తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

రచయిత :: సిరి “అర్జున్”

ఉదయాన్నే అమ్మ ఫోన్ కాల్ తో నిద్ర లేచాను. మాటలు మధ్యలో అమ్మ చెప్పింది విని నాకు ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. చెమట్లు పట్టేసాయి. గటగటా మంచి నీళ్ళు తాగాను. అమ్మ చెప్పిన విషయం గురించే నా ఆలోచనలు.

మా ఊరిలో  మా ఇంటి పక్కనే శృతి అక్క వాళ్ళిళ్ళు. అక్కకి పెళ్ళి జరిగింది. వాళ్ళత్త గయ్యాలి గంగమ్మ. అక్కని చిత్ర హింసలు పెట్టేది. వాళ్ళాయన అమ్మ మాటే వినేవాడు. అక్కని కొట్టేవాడు. పుట్టింటికి వెళ్లిపోదాం అన్నా అక్కకి అమ్మా నాన్నా లేరు. వాళ్ళ నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. అక్క పెళ్ళి జరిగిన మూడు నెలలకే నాయనమ్మ చనిపోయింది. పెళ్ళి జరిగిన నెల రోజులు వరకు అక్కని బాగానే చూసుకున్నారు. తర్వాత మెల్లి మెల్లిగా వాళ్ళ బాగోతం బయట పడింది. అక్క వాళ్ళ మావయ్యగారు చనిపోయారు. ఇక వాళ్ళ ఆగడాలకు అంతు లేదు. ఆయనే పట్టు బట్టి అక్కని వాళ్ళింటి కోడలిగా చేసుకున్నారు.

శృతి అక్క కి పెళ్ళి జరిగాక మూడు సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఇంకా పిల్లలు పుట్టలేదని చిత్ర హింసలు పెట్టేవారు. గొడ్డు చాకిరి చేయించే వారు. తరువాత అక్క గర్భవతి అని తెలిసినా వారి ప్రవర్తనలో మార్పు లేదు. ఎలాగో తట్టుకుని బ్రతికింది. మొదటిగా ఆడపిల్ల పుట్టింది.మాటలు తూటాలని అక్క మీదకి వదిలేవారు.  ఆడపిల్ల పుట్టింది దానికి అక్క తప్పేముంది. అయినా ఆడపిల్ల పుడితే అంత నేరమా?

రెండో కానుపు కూడా ఆడపిల్లే. ఇంకేముంది అక్క కి నరకం అంటే చూపిస్తున్నారు. ఆ పుట్టిన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారా అంటే అదీ లేదు. ఆ పిల్లలే ప్రాణాంగా బ్రతికేది.
రోజులు గడిచే కొద్ది శృతి అక్క ని కొట్టడంఎక్కువ అయింది. ఇదంతా వాళ్ళాయనతో చేయించేది వాళ్ళత్త. ఆమెకి శృతి అక్క మొదటి నుంచి ఇష్టం లేదు. ఎలాగైనా తన కొడుక్కి రెండో పెళ్ళి చెయ్యాలి అని చూస్తుంది.

ఇక తట్టుకోలేక ఒక రోజు ఇద్దర్ని నిలదీసింది. వాళ్ళు చెప్పిన సమాధానం విని నివ్వెరబోయింది. చివరికి ఆమె మీద అక్రమ సంబంధం నింద కూడా వేశారు. అక్కకి బ్రతకడం కూడా దండగే ఆనిపించింది. ఇంకేమి ఆలోచించ లేదు. ఆమె కి తన పిల్లలు కూడా గుర్తు రాలేదు ఏమో ఆ సమయంలో. ఊరి చివర ఉన్న బావిలో దూకేసింది. ఒక రోజు అంతా అక్క జాడ తెలియక పిల్లలు అల్లడిపోతుంటే! అమ్మా కొడుకు పట్టించుకోలేదు. బావి దగ్గర ఉన్న చెప్పులు చూసి శృతి అక్క లోపల వుందేమోనని వెతికారు ఊరిలో వాళ్ళు.

లోపలే ఉంది. కానీ! బ్రతికి లేదు. శవమై ఉబ్బి ఉంది. పాపం పిల్లలు తల్లి శవం ముందు కూర్చుని ఏడుస్తుంటే అందరి గుండెలు తరుక్కుపోయాయి.

ఇంత జరిగినా ఆ తల్లి కొడుకుల్లో మార్పు లేదు. శృతి అక్క చనిపోయిన రెండు నెలల్లో ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. ఆ వచ్చిన అమ్మాయి పిల్లల్ని ప్రస్తుతం బాగానే చూసుకుంటున్నా.  రోజులు గడిచే కొద్దీ ఆమెలో పిల్లల పట్ల ప్రేమ తగ్గిపోతుంది.

పిల్లలు స్వచ్ఛమైన తల్లి ప్రేమ ని పొందలేక పోతున్నారు.

ఇక్కడ నేరం ఒకరు చేస్తే! శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు.

శృతి అక్క అత్తా, వాళ్ళాయన తప్పు చేస్తే.. శృతి అక్క బలైంది.

శృతి అక్క చేసిన తప్పు (ఆత్మ హత్య) వల్ల తన పిల్లలు బలయ్యారు.  ఆ పసి ప్రాణాలు అమ్మ కోసం , అమ్మ ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాయో..!! తలుచుకోగానే నా కళ్ళ వెంట నీరు వచ్చింది.

ఆ పసివాళ్ళకి ఏ హానీ జరక్కుండా దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏమీ చేయగలం.

***

You May Also Like

4 thoughts on “తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

  1. Rojulu tharaalu enni maarinaa kaani kontha mandhi murkula manasulu asalu mataram ledhu..Alanti vaallalo veellu kuda okaru… Veellu ika maararu akka..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!