ప్రేమ

ప్రేమ

రచయిత :: మంజీత కుమార్

“ఏవండీ టిఫిన్ అయ్యిందా, టైం అవుతోంది” సుధ అడుగుతూనే ఆఫీస్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

“నీ కోసమే ఎదురుచూస్తోంది” శివ జవాబిస్తూ లంచ్ బాక్స్ తీసుకుని సుధ చేతికిచ్చాడు.

ఇదంతా … రాజాపురం అనే ఊరి నుంచి ఉదయమే హైదరాబాద్ లో కొడుకు ఇంటికి దిగిన దుర్గమ్మ గమనిస్తూనేవుంది. ఆమెకు ఈ వ్యవహారం ఒళ్ళు మంటగా ఉంది.

కోడలు ఆఫీస్ కి వెళ్ళగానే … “ఏంట్రా మరీ పెళ్ళాం బానిసయ్యావు. ఏం మందు పెట్టిందిరా అది నీకు? దానికి నువ్వు వంట చేయడమేంటి? ఛీ ఛీ” తల్లి తిట్లకు నవ్వుతూ “అమ్మ ముందు కాస్త కాఫీ తాగు” అని కప్పు అందించాడు.

“సుధ నాకు మందు పెట్టిన మాట నిజమే అయితే అది నువ్వు నాన్నకు పెట్టిన మందే” శివ మాటలకు దుర్గమ్మ
“ఏం వాగుతున్నావు రా” అని తిట్టింది.

“చెప్పేది విను దుర్గమ్మ తల్లి” అని దండం పెడుతూ ” సుధ, నువ్వు ఇద్దరూ పెట్టిన మందు పేరు ‘ప్రేమ మందు’. నీకు గుర్తుందా … మా చిన్నప్పుడు నీకు కొన్ని నెలలు చేతులు వంకర్లుపోతే నాన్న వంట చేసేవాడు, నీకైతే తినిపించేవాడు కూడా. నాన్నమ్మ తిట్టినా పట్టించుకునేవాడు కాదు. అలాగే నాన్నకు పక్షవాతం వచ్చి మంచానపడితే నువ్వే నాలుగు ఇళ్లల్లో పాచి పని చేసి ఇంటిని నడిపించావు. మా అందరి కడుపు నింపావు” అని అనగానే

“అవునురా ఆ కష్టాలు తల్చుకుంటే” అని కన్నీరు తుడుచుకుంది.

“నాకు మీ నాన్న అన్నం వండి, తినిపిస్తే.. మీ నాన్నమ్మ కళ్ళల్లో నిప్పులుపోసుకునేది” అంటూ గతం గుర్తుచేసుకుంది.

“మరి నువ్వు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నావు అమ్మ” కొడుకు అలా అనేసరికి దుర్గమ్మకు ఒక్కసారి ఎవరో చెంప చెల్లుమనిపించినట్టు అనిపించింది.

“అమ్మ! కరోనా నా ఉద్యోగాన్ని మింగేసింది. ఎంత ప్రయత్నం చేసినా కొత్త ఉద్యోగం రావట్లేదు. నీ కోడలు గర్భవతి, బలహీనంగా ఉందని.. బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు. కానీ ఇల్లు గడవడం కోసం, నా కోసం ఉద్యోగంలో చేరింది. తన పుట్టింట్లో నా పరువు కాపాడేందుకు వారింట్లో ఈ విషయం దాచిపెట్టింది. కనీసం నీకు చెప్పొద్దూ బాధపడతారు అంది. ఇదంతా నిన్ను తప్పుపట్టాలని, బాధ పెట్టాలని చెప్పట్లేదమ్మా” అని ముగించాడు.

“క్షమించు రా. నా కోడలి మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. నా అత్త చేసిన తప్పే నేను చేస్తున్నాను. ప్రేమ అనుబంధం విలువ తెల్సివచ్చింది” అంటూ కొడుకు చేతులు పట్టుకుంది.

“అరేయ్ ఇక నేను ఇంటి, వంట పని చూసుకుంటాను, నువ్వు త్వరగా ఉద్యోగం సంపాదించుకో. కోడలికి రెస్ట్ ఇవ్వాలి. త్వరలో మనింటికి మహాలక్ష్మి రాబోతోంది. ఈ ఇంటి వారసురాలు” అని కోడలితో ఓసారి ఫోన్లో మాట్లాడేందుకు, క్షమాపణ చెప్పేందుకు సెల్ అందుకుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!