అతిథులు 

అంశం: హాస్య కథలు

అతిథులు 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

   రచన: జీడిగుంట నరసింహ మూర్తి

“మాధవీ !  నేను రాధికను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీకు నేను నిరుత్సాహ పరిచే వార్త చెప్పాల్సి రావడానికి చాలా బాధపడుతున్నాను.  పాపం మీ దంపతులు మమ్మల్ని  ఎంతో ఆప్యాయంగా మీ ఇంటికి విందుకు ఆహ్వానించారు. కానీ అనుకోకుండా ఈ రోజు మా పినమామగారు కుటుంబ సమేతంగా దిగిపోయారు. అప్పటికీ  వచ్చేముందు ఒక ఫోన్ చేసి రావచ్చుగా అని  నిష్టూరంగా అన్నాను. వాళ్ళకు అటువంటి ఫార్మాలిటీస్ ఏవీ ఉన్నట్టుగా లేవు. “ఏముంది ఒకవేళ మీ తలుపు తాళం వేసి వుంటే వెనక్కి వెళ్లిపోయేవాళ్లం” అని తేలిగ్గా తీసుకున్నారు. ఇక ఈ పరిస్తితిలో వాళ్ళను పెట్టుకుని మేము బయటకు వెళ్ళడం బాగుండదని ఆగిపోయాం. నువ్వు ఏమీ అనుకోకే. పరిస్తితిని అర్ధం చేసుకుంటావు అనుకుంటున్నాను” అంది   రాధిక.
ఆమె గొంతులో అపరాధ భావం  ధ్వనిస్తోంది.
“అయ్యో ఎంత పని చేసావే బాబూ.  ఈ విషయం ఒక్క గంట  ముందైనా చెప్పాల్సింది. ఈ రోజు సెలవు కావడంతో మా ఇంటికి కూడా ఈయనకు తెలిసిన వాళ్లెవరో వస్తామంటే మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం  అని  అబద్దం చెప్పి వాళ్ళను రాకుండా ఆపేశాం, ఉదయాన్నే లేచి ఒక ప్లాన్ ప్రకారం మీ ఇద్దరికీ ఇష్టమైన ఎన్నో వంటలు చేసేశాను. “వాళ్ళు రాగా రాగా చాలా రోజులకు  మనింటికి వస్తున్నారు. నీ ఫ్రెండ్ కు నీ వంట ప్రావీణ్యం చూపించవా?” అని ఈయన అంటే మీ కోసం ప్రత్యేకంగా  శనగపప్పు పాఠోళీ, దాంట్లోకి అనుపానంగా ఉల్లిపాయ పులుసు పక్కన  బూడిద గుమ్మడికాయ వడియాలు, చల్ల మిరపకాయలు  ఇలా  ఎన్నో చేసేశాను.  మొత్తమ్మీద   చాలా నిరాశ పరిచావే. పోనీ మీ ఇల్లూ దగ్గరా దాపు అయితే వాటిని పార్సిల్ చేయించి మీ ఇంటికి పంపేదాన్ని.  మళ్ళీ నీకు  మీ చుట్టాల కోసం ప్రత్యేకంగా వంటలు చేసే బాధ  తప్పేది. “అంది  మాధవి నిష్టూరంగా . . .
“ఏమిటి మాధవి  మరీ చాదస్తం కాకపోతే ఎవరైనా అన్ని వంటలు చేస్తారా ?  నీకు ముందే చెప్పాను కదా. ఈయనకు సుగర్ , బీపీ ఉందని. శ్రమపడి ఎక్కువ అయిటమ్స్ చేయొద్దని. అసలు ఈయన  ఆరోగ్య సమస్యలు వల్లే ఈ వూళ్ళో ఎంతోమంది చుట్టాలు భోజనానికి పిలిచినా ఎక్కడికీ వెళ్ళడం లేదు  ” అంది రాధిక. ” అవునే  నాది పెద్ద చెయ్యి అని అందరూ అంటూంటారు.   ఒక కూర, ఒక చారుతో ఎవ్వరినీ పంపలేదు. పోనీ మీ చుట్టాలను కూడా ఇక్కడకు తీసుకు వచ్చేయ్యాల్సింది. ఎలాగూ ఎక్కువగా వండాను  కాబట్టి వాళ్ళకు కూడా  సరిపోయేవి. సరేలే. ఏం చేస్తాం. వండిన ఆ కూరలన్నీ ప్రిజ్జులో పెట్టుకుని రెండు రోజులు మేమే   తింటాం ” అంది నీరసంగా మాధవి. రాధికకు సంభాషణను పొడిగించడం ఇష్టం లేక “´నిజమే. నీ గురించి నాకు తెలియదా ఏమిటి కానీ. నేను మళ్ళీ మాటలాడుతానే. అవతల వాళ్ళకు కాఫీలు, ఆ హడావిడీ వుంది ” అంటూ ఫోన్ పెట్టేసింది.
మరో గంటలో   రాధిక నుండి ఫోన్ రావడంతో గాభరాగా లిఫ్ట్ చేసింది మాధవి. “ఏమోయ్ మధూ నీ శ్రమ వృధా పోలేదులే. మా పినమామగారి దగ్గర బంధువులు ఎవరికో హార్ట్ ఎటాక్ వస్తే వాళ్ళు అర్జెంట్గా వెళ్ళి పోవాలని నిర్ణయించుకుని ఇందాకే  వెళ్లారు.  ఇంకా మా ఇంట్లో వంటలు ఏమీ కాలేదు.  పాపం నువ్వు అన్నీ చేసి మా మీద ఆశ పెట్టుకున్నావు. వాళ్లెలాగూ వెళ్ళి పోయారు కాబట్టి ఇక వంట అనేది లేదు. నువ్వన్నట్టు నిన్ను నిరాశ పరస్తున్నానని మనసులో ఒకటే బాధపడుతున్నాను. ఏ దేవుడు కరుణించాడో నీ కోరిక తీరింది. మేమిద్దరం  ఇంకో గంటలో బయలుదేరుతున్నాము. బీ హ్యాపీ. ఇక నువ్వు మనశ్శాంతిగా నీ పనులు చేసుకో, నీ చేతి రుచులు అనుభవించే అదృష్టం మాకు ఉందిలే ” అంటూ ఫోను పెట్టేసింది రాధిక.  మాధవి  గుండెల్లో రాయిపడింది.  నిలువెత్తునా నీరసం ఆవరించింది. ఉలుకూ, పలుకూ లేకుండా కాసేపు కొయ్యబారి పోయింది.  నిజానికి రాధిక రావడంలేదని చెప్పడంతో తను  అన్నీ వండేసి ఎదురుచూస్తున్నాం అని అబద్దం చెప్పేసింది.  ఇలాంటి సంఘటనలు రెండు మూడు సార్లు తమ బంధువుల ఇళ్ళల్లో జరిగినప్పుడు వాళ్ళు గొప్పల కోసం ఆడిన అబద్దాలే తనూ అప్లై చేసింది. రాధిక ఫోను చేసే సమయానికి మాధవి ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవనే లేదు. రాధికా వాళ్ళు వస్తే వంట  ఎంతసేపట్లో చేస్తాంలే అని బద్దకించి వూరుకుంది. చాలా సార్లు తన ఇంటికి భోజనానికి వస్తాననే వాళ్ళు ఒకటి రెండు సార్లు కన్ఫర్మ్ చేస్తే కానీ తనెప్పుడూ వంట మొదలెట్టేది కాదు. చాలా మంది మొహమాటానికి తప్పకుండా వస్తాం అంటూ ఆ తర్వాత ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ వుంటారు. అలాంటి అనుభవం మాధవికి చాలా సార్లు ఎదురయ్యింది. అయితే తను అవతల వాళ్ళ దగ్గర ఓడిపోవడం ఇష్టం లేక  ఒక్కోసారి అబద్దాలు ఆడాల్సిన పరిస్తితి వస్తోంది.  ఆమెలో ఎప్పుడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురూ, నీరసం ముంచుకొచ్చాయి. వెన్నులో సన్నటి  జలదరింపు ప్రారంభమయ్యి మొహం చెమటతో ముద్దయ్యింది. నుదుటకు పట్టిన స్వేదాన్ని  చీర కొంగుతో తుడుచుకుంటూ పొద్దున్నుంచి జరిగిన ఎపిసోడ్,  వంటలు గురించి తను ఆడిన అబద్దంతో సహా మొగుడికి చెప్పి” ఇప్పుడు నాకు కాళ్లాడటం లేదండీ. ఏం చెయ్యాలో” ? బలహీనంగా పలికింది ఆమె గొంతు.  “ఏమిటి మధూ. ఫ్రాంక్ గా ఉండటం నేర్చుకో ఇలాంటి గొప్పలకే పోకూడదు. ఇవన్నీ అవసరమా?. వచ్చాక కూడా వాళ్ళను కూర్చోబెట్టి వంటలు చేసుకుకునే వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఈ రోజుల్లో  అతిదులు వచ్చేవరకు నమ్మకం లేదు.  సరే, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయొద్దు.  ఇక్కడ మంచి భోజన హోటల్ ఉంది. అక్కడనుండి భోజనం పార్సిల్ చేయించుకు వస్తాను నువ్వు చెప్పని ఐటమ్లు సస్పెన్స్ గా మిగులుతాయి.  నువ్వు ఆ వడియాలు, చల్ల మిరపకాయలు, ఇంకా నీ ఫ్రెండ్ కు చెప్పినవి ఏవైనా వుంటే గబగబా చేసేయ్యి. ” అంటూ వెంటనే డ్రస్ అప్ అయ్యి బయటకు వెళ్ళి పోయాడు మాధవి భర్త అనంత్. భర్త ఇచ్చిన భరోసాకు ఆమెలో ఎక్కడలేని బలం వచ్చింది.  ఆమెకు భర్తమీద గౌరవం రెట్టింపయ్యింది.
మళ్ళీ ఫోను రింగయ్యింది. ” హలో  రాధికా ఎంతవరకొచ్చారు ?” అడిగింది మాధవి ఆతృతతో.
“ఏమి రావడమో ఏమిటో మాధవీ. అంతా శని పట్టేసినట్టయ్యింది. చెప్పడానికి సిగ్గుతో చచ్చిపోతున్నాను అనుకో. మా పిన మామగారు అలా బయటకు వెళ్లారో లేదో అరగంట్లో వెనక్కి తిరిగి వచ్చారు. ఇప్పుడిప్పుడే హాస్పటల్ వాళ్ళు ఎవరినీ అనుమతిచడం లేదుట. చెప్పాకనే రమ్మని అవతల నుండి కబురు వచ్చిందిట. యధాప్రకారం మళ్ళీ ఇక్కడ వాలిపోయారు. మీ ఇంట్లో భోజనానికి వెళ్తున్నాం అని ఎలా చెప్పగలం? అసలే ఈయన వాళ్ళ చుట్టలంటే పడి ఛస్తారు. వాళ్ళకు ఏ మాత్రం అవమానం జరిగినా అస్సలు భరించలేరు. మళ్ళీ నిన్ను ఇంకోసారి నిరాశ పరచ వలసి వస్తోంది. నువ్వు నన్ను క్షమించవని తెలుసు. కానీ నా పరిస్తితి అర్ధం చేసుకుంటావని ఫోన్ చేస్తున్నాను.  ఈ సారి మా కారులో మిమ్మల్నిద్దరినీ మా ఇంటికి తీసుకెళ్లి మీకు విందు భోజనం పెట్టి పాప పరిహారం చేసుకుంటాను. నన్ను తిట్టుకోకే …” అంటూ రాధిక ఫోన్ పెట్టేసింది. ఊహించని ఈ హఠాత్పరిణామ్మానుండి తట్టుకోవడం మాధవి వల్ల కావడం లేదు. జీవితంలో ఎప్పుడూ ఎదురవ్వని అవమానకర అనుభవం ఈ రూపంలో ఎదురవుతుందని ఆమె ఊహించలేదు. అప్పటికే  టేబుల్ మీద  భర్త తెచ్చిన కూరలు వగైరా  పార్సిళ్ళు మాధవిని వెక్కిరిస్తూ చూస్తున్నాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!