తుంటరి ఆలోచనే కానీ

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

తుంటరి ఆలోచనే కానీ

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

మోహన్, వేంకట్, నారాయణ ఎలిమెంటరీ స్కూలు నుంచి స్నేహితులే. తరువాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆరవ తరగతిలో ప్రవేశించారు. ఉన్నత పాఠశాలకు వచ్చారే కానీ, తుంటరి ఆలోచనలే. అల్లరి తగ్గ లేదు. ముగ్గురిలో నారాయణ పెద్దగా అల్లరి చేయడు. చదువులో ఎప్పుడూ ఫస్టే. మిగతా యిద్దరూ అబౌవ్ ఏవరేజ్.

ఆరవ తరగతిలో చేరి, మూడు నెలలు అయ్యింది. ఆ తరగతిలో ఉపాధ్యాయునికి యెదురుగా యిద్దరిద్దరు కూర్చునే బెంచీలు వుంటే, గోడ పక్కన వారగా, ముగ్గురు కూర్చునే ఒక బెంచీ వుంది. దానిని ఆ ముగ్గురు ఆక్రమించారు. ఉపాధ్యాయులు అటు పక్కన ఎక్కువ దృష్టి పెట్టరని వాళ్ళ నమ్మకం‌‌. వాళ్ళు అల్లరి చేసినా, ఉపాధ్యాయులు అన్నా భయం, గౌరవం వుంది. ఎవ్వరైనా ఉపాధ్యాయులకు పేర్లు పెట్టినా, ఏడిపించినా వాళ్ళకు “వద్దురా అలా చేయడం తప్పు” అని నచ్చ చెప్పేవారు.
……

తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు మాట్లాడు కోవడానికి మోహన్, వేంకట్ లకు ఒకే తుంటరి ఆలోచన వచ్చింది. అది యేమిటంటే క్లాసులు నడుస్తున్నప్పుడు మాట్లాడుకోవాలంటే మౌనంగా కాగితాలు మీద వ్రాసుకోవడం. అంటే ఇప్పుడు చేస్తున్న వాట్సాప్ చాట్ లాంటిది అన్నమాట. ఎటువచ్చి రాస్తున్నప్పుడు మాస్టారు వైపు దృష్టి పెట్టాలి. నారాయణ పార్టిసిపేషన్ చాలా తక్కువ. చాలా బుద్దిమంతుడు. పాఠాలు వినకుండా, తరువాత చదివితే అర్థం కాదని వాళ్ళని హెచ్చరించే వాడు. వింటే కదా పైగా “అర్థం కాకపోతే నువ్వున్నావు కదా” అనే వారు. నారాయణ నవ్వేసి వూరుకునే వాడు.
……

సైన్స్ పిరియడ్ కు వివేకానంద మాష్టారు వచ్చే వారు. ఆయనకో అలవాటు టెక్స్ట్ పుస్తకంలో పేరా చదివి, వివరించేవారు. ఎవ్వరైనా వారి క్లాసులో మాట్లాడుతుంటే, వాళ్ళని ఏ పేరా చెపుతున్నాను అని అడిగే వారు. తెలిసో, తెలియకో ఏదో పేరా చదివి వినిపిస్తే, కరెక్ట్ అయితే కూర్చో అనే వారు. కాకపోతే బెంచి ఎక్కించే వారు పనిష్మెంట్ గా.
……

ఒక రోజు సైన్స్ పిరియడ్ జరుగుతోంది. వారిలో సాధారణంగా నారాయణ పాఠాలు వింటూ వుండేవాడు. తను వింటున్నప్పుడు నారాయణ పేజీ తిప్పగానే, మిగతా యిద్దరూ పేజీలు మాత్రం తిప్పుతూ వుంటారు. ఎప్పుడైనా మాస్టారు ‘ఏ పేరా చదువుతున్నాను’ అని అడిగితే నారాయణ వైపు చూసే వారు. నారాయణ వారు చదువుతున్న పేరా మీద మాస్టారు గారికి కనపడకుండా వేలు పెట్టి చూపేవాడు. ఆ పేరా చదవగానే కూర్చోమని అనేవారు. అలా చాలా రోజులు గడిపేసారు. అన్ని రోజులు అలా వుండవు కదా.
……

ఒక రోజు క్లాసులో ఎప్పటిలాగే పేపర్ మీదా ఇద్దరూ మాట్లాడుకుంటూంటే, ఇంట్రెస్టింగ్ విషయం అవడంతో, నారాయణ కూడా పార్టిసిపేట్ చేసాడు. అంతే మాష్టారు దృష్టిలో ముగ్గురూ పడ్డారు. ముందుగా మోహన్ ను అడిగారు మాస్టారు ‘ఏ పేరా చదువుతున్నాను’ అని. ఎదురుగా కనిపిస్తున్న పేరా చదివాడు మోహన్. ‘కాదు బెంచి ఎక్కు’ అని తరువాత వేంకట్ ‘నువ్వు చదువు’ అని అడగ్గానే, మోహన్ చదివిన తరువాత పేరా చదివాడు. అదీ తప్పే బెంచి ఎక్కేసాడు. ఇక నారాయణ వైపు చూడగానే, పాపం గౌరవంగా బెంచి ఎక్కబోతుంటే, గద్దించి ‘నువ్వు కూడా చదువు’ అనగానే తనకు కనిపించిన పేరా చదవగానే ‘కూర్చొ’ అన్నారు. అది పొరపాటున కరెక్ట్ అయ్యింది.

అలా అమలు పరుస్తున్నది తుంటరి ఆలోచనే కానీ మోహన్, వేంకట్ లను బెంచి ఎక్కిస్తే, ఎప్పుడూ ‘రాముడు మంచి బాలుడు’ లా వుండే నారాయణని మాత్రం అదే తుంటరి ఆలోచన వున్నా రక్షించింది.
……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!