్  నిండిపోతుండటంతో గుర్నాథం డ్రైనేజి పైపులు క్లీన్ చేసే పనివాళ్లను పిలిచి దగ్గరుండి డ్రైనేజి పైపును శుభ్రం చేయిస్తున్నారు. కొంతసేపటికి పనివాళ్లు డ్రైనేజి పైపు నుంచి అడ్డుగా ఉన్న
ఒక ప్లాస్టిక్  సంచిని పైకి లాగారు. వెంటనే అడ్డంకి తొలిగి మురుగు నీరు జోరుగా ప్రవహించి డ్రైనేజి పైపు క్లియర్ అయింది.
వెంటనే గుర్నాథం ఆ ప్లాస్టిక్ సంచిని విప్పించి పరిశీలించగా కనబడకుండా పోయిన బంగారు గొలుసు బయట పడింది. ఈ సంగతి తెల్సి భారతమ్మ ఆనందానికి అంతులేకపోయింది. ఇంతకీ ఆ వస్తువు డ్రైనేజి పైపులో కెలావెళ్లిందని తర్జనభర్జన జరిగింది. చివరకు పరిశీలనలో తేలిందేమంటే భారతమ్మ రాత్రి పడుకోబోయే ముందు తన బంగారు గొలుసు ప్లాస్టిక్ సంచిలో ఉంచి డ్రస్సింగ్ టేబుల్ అరలో పెడదామనుకుని మతిమరుపుతో కిచెన్లో ఫ్రిజ్ మీద పెట్టింది. అక్కడ కొడుకు విశ్వం కోసం ఉంచిన బజ్జీలు కూడా ఉన్నాయి. కిచెన్ డ్రైనేజి పైపులో నివాశముండే పందికొక్కు ఎలకలు రాత్రిళ్లు ఎంగిలి మెతుకుల కోసం పైకొచ్చి అందుబాటులో ఉండేవి లాక్కుపోతాయి. అలాగే
ఫ్రిజ్ మీదున్న బజ్జీలతో పాటు బంగారు నగున్న ప్లాస్టిక్ సంచిని కూడా డ్రైనేజి పైపులోకి  లాక్కుపోయాయి. అందువల్ల మురుగునీరు పోక నిండిపోయింది. డ్రైనేజి శుభ్రం చేసే  పనివాళ్ల  ద్వారా బంగారునగ  బయట పడింది.
భారతమ్మ తను బంగారు గొలుసున్న ప్లాస్టిక్ సంచిని డ్రస్సింగ్ టేబుల్ అరలో పెట్టినట్టు  భ్రమలో ఉంది. చివరకు బంగారు నగ దొంగ  పందికొక్కు ఎలకగా నిర్ధారణ జరిగింది. బంగారు నగ ఎలా మాయమైందో తెలియక తల  బాదుకుంటున్న సబ్ఇన్స్పెక్టరుకు ఈ విషయం  తెల్సి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!