బాస్ చేతి దెబ్బ

బాస్ చేతి దెబ్బ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జీడిగుంట నరసింహ మూర్తి

ద్వివేది స్వతహాగా కోపిష్టి. అతని దగ్గర పనిచెయ్యాలంటే కింద వాళ్ళు చాలాభయపడేవాళ్లు. అయితే మేనేజ్మెంట్ దృష్టిలో అతనికి మంచి పేరుంది. ఎంత కఠినమైన పనులైనా అతనికి అప్పగిస్తే  ఆ పనులు పూర్తయ్యే అంతవరకు అతను నిద్రపోయే వాడు కాడు. అందుకే అతని జీత భత్యాలుతో బాటు మంచి హోదా కూడా అనుభవిస్తున్నాడు.  ఆ రోజు మేనేజ్మెంట్ తనకు అప్పగించిన  ఒక ముఖ్యమైన బాధ్యతను నెరవేర్చే  క్రమంలో ఎప్పుడూ తనకు పూర్తి సహకారాలు అందించే తన కింద పనిచేసే అసిస్టెంట్ రమాకాంత్ ఎందుకో అలిగి  తను చెప్పిన పని చెయ్యడంలో సహకరించక  అతనికి  చెడ్డ పేరు తెచ్చాడన్న కోపంతో ఆవేశం అణుచుకోలేక   అందరూ చూస్తూండగానే అతని రెండు చెంపలు వాయించేశాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరీ వెన్నులో జలదరింపు ప్రారంభమయ్యి, రేపు తమకు కూడా అదే గతి పడుతుందేమోనన్న  భయంతో ఉలుకూ  పలుకూ లేకుండా ఉన్న చోటే కొయ్యబారి పోయి  నిలబడి పోయారు. అయితే అందరి దగ్గర గొప్పలు ప్రదర్శిస్తూ తనే బాసుగా ఒక ప్రత్యామ్నాయకంగా  చెలామణి అయ్యే ప్రయత్నంలో తన పక్క వాళ్ళతో పనులు చేయించుకుని ఆ ఫలితాన్ని తన ఖాతాలో వేయించుకుని మేనేజ్మెంట్ దగ్గర చాలా సార్లు మార్కులు కొట్టేసే రమాకాంత్ కు నలుగురి మధ్య చెంపదెబ్బలు తిని తన పరువు పూర్తిగా పోగొట్టుకోవడంతో అతనికి తలకొట్టేసినట్టయ్యింది . ఇంతకన్నా చెడేది ఏమీ లేదని  తాడో పేడో తేల్చుకుందామని  పక్క డిపార్ట్మెంట్లోని జనాలను కూడా పోగేసి తనకు జరిగిన ఘోరమైన అవమానాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టి అతని బాస్ ద్వివేది మీద తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఈ నేపద్యంలో ద్వివేది అంటే లోపల మంటగా ఉండే ఇంకొంతమంది కూడా రమాకాంత్ కు  సహాయ సహకారాలు అందించడంతో  అతనికి ఊహించని మద్దతు దొరికేసింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవడంతో ఈ గొడవ టాప్ మేనేజ్మెంట్ దృస్టికి వెళ్లింది. ద్వివేది  ఇన్నాళ్ళు తను సంపాదించిన పేరు కాస్తా బుగ్గి పాలవుతుందన్న భయంతో  పైవాళ్లతో మంతనాలు చేసి రమాకాంత్కు ఒక ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇచ్చి అతని  నోరు మూయించాడు. .
బాసు చేతిలో దెబ్బలు తింటే  తిన్నాడు కానీ  ఏళ్ల తరబడి  కిందా మీదా పడి ఒళ్ళు హూనం చేసుకున్నా  దొరకని సువర్ణావకాశం రమాకాంత్  బిగి కౌగిలిలో బంధింపబడటంతో అందరిలో ఒక విపరీతమైన ఆలోచన ఒకేసారి కలిగింది. తాము కూడా ఏదో ఒక ప్రతిబంధకాన్ని సృష్టించి  బాసుకు  కోపాన్ని తెప్పించి  తద్వారా తమ స్వప్రయోజనాలను  నెరవేర్చుకోవడం తప్ప వేరే దారి వారికి కనిపించడం లేదు. ఇది చాలా తెలివితక్కువ ఆలోచన అని వారికి తెలిసినా ఆ క్షణంలో వాళ్ళ బుర్రలు అంతకన్నా పనిచెయ్యలేదు.
ఆ రోజు ద్వివేది ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. తను అనవసరంగా కష్టపడి తన అభివృద్దికి దోహదపడుతున్న  స్టాఫ్ మీద కోపం ప్రదర్శిస్తున్నానని ఇది కేవలం కొద్దిపాటి అనారోగ్య లక్షణాలతో తను ఇబ్బంది పడుతూ ఉండటం వల్లే తప్ప వేరే కారణాలు కావని ఈ రోజునుండి నాలో  పూర్తి మార్పు చూస్తారని, మీ అందరిలో ఒకడిగా  మసులుకుంటానని  అందరితోనూ సరదాగా గడపాలని నిర్ణయించుకున్నానని , కోపం అనేది ఆమడ దూరానికి తరిమేస్తున్నాని అందరికీ మాటిస్తున్నాను. అంటూ  బాస్ ద్వివేది భావోద్రేకంతో  డిక్లేర్ చెయ్యడంతో రమాకాంత్ లా బాసు చేత చెంపలు తడిమించుకోవాలని తాపత్రయం పడ్డ ఆ డిపార్ట్మెంట్లోని  మొత్తం ఉద్యోగస్తులందరి ఆశల ఆలోచనలపై  ఒక్కసారిగా వేడి నీళ్ళు గుమ్మరించినట్టయ్యింది. ఇంకో పక్క  ఏదో రకంగా బాసుకు కోపం తెప్పిస్తూ అలజడిని సృష్టించి రానున్న రోజులలో కూడా బాస్ బలహీనతలను వాడుకుని తన పబ్బం గడుపుకోవాలన్న రమాకాంత్ స్వార్ధ , కుతంత్రపు ఆలోచనలకు కూడా  శాశ్వతంగా బ్రేక్ పడింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!