ఆలోచనా

ఆలోచనా

రచయిత ::యం. సుశీల రమేష్

నేతిబీరకాయలో నెయ్యిని వెతికినట్లు ఇప్పటి జీవితాల్లో కూడా ప్రశాంతతను వెదకాలేమో. అన్నారు తన భార్య సరస్వతి తో రామరాజు గారు.

సెక్రటరియేట్ లో గజిటెడ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యారు ఈ మధ్యనే రామరాజు గారు. సరస్వతి గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు విదేశాల్లో స్థిర పడ్డారు.
పదేళ్లయినా ఒకసారి కూడా వచ్చి తల్లిదండ్రులను చూసింది లేదు.
మనవలను మనవరాండ్రను వీడియో కాల్ లో చూస్తూ మాట్లాడటం తప్ప మనసారా ఎత్తుకుని ముద్దు చేసే భాగ్యం లేదు.

ఇప్పుడు ఏమైంది అంటూ వచ్చింది సరస్వతి. నీ పెద్ద కొడుకు ఫోన్ చేశాడు ఇక్కడున్న ఇల్లు అమ్మేసి మనిద్దరం వాళ్ల దగ్గర ఉండాలట,
అది కలిసి కాదు చిన్నొడి దగ్గర నువ్వు పెద్దోడి దగ్గర నేను, ఎలాగూ రిటైర్ అయ్యాము కాబట్టి, ఇల్లు అమ్మిన డబ్బులు ప్రావిడెంట్ ఫండ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ల దగ్గర చేతులు కట్టుకుని కూర్చోవాలి కాబోలు వెధవ తెలివితేటలు.

డబ్బుల కే తప్ప మనుషులకు విలువ లేకుండా పోయింది.
ఎందుకు చదువుకున్నారో అర్థం కాదు సంస్కారం లేని చదువులు.
జీవితంలో బొత్తిగా ప్రశాంతత లేకుండా పోయింది.

ఇలాంటి పిల్లలు పుట్టకపోయినా నేను బాధపడే వాడిని కాదు సరస్వతి. డబ్బు తప్ప జీవితంలో ఇంకేమీ అవసరం లేదా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.

మనం ఓ నలుగురు పిల్లలను చదివిస్తే ఎలా ఉంటుంది. మనం చచ్చామా బ్రతుకామా అని కూడా చూడని మన అత్యాశ పరులైన
మన పిల్లలకు, మనం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి సంపాదించిన సంపాదన వారికి ఇవ్వడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అని అన్నారు రామరాజు గారు.

నువ్వేమంటావ్ సరస్వతి అని అడిగారు రామరాజు గారు.
నా మనసులో కూడా ఇదే ఆలోచన ఉందండి. కానీ మీరేమంటారో నని బయటకి చెప్పలేదు మీరు బయట పడ్డారు అంతే అంటుంది సరస్వతి.

ఏమాటకామాటే చెప్పుకోవాలి ఆరు పదుల వయసులో కూడా ఈ దంపతులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.

అన్నట్టుగానే పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన అనాధ విద్యార్థులను ఎంచుకుని వారిని ఇంటికి తీసుకు వచ్చి వాళ్ల ఆసక్తిని బట్టి చదివించడం మొదలుపెట్టారు.
వీళ్ల ఇంట్లోనే బస ఏర్పాటు చేశారు.
రామరాజు దంపతులు. ఆ పిల్లల్లో వీరి ఇంటి పనిమనిషి మంగమ్మ కొడుకు కూడా ఉన్నాడు.

ఆ నలుగురు పిల్లలు వీరి ఇంటికి వచ్చాక, ఆ ఇంటి కళ మారిపోయిందని చెప్పాలి, ఎందుకంటే రామ రాజు దంపతులు ఇన్నేళ్లు ఒంటరిగా బ్రతికిన బ్రతకును ఒక చిన్న ఆలోచన తో మారిందనే చెప్పాలి.

పిల్లలు రామరాజు గారు కలిసి వారి ఇంటి పెరట్లో రకరకాల కూరగాయలు, పూల మొక్కలు చక్కగా పెంచుతున్నారు.

పిల్లలు కూడా చక్కగా శ్రద్ధగా చదువు కుంటూ రామరాజు గారు చెప్పే విలువైన మాటలను ,ఔపాసన చేసుకుంటున్నారు.

“బ్రతకడం అంటే నేను నా కుటుంబం అని కాదు నేను అనే స్వార్థం వీడి మనతో పాటుగా మరొకరి జీవితాన్ని వెలిగించ గలగాలి. ఒకరి మోచేతికింద ఎప్పుడూ బ్రతకాలని ఆశించకూడదు, మనకు దొరికిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు, అంటూ ఎన్నో ఆణిముత్యాల్లాంటి మాటలను పిల్లలకు చెప్పే వారు రామరాజు గారు .

ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. హరీష్ ,గిరి ,గీత ,రాధిక.
వీరంతా కూడా ఇంటర్లో ప్రథమశ్రేణిలో పాసయ్యారు.

ఇద్దరూ నీట్ రాస్తే ఇద్దరు ఎంసెట్ రాసి వంద లోపు ర్యాంకు లో పాసయ్యారు. ప్రముఖ కాలేజీలో జాయిన్ చేశారు రామరాజు గారు నలుగురిని.

పిల్లలు కూడా దిక్కులు చూడకుండా తమకు దొరికిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా శ్రద్ధగా చదువుకుంటున్నారు.

ఇంటి పనిలో సాయం చేస్తూనే చదువు కూడా శ్రద్ధగా చక్కగా చదువుకుంటున్నారు పిల్లలు.

నాలుగేళ్ల తర్వాత ఉదయం పేపర్ చూసినా రామరాజు గారు సరస్వతి సరస్వతి అంటూ పిలిచారు పేపర్లో ప్రకటన చూసిన ఇద్దరు ఎంతో సంతోషించారు . ఇంజనీరింగ్ చదివిన హరీష్ గిరిని పిలిచి ఎంతగానో మెచ్చుకున్నారు ఇద్దరు ఫస్ట్ సెకండ్ ర్యాంకు లలో పాసయ్యారు. రెండు నెలల తర్వాత హరీష్ కి గిరి కి ఉద్యోగాలు వచ్చాయి. వారిద్దరూ ఐదంకెల జీతగాళ్ళు.

మరో సంవత్సరం తర్వాత ఆడ పిల్లలు కూడా ఎంబిబిఎస్ పాసయ్యారు. ఆ వార్త తెలిసిన మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ కోసం వచ్చారు. గీతా ,రాధిక ,హరీష్ ,గిరి
నలుగురు మీడియా వాళ్లకు చక్కగా సమాధానాలు చెప్పారు.

మమ్మల్ని కన్నవారు ఎవరో తెలియదు. కానీ నీ దేవుడు ఇచ్చిన ఈ తల్లిదండ్రులు మాకు బంగారు బాటను చూపారు వారి బాటలోనే మేము కూడా నడుస్తాము అని చెప్పారు మీడియా వాళ్ళు వెళ్ళాక.

నలుగురు పిల్లలు తమ ఆలోచన చెప్పారు.
నలుగురు కూడా ఒక్కొక్కరిని చదివిస్తామని చెప్పారు.
పిల్లల ఆలోచన విన్న రామరాజు గారు సరస్వతి ఎంతో సంతోషించారు.

చాలు ఈ జీవితానికి నాకు ఇంకేం అవసరం లేదు. నేను వెలిగించిన దీపాలు, మరొకరి జీవితంలో వెలుగును పంచుతాయి.
ఈ జీవితానికి ఈ ప్రశాంతత చాలు అంటూ పిల్లల్ని అభినందించారు రామరాజు గారు.

వస్తారు వస్తారు అనుకున్న కన్నబిడ్డలు ముఖం చాటేసిన ఆ తల్లిదండ్రులు కుంగిపోలేదు కానీ మరో నలుగురి జీవితాల్లో వెలుగు నింపారు ఒక చిన్న ఆలోచన ఎన్నో జీవితాలను మారుస్తుంది అనడానికి నిదర్శనంగా నిలిచారు.

*** సమాప్తం****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!