తీరం చేరిన కెరటం

తీరం చేరిన కెరటం

రచయిత :: సావిత్రి కోవూరు 

హలో వందన నేను శారదను మాట్లాడుతున్నాను బాగున్నావా” అన్నది నా చిన్ననాటి స్నేహితురాలు శారద.
“ఎన్ని రోజులయిందే నిన్ను చూసి ఎక్కడున్నావ్” అన్నాను
“ఇక్కడే మీ ఇంటికి దగ్గరలో ఖాళీయేనా రావచ్చా” “ఏయ్ నేను ఖాళీనే రారా ఎప్పుడొస్తావ్”
“ఇదిగో వచ్చేసాను కిటికీలోంచి చూడు” అన్నది శారద.
“ఏయ్ పిచ్చి మొఖమా ఇంటి ముందర నుండి ఫోన్ చేయడం ఏంటి రా రా” అని పిలిచినా రెండు నిమిషాలకి శారద మా ఇంటికి వచ్చేసింది “ఏడెనిమిది ఏళ్లు అయింది కదా! మనం కలుసుకుని ఎలా ఉన్నావ్? ఏంటి నీ గురించి ఏమేమో వార్తలు వింటున్నాను. చెప్పు ఏంటి కథ?” అని మళ్ళీ “ఆగాగు మన ఇద్దరికీ టిఫిన్ తెస్తా. ఇంట్లో ఎవరు లేరు. మనం రాత్రి వరకు మాట్లాడుకోవచ్చు” అన్నాను.
“నీవేమి విన్నావో నాకు తెలీదు. కానీ నేనే చెప్తాను విను. ఏడేళ్ళ క్రితం ఒక రోజు ఆఫీసు నుండి వస్తూ మా నాన్న గారు ఆక్సిడెంట్ లో పోయారు. తర్వాత ఆర్నెల్లకే మా నాన్న ఎడబాటును తట్టుకోలేక అమ్మ మరణించింది. అప్పటి నుండి మా పైన మా అన్నయ్య పెత్తనం ఎక్కువయ్యింది.
నాకు చిన్నప్పటినుండి చార్మినార్ దగ్గర సంతోష్ మాత గుడి కి వెళ్లే అలవాటు ఉంది. అలా వెళ్ళినప్పుడే తరచుగా గుడికి వచ్చే సునీల్ పరిచయమయ్యాడు.
ఒకరోజు గుడిలో ఉన్నప్పుడు బాగా వర్షం పడుతుంది. ఇంటికెలా  వెళ్ళాలా అని కంగారు పడుతున్నాను. ఇంతట్లో సునీల్ నా దగ్గరకు వచ్చి “మేడమ్ ఈ పక్కనే మా అన్నయ్య ముత్యాల షాపు ఉంది. అక్కడ కాసేపు ఉండి వర్షం తగ్గిన తర్వాత వెళ్లిపోండి” అన్నాడు
“ఏం పర్వాలేదు నేను వెళ్ళిపోతాను లెండి. మీకెందుకు శ్రమ” అన్నాను.
“శ్రమ ఏమి లేదు మేడం. కొత్త వాడినని భయపడుతున్నారా? నేను మీకు తెలియకపోవచ్చు. కానీ మీరు నాకు బాగా తెలుసు. మీరు లాల్ దర్వాజా లో ఉన్నప్పుడు కొన్నేళ్ళు మీ ఎదురింట్లో ఉండే వాళ్ళం. మా అన్నయ్యకు, మీ పెద్దన్నయ్య క్లోజ్ ఫ్రెండ్స్. మీరా ఇల్లు అమ్మి చిక్కడపల్లి కి వెళ్ళారు కదా. నేను మీ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను” అన్నాడు.
“అవునా నేను గమనించలేదు. సారీ ఏమనుకోకండి” అన్నా.
ఆ విధంగా పరిచయమైన సునీల్ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు. వారం వారం గుడిలో కలుసుకొని ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడని వాళ్ళ అన్నయ్యకు ముత్యాల షాపుందని చెప్పాడు.  సహజంగానే మా స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరమూ మా ఇళ్ళల్లో పెద్ద వాళ్లకు మా ప్రేమ విశయం చెప్పాము. మా అన్నయ్యకు ప్రేమ వివాహాలపై అసలు నమ్మకములేదు.అందుకే ఇష్టమొచ్చినట్టు కోప్పడి నన్ను మా పెద్దక్క వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలబ్బాయికిచ్చి హడావుడిగా పెళ్లి చేసేసాడు. నేను ఎంత వద్దని మొత్తుకుంటున్నా.
నేను ప్రేమించిన సునీల్ బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నేనంటే చాల ఇష్టం.
అతన్ని కాదని పదో క్లాస్ కూడా పాస్ కానీ ఈ శ్రీనివాస్ కిచ్చి పెళ్లి చేయడంలో నాకు జరిగిన మేలేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. శ్రీనివాస్ కి చదువు లేదు, ఉద్యోగం లేదు, సోమరి. తండ్రి గుడిలో పూజారిగా చేస్తూ సంపాదించిన డబ్బులు లాక్కుని తాగి తందనాలు ఆడుతూ బలాదూర్గా తిరుగుతాడు. అలాంటి వాడికి నన్ను ఎందుకు కట్టబెట్టాడో ఇంకా అర్థం కావట్లేదు”అన్నది శారద.
“శ్రీనివాస్ కి ఇద్దరు చెల్లెళ్ళు.తల్లిదండ్రులతో కలిపి ఐదుగురు తండ్రి సంపాదనతో బతుకుతున్నారు. వాళ్ళు సరిపోనట్టు నేను కూడా తోడయ్యాను.
పెళ్ళయింది కనుక  ఇక రాజీపడక తప్పదని నిర్ణయించుకున్నాను. శ్రీనివాస్ కు లేని వ్యసనాలు లేవు.ఐదు సంవత్సరాలు దినదిన గండంలా గడిపాను.దానికి తోడు ఒక బాబు పుట్టాడు. మొత్తం ఏడు మందిమి మా మామగారి ఒక్కరి సంపాదన ఏం సరిపోతుంది. రోజుకి ఒక్క పూట కూడా సరిగ్గా భోం చేసేవాళ్లం కాదు.దానికి తోడు శ్రీనివాస్ రోజు త్రాగొచ్చి నరకం చూపించే వాడు. నా బాధ చూడలేక ఒకరోజు మా మామగారు “నీవింత చదువుకుని వీడిని ఎందుకు చేసుకున్నావమ్మా? మాకంటే కన్నందుకు భరించక తప్పదు. నీవు వెళ్లి  హైదరాబాదులో ,ఏదన్నా ఉద్యోగం చేసుకుంటు హాయిగా ఉండు. వాడు నిన్ను కొట్టే దెబ్బలు చూడలేకున్నా” అని చెప్పారు.
మా అత్తగారు కూడ “నీవెక్కడున్న సంతోషంగ ఉండటమే మాకు కావాలి. వాడు స్నేహితుల వల్ల అలా తయారయ్యాడు. పూర్తిగా చెడిపోయె వరకు మేము తెలసుకోలేక పోయాము. మాకు తెలిసే వరకే వాడు మా చేయిదాటి పోయాడు. ఇదంతా మా తప్పే. మా తప్పుకు నీవు శిక్ష అనుభవిస్తుంటే చూడలేక పోతున్నాము”అన్నారు.
“అప్పటికే అతనితో బాగ విసిగి పోయాను. బాబును తీసుకొని హైదరాబాద్ కు బయల్దేరాను. అతనికి నేను సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. అందుకే నాతో బాటు అతను కూడా వచ్చేశాడు. వీళ్లిద్దరిని ఎలా పోషించాలో అర్థం కాలేదు నాకు. మా స్నేహితురాలు అమృతకు నా విషయమంతా చెప్పి ఏదైనా బ్రతుకు తెరువు చూపించమని, అడిగాను. ఆమె తన భర్తకు చెప్పి ఒక బట్టల షాప్ లో పని చూపించి పుణ్యం కట్టుకుంది. ఆ తర్వాత ఒక గది అద్దెకు తీసుకున్నాను. అలా నేను ప్రశాంతంగా గడపడం కూడా అతనికి ఇష్టం లేదు. నాకు వచ్చే డబ్బు  లాక్కొని తాగొచ్చి నానా రబస చేసే వాడు.
హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్లీ  శుక్రవారం శుక్రవారం సంతోష్ మాత గుడి కి వెళ్ళడం మొదలు పెట్టాను.
మా ఫ్రెండ్ అమృత “నీజీవితం ఇలా అయినా, ఇంకా ఎందుకే ఆ సంతోష్ మాత అంటే అంత భక్తి నీకు” అని విసుక్కునేది.
ఒకరోజు గుడిలో మళ్లీ సునీల్ కనిపించి “ఏమైంది సడన్ గా కనిపించకుండా  మాయమయ్యావు. నీ గురించి ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు” అని ఎంతో బాధపడ్డాడు.
“నా గురించి అంతా చెప్పేసరికి చాలా బాధపడ్డాడు. అతనికి కూడా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నించారట. కానీ అతను ఒప్పుకోలేదట. నేను ఎప్పటికైనా వస్తానని తనను పెళ్లి చేసుకుంటానని నమ్మకం అట. అందుకే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. ఆ రోజు నుండి మా స్నేహం మళ్ళీ చిగురించ సాగింది”.
కొన్ని రోజులకు సునీల్ “మనం పెళ్లి చేసుకుందాం” అన్నాడు.
“అదేంటి నీకేమైనా పిచ్చా? నాకు భర్త, కొడుకు ఉన్నారు” అన్నాను
“అవును నాకు పిచ్చే. నీ మీద ప్రేమ పిచ్చి. ఎన్నేళ్ళు ఎదురు చూశాను నీ కొరకు. ఎన్ని రాత్రిళ్ళు ఏడ్చానో నీ కొరకు నీకు తెలియదు. నీవు మనస్పూర్తిగా తలుచుకుంటే అసాధ్యమేమీ కాదు. నీకు కూడా నా పైన ప్రేమ తగ్గలేదని నాకు తెలుసు. ఎవరి కొరకు మనము ఈ శిక్ష అనుభవించాలి. నీవు సుఖంగా ఉన్నా, నేను నీ జీవితం నుండి తప్పుకునే వాడిని. కాని నీ జీవితం ఇలా ముళ్ళ దారిలో నడుస్తుంటే, ఒకప్పుడు నిన్ను ప్రాణంలా ప్రేమించిన వాడిని, ఏం పట్టనట్టు చూస్తు ఊరుకోలేను. నీవు సుఖంగా లేవు, నేను సుఖంగా లేను. అలాంటప్పుడు మన జీవితాలను మనమే సరిదిద్దు కోవాలి” అన్నాడు.

“అదంతా తేలికగా అయ్యేపని కాదు. మామూలుగా స్నేహంగా ఉందాం” అన్నాను.

“ఎందుకు స్నేహంగా ఉండాలి.అతడు సుఖపెడుతున్నాడా నిన్ను అంటే అదీ లేదు. పై నుండి మధ్యమధ్య కొడతాడని నీవే చెప్పావు. ఇదంత ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను” అన్నాడు.

“ఏం నిర్ణయం”

“మీ మామ గారితో మాట్లాడాను అతను కూడా చాలా సంతోషించి తన కొడుకుని ఎలాగో తన దగ్గరికి పంపి, మనని పెళ్లి చేసుకోమన్నాడు. తను కూడా తన కొడుకు చేత డైవర్సు ఇప్పిస్తానన్నాడు. ఇప్పటికైనా ఆ అమ్మాయి కి మంచి జీవితం లభిస్తుంది అంటే సంతోషించే వాళ్ళలో నేను మొదటి వాడిని. మా అబ్బాయి సోమరితనము, దురలవాట్ల వల్ల మేము విసిగిపోయి అసలు పెళ్లి చేయాలని అనుకోలేదు. వాళ్ళ అన్నయ్య ఎందుకు అలా చేసాడో నాకు తెలియదు అన్నాడు”

“అంతా ఆలోచించే వచ్చావన్న మాట” అన్నది శారద.
“ఆ దేవత కరుణించింది మరి ఈ దేవత కరుణిస్తే నేను మా లాయర్ ఫ్రెండ్తో మాట్లాడి డైవర్స్ కి అప్లై చేద్దాం” అన్నాడు సునీల్.
“ఆ విధంగా శ్రీనివాస్ కి డైవర్సు ఇచ్చేసాను. మొదట నా కొడుకుని సునీల్ దత్తత తీసుకున్నాడు. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మేమిద్దరం మా బాబు హాయిగా ఉన్నాము” ఇది నా కథ అన్నది శారద.
అంతా విన్న వందన “పోనీలే ఇప్పటికైనా సంతోషంగా ఉన్నావు. ఎవరో చేసిన పొరపాటుకు, అదే నా కర్మ అనుకుంటు జీవితాంతం శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు. అలా అని చిన్న చిన్న విషయాలకు డైవర్స్ తీసుకోవడం సరైన పని కాదు. నీవు కరెక్టు నిర్ణయమే తీసుకున్నావు. మంచి పని చేశావు” అన్నది వందన మనస్పూర్తిగా.

***

You May Also Like

One thought on “తీరం చేరిన కెరటం

  1. చాలా బాగుంది కథ…భర్తచే వేధింపబడే మహిళల
    కష్టాల కెరటాలు…ఇలా సంతోష తీరం చేరితే ఎంత
    బాగుండును…!!!
    అభినందనలు సావిత్రి గారూ💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!