వెన్నెల త్యాగం

వెన్నెల త్యాగం

రచన::చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

రాళ్ళు రప్పలతో నిండిన కొండ ప్రాంతంలో కమలేష్ శవం చెట్టుకు వేలాడుతూ ఉంది.జనాలు గుమిగూడి విచిత్రంగా చూస్తున్నారు.అసలేం జరిగిందోనని అందరూ చెవులు కొరుక్కుంటుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.ఏమైంది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో అందరిని విచారిస్తున్నారు.శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించితరలించే సమయంలో అరుస్తూ పరుగున వచ్చిన తల్లి చిట్టెమ్మ కమలేష్ శవంపై పడి నా బిడ్డో నా బిడ్డో అంటూ రోదించింది.

అంబులెన్స్ బయలుదేరుతుండగా నేనూ వస్తానంటూ ఏడ్వడంతో ఆమెనూ ఎక్కించుకున్నారు.కొడుకు చేసిన అల్లరి అనుభవించిన కష్టాలు అన్నింటినీ గుర్తుచేసుకుంటూ కన్నీరు కారి కారి గుండె ఎండిపోయింది.అంబులెన్స్ వంద మీటర్లు కదలగానే ఒక అందమైన అమ్మాయి వెన్నెల అడ్డుగా నిలబడింది.పోలీసులు ఏమ్మా అడ్డుతప్పుకో అన్నారు.నా హృదయలోపలున్న కమల్ శరీరం లోపల ఉంది.ప్లీజ్ నన్ను చూడనివ్వండి అంటూ మోకాళ్ళపై కూర్చుని బోరున ఏడ్చింది.పోలీసులు “హాస్పిటల్ కి వెళ్తున్నాం అక్కడికి రా”అంటూ కదలబోయారు.కమల్ లేకుండా నేను బతికున్నా చచ్చిన శవంతో సమానం నా మీద నుంచి ఎక్కించండి అంటూ అంబులెన్స్ కింద పడుకొనేసింది.పోలీసులు సరే నువ్వు కూడా ఎక్కమ్మా..! అంటూ అంబులెన్స్ లో ఎక్కించారు.

వెన్నెల కమలేష్ ముఖాన్ని చేతులతో తడుముతూ వాళ్ళిద్దరి బాసలను ఆశలను గుర్తు చేసుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది.అది చూస్తూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టిన చిట్టెమ్మ ఏవూరమ్మా నీది అంది.వెన్నెల “ఎంత పని చేశాడత్తమ్మా నీ కొడుకు అంటూ చిట్టెమ్మని పట్టుకొని ఏడ్వడంతో నా కొడుకుని ఇంతలా ప్రేమించిన అమ్మాయి ఉంటే వాడు నాకు చెప్పలేదే అనుకుంటూ ఎవరి కూతురివమ్మా అని అడిగింది.వెన్నెల భయం భయంగా చెంగయ్య కూతురిని అని అనడంతో
చిట్టెమ్మ కోపంతో ఊగిపోతూ నీవల్లే నా కొడుకు ఉరేసుకో ఉంటాడే పాపిస్టిదానా ,నంగనాచిలా వచ్చి ఏడుస్తున్నావేంటే అంటూ దూరంగా జరిగి కూర్చుంది. పోలీసులు ఏడవద్దమ్మా అనడంతో “సారూ!
ఈ అమ్మాయి నాన్న చెంగడు నాకు స్వయాన తమ్ముడు, వోడికి నాకూ గొడవలు ,ఒక విధంగా సెప్పాలంటే శత్రువు.నా కొడుకుని పేమించినట్లు నటించి సంపేసినట్టన్నారు సారూ..”అంటూ చిట్టెమ్మ వెన్నెలను నాలుగు దెబ్బలేసింది.కానిస్టేబుల్ బుడ్డయ్య ఆగమ్మా తల్లి అంటూ చిట్టెమ్మను ఆపి “అసలేం జరిగిందో చెప్పమ్మా”అని వెన్నెలని అడిగాడు.
వెన్నెల ఏడుస్తూ “సార్…మా నాన్న కి, అత్తకి గొడవలు అని మేమెప్పుడూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు.అదే ఆసక్తిగా ఏర్పడి ఒకరినొకరు బస్టాండ్లో ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం.తర్వాత అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ నేనూ మా బావా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. ఈ పెద్ద వాళ్ళ గొడవలకూ మాకు ఎటువంటి సంబంధం లేదు సార్”అంటూ వాపోయింది.చిట్టెమ్మ కలగజేసుకొని ఈ అప్సరసని నా బంగారు కొడుకు పేమించాడని దీనబ్బకి తెలిసి కొట్టి చంపేసి ఉరేసేసుంటాడు సార్ వోడు పెద్ద రౌడీ” అంటూ ఏడ్చింది.బుడ్డయ్య “సరే చిట్టెమ్మా..!మీ కమలేష్ జేబులో లెటర్ రాసి మరీ ఉరేసుకున్నాడు ఆ లెటర్ సార్ దగ్గర ఉంది. సార్ అనుమానాస్పద మృతిగానే రాసుకున్నాడు విచారణ చేశాక మీ తమ్ముడైనా,లేకపోతే ఎవరైనా సరే శిక్ష పడేలా చేస్తాం.”అంటూ ధైర్యం చెప్పాడు.ఆస్పత్రి రానే వచ్చింది.ఫార్మాలిటీస్ పూర్తయ్యాక పోస్ట్ మార్టం కంప్లీట్ అయి రిపోర్ట్ వచ్చింది.అందులో ఆత్మహత్య గానే రావడంతో ఎస్.ఐ వచ్చి బాడీని అప్పగించాడు. చిట్టెమ్మ ఎదిగొచ్చిన కొడుకు కాటికి పోవడంతో తనింక ఎవరికోసం బతకాలి ఎందుకు బతకాలి అనుకుంటూ నిర్జీవి లాగా తేలమొహమేసుకొని శిలయై కూర్చొనే ఉంది.ఆమెకి చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు.అంత్యక్రియలన్నీ పూర్తయ్యాక తిండి నిద్ర లేక రెప్పైనా వేయక అలాగే కొడుకు సూటేసుకొని తీసుకున్న ఫోటోను చేతులో పెట్టుకొని ఉంది.ఇదంతా గమనించిన మేన కోడలు అదేనండీ వెన్నెల అత్తకి ఆసరాగా ఉండాలని కమలేషే తన భర్త అని తండ్రితో తెగతెంపులు చేసుకొని వచ్చేసింది.ఇక్కడ చిట్టెమ్మకి వెన్నెలంటే పడకపోయె.ఏం చేస్తుంటే ఆ పిచ్చి పిల్ల.

అత్తమ్మా అంటూ లోపలికి వచ్చింది.ఒసేయ్ నా ఇంట్లో అడుగు పెట్టబాకే పాపిస్టిదానా అనే తిట్లు వినపడతాయేమోనని ఎదురు చూసింది వెన్నెల కానీ చిట్టెమ్మలో ఎటువంటి రెస్పాన్స్ లేదు.వెన్నెల తన లగేజీని ఇంట్లో పెట్టి చిట్టెమ్మ దగ్గరికెళ్ళింది.చిట్టెమ్మ పరిస్థితి చూసి వెన్నెల తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనుకుంటూ,తనే ఇక కమలేష్ అనే భావనలోకి వెళ్ళిపోయి చిట్టెమ్మని అమ్మా అనడం ప్రారంభించింది.ఏమి చేసినా చిట్టెమ్మలో చలనం లేదు.తనమీద అలిగి ,ఇష్టంలేక మాట్లాడడంలేదని అనుకొని బాధలోనే డాక్టర్ కి ఫోన్ చేసింది.ఆయన వచ్చి చిట్టెమ్మ మతిస్థిమితం కోల్పోయిందని ఇక చిన్న బిడ్డలాగా చూసుకోవాలని చెప్పడంతో వెన్నెల “కొడుకంటే ఎంత ప్రేమో అత్తకి,ఆమె ప్రేమ ముందు నా ప్రేమ ఎంత .బావ కోసం వాళ్ళమ్మని కూడా చూసుకోలేనా “అని బాధపడుతూ చిట్టెమ్మని తనే చూసుకుంటూ ప్రేమ కోసం త్యాగం చేయడం సాధారణమైపోయింది,ప్రేమికుడే లేకపోయినా ప్రేమకు కట్టుబడి సర్వ సుఖాలనూ వీడి కట్టుబానిసై త్యాగం చేసిన వెన్నెల కమలేష్ ల ప్రేమ కథ అజరామరంగా నిలిచింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!