రూపేచ దేవత

రూపేచ దేవత

రచయిత ::శ్రీ ధూర్జటి

“డాడీ …!!కనుక్కున్నారా …!!”
అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన తండ్రిని అడిగింది సింధు. వేసుకున్న షూ ను విప్పుతూ “ఆఁ…సాంబమూర్తి కిఫోన్ చేశాను తల్లి… ఆ ఊరు చాలా చిన్నదట…రిమోట్ ఏరియా… అక్కడ నుండి టౌన్ కి రావడానికి దాదాపు అరగంటపడుతుందట…ఆనియోజకవర్గఎమ్మెల్యేకిసంబంధించిన ఊరు అవడంవల్ల అక్కడ ఎస్.బి.ఐ. బ్రాంచి పెట్టారట” చెప్పాడు రామకృష్ణ.
“ఇల్లు దొరకదా…!! ”
“ఏమో ప్రయత్నిద్దాం… అన్నాడు మూర్తి. అక్కడ ప్రైమరీ స్కూలు ఈ బ్యాంకు మాత్రమే ఉన్నాయట, బస్ ఫెసిలిటీ అంతంతమాత్రంగా ఉంటుంది… ఊర్లోకి వచ్చే ఎంప్లాయిస్ ఓన్ వెహికల్స్ లోవస్తారని చెప్పాడమ్మ” అంటూ లోపలకు అడుగుపెట్టాడు రామకృష్ణ. అతన్ని అనుసరిస్తూ…
“మనం కూడా అలానే చేద్దామా…”! అడిగింది సింధు .
“ఒక్క నెల రోజుల్లో ట్రాన్స్ఫర్ అవుతుందన్నాడు కదా శేఖరు. ఈ నెలకు ఎలాగోలా ఆ ఊరిలోనే సర్దుకొమ్మా…! ఎందుకంటే నువ్వు జర్నీ చేయలేవురా…అదిగాక అక్కడ రోడ్లన్నీ ఎలా ఉంటాయో… ఏమో …”అన్నాడు భార్య ఇచ్చిన మంచినీళ్లు త్రాగుతూ.
” అలాగే …”అంటూ తలూపింది నెమ్మదిగా సింధు.
సింధు రామకృష్ణ ,శ్రీదేవి లకు ఏకైక సంతానం. రామకృష్ణ పిడబ్ల్యుడి లో ఇంజనీర్ గా. శ్రీదేవి స్త్రి,శిశు సంక్షేమ శాఖలో అఫీషియల్ పోస్ట్ లో పనిచేస్తున్నారు .పోయిన సంవత్సరమే బీటెక్ పూర్తి చేసింది సింధు .కాలేజీలో టాపర్ గా నిలిచింది .సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయించడం ఇష్టం లేక రామకృష్ణ బ్యాంక్ కోచింగ్ ఇప్పించాడు. ఇంతలో మంచి అలయన్స్ వచ్చేసరికి శేఖర్ తో పెళ్లి చకచకా జరిగిపోయింది .తర్వాతి నెలలోనే ఎస్ .బి .ఐ లో పీ.వో గా సెలెక్ట్ అయి నెల్లూరు జిల్లాలో ఒక రిమోట్ విలేజైన చిన్న అన్నలూరు కు పోస్టింగ్ వచ్చింది. సింధుకి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కన్నా పోస్టింగ్ ప్లేస్ వల్ల అందరూ దిగులు పడ్డారు .జాయిన్ అవ్వాల్సిన రోజుకు ముందు రోజే ఆ ఊరికి ప్రయాణమయ్యారు సింధు ,రామకృష్ణ, శేఖర్ . రామకృష్ణ స్నేహితుడు సాంబమూర్తి నెల్లూరు లో ఉంటాడు. అతను కావలిలో వారిని కలుసుకున్నాడు. ఊర్లోకి అడుగు పెట్టింది కారు .చుట్టూ గడ్డివాములు పశువుల వాసనతో స్వాగతం పలికిందాఊరు. విజయవాడలో పుట్టి పెరిగిన సింధుకు మారుమూల ఉన్న ఆ చిన్న పల్లెటూరు చికాకును కలిగించింది .గడ్డి,దుమ్ముతో కలిసిపోయిన రోడ్డు పేడ తో అలికినట్టుగా అనిపించింది. ఇంతలో కారుకు అడ్డంగా వస్తున్న గేదెల గుంపును అదలిస్తున్న ఒక్క వ్యక్తి కనిపించాడు. మాసిన లుంగీ ని ఎత్తి మడిచి కట్టుకొని ఉన్నాడు. పైన టవల్ తప్ప మరి ఏ ఆచ్ఛాదనా లేదు . ఒక చేతిలో కర్ర మరో చేతిలో ఒక పెద్ద స్ప్రైట్ బాటిల్ కు గుడ్డ చుట్టి దానికి తాడు కట్టి దానిలో మంచినీళ్లు పోసుకుని పట్టుకొని ఉన్నాడు. అతన్ని ఆపి సాంబమూర్తి “బాబు …!బ్యాంక్ ఎక్కడ..!?” అని అడిగాడు. నోట్లో నములుతున్న పుల్లను తీసి పక్కకు ఉమ్మేసి “సాయిగా బొయ్యా …కుడి పక్కకు దిరుగు” అని చెప్పి “హే… హే” అంటూ వెళ్ళిపోయాడు. శేఖర్ కారును నేరుగా పోనిచ్చి బ్యాంకు దగ్గర ఆపాడు .
బ్యాంకులో సింధు కాక మరోముగ్గురు ఎంప్లాయిస్ ఉన్నారు .వారు ఎదురు వచ్చి నవ్వుతూ సింధు వాళ్ళను లోపలకు తీసుకుపోయారు వారికి ట్రీట్ ఇచ్చిన అనంతరం సింధు
కో ఎంప్లాయి అయిన రాజును
“సర్ ..!ఇక్కడ రూములు దొరుకుతాయా …!?”అని ఆడిగింది
“ఏమో మేడం …! మేమందరం కావలి నుండి వస్తాం .”అని చెప్పాడు అతను. ఇంతలో బ్యాంకు లోకి వచ్చిన రామిరెడ్డి “మా ఇంటి కాడ కొత్తగా ఒక ఇల్లు కట్టారు సార్ …!ఆడ ఒక గది మీకివ్వచ్చు ” అన్నాడు .
“ఎక్కడ …!?దగ్గరేనా …!?”ప్రశ్నించాడు శేఖరు .
“ఆఁ…ఈడ్నే… దాండి…” అంటూ వారిని చిన్నచిన్న సంధులు తిప్పుతూ ఒక ఇంటి ముందు ఆపాడు .ఆ ఇల్లు కొత్తది ,చిన్నది ,బాగుంది .దాదాపు పదకొండు గంటలు అవడంతో దాదాపు ఇళ్లలో ఎవరు కనిపించడం లేదు. అందరూ పనులకు పొలాల్లోకి పోయినట్టున్నారు. ఆ ఇంటి ఓనరు, వాళ్ళ ఆవిడ కూడా ఇంట్లో లేరు.
వాళ్ళ అమ్మాయి ని గట్టిగ పిలిచాడు రామిరెడ్డి .పిలవడం అనేకన్నా అరిచాడు.
“మే రాంలచిమా…!!ఒమే …రాం లచిమా…! యాడున్నావ్…” అంటూ. “ఆఁ…వత్తుండా…!!” అంటూ ఒక్క అమ్మాయి పరుగు పెడుతూ వచ్చింది. ఆమెను చూడగానే
సింధుకు ఒక రకమైన ఇరిటేషన్ ఏర్పడింది .ఆమె లావుగా ,నల్లగా పొట్టిగా దిబ్బ లా కనిపించింది. మందపాటి ముఖం ,చిర్ర వెంట్రుకలు వాటిని గట్టిగా దువ్వి జడ వేసుకుంది. ఆమె కనుగుడ్లు కొద్దిగా ముందుకు వచ్చినట్లుగా ఉన్నాయి . లావు పెదాలు,బండముక్కు,ముఖం జిడ్డు,జిడ్డు గా ఉంది. ముఖాన బొట్టు లేదు చెవులకు ఎలాంటివి లేవు, మెడలో ఒక మాసిన తాడు ఉంది .అది పసుపు తాడు అయ్యుండొచ్చు.
చీర కుచ్చులు పైకి దోపుకుని , మోకాళ్ళ వరకు కనపడుతూ, పైట చెంగును గట్టిగా లాగి చుట్టి బొడ్లో దోపుకొని ఉంది .వగరుస్తూ ముఖం పై పడిన వెంట్రుకలను తోసుకుంటూ
“ఏంది మావాఁ …?”అంటూ మొత్తం నవ్వును ముఖానికి పులుముకొని అడిగింది .
“మీ నాయన ఏడిమేఁ… చేలో కి పోయిండా…!!?”
“ఆఁ…ఇప్పుడే …ఎందుకా…!!?”
” ఈ మేడం కి రూమ్ కావాలంట, మీ ఇల్లు ఇస్తారేమోనని …!!”
“ఉండు మావఁ…!!పిల్చు కొస్తా…!” అంటూ పరుగు పరుగున వీధిలోకి పరుగు పెట్టింది. దాదాపు పది, పదిహేను నిమిషాల తర్వాత తండ్రి కూతురు ఇద్దరు వచ్చారు .
“ఒరేయ్ …శేషయ్య…! ఈ మేడం కి చిన్న గది కావాలంట రా …!!”అన్నాడు రామిరెడ్డి.
” సరేలే బావ అట్టే ఇద్దాం లే….!!” అన్నాడు శేషయ్య .ఇంట్లోకి తీసుకు పోయాడు .వరండా తో సహా కలిపి మొత్తం మూడు భాగాలుగా ఉందా ఇల్లు .వెనుక వాకిలి ఉండడంతో మధ్యలో తలుపేసి ముందు రూమును సింధుకి అద్దెకిచ్చారు. బాత్ రూమ్ ,టాయిలెట్ పక్కనే చిన్న సందు లో ఉన్నాయి. రూమ్ బాగానే ఉంది .తన లగేజీ దించుకుంది సింధు. లగేజ్ సర్ది సింధుకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు రామకృష్ణ వాళ్ళు. వాళ్ళు వెళ్ళిన తరువాత కొంతసేపటికి వాకిట్లో అలికిడికి బయటకు వచ్చింది సింధు .ఎదురుగా రామలక్ష్మి .
ఆ అమ్మాయిని చూసిన సింధుకు ఎలా రెస్పాండ్ అవ్వాలోఅర్థం కాలేదు .ఎందుకంటే ఆ అమ్మాయిని పలకరించడానికి కూడా ఒప్పుకోవడం లేదు తన మనసు.
ఒకవైపు తను చేస్తున్నది తప్పని సంస్కారం చెబుతున్నా మనసే డామినేట్ చేస్తున్నది .రామలక్ష్మి తన వంకర పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతున్నది .కనుబొమ్మలు ముడిచి ఏంటన్నట్టు చూసింది సింధు. వంకర్లు తిరుగుతూ
” నీకు మంచి నీళ్లెట్టా ..!!?” అంది. నిజమే కదా అనుకుంది సింధు. సింధు మాట్లాడే లోపలే వెనుకకు పోయి ఒక మంచి నీళ్ళ బిందె చంకనెత్తుకొని వచ్చి నిలబడింది .సింధు పక్కకు జరిగేసరికి నేరుగా లోపలికి పోయి దించి అలానే నిలబడి రూమును ,సింధును తేరిపార చూస్తూ”అక్కా..!! నీతో వచ్చింది ఎవరా…!?” అని అడిగింది.
” మా నాన్నగారు, అంకులు ,
మా వారు” అంది సింధు. “నీకుపెళ్లిఅయ్యిందా …!!?”ఆశ్చర్యంగా అడిగింది రామలక్ష్మి .
“ఆఁ …”అంది.
” ఆ యన్న ఏం చేస్తాడు…!?” మళ్లీ ప్రశ్నించింది .సింధుకు కోపం వస్తున్నది. దానికి తోడు ఆమె మాటలు
చాలా మొరటుగా ఉన్నాయి .”అన్నా… ఏంటి…!!? నేను అక్క, తను అన్నా…!!?” చిర్రెత్తుకొచ్చింది సింధుకి. సింధూ మౌనం చూసి “ఆ యన్న కూడా ఉద్యోగం చేస్తాడా…!!?” అని అడిగింది రామలక్ష్మి .అవునన్నట్లు తలూపింది సింధు.
“అక్కా… !!అన్నం యెట్టా …!!?”మళ్లీ అడిగింది రామలక్ష్మి .
“ఈరోజుకు తెచ్చుకున్న ,రేపట్నుంచి చేసుకుంటా…” అంది పొడిపొడిగా త్వరగా ఆ అమ్మాయివెళ్ళిపోతే బాగుండుననిపిస్తున్నది సింధుకు .”నేను రోజూ… మాయమ్మ, నాయనకి చేసి చేలో కి తీసుకెళ్తా… నీకు కూడా చేస్తాలే …. నువ్ కష్ట పడబాకా…!!” అంటూ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది రామలక్ష్మి. వెళ్లడమే తడవుగా తలుపు వేసుకుని సింగిల్ కాట్ పై పడుకొని కళ్ళు మూసుకుంది.
కళ్ళు మూసుకున్నా …రామలక్ష్మి రూపం కళ్ళలో ప్రతిబింబిస్తున్నది .ఛీ… అనుకుంటూ దిండు లో ముఖం దాచుకుని పక్కకు తిరిగి పడుకున్నది సింధు .ప్రక్క రోజు తెల్లవారే నిద్రలేచింది సింధు .
“ఎర్లీ టు బెడ్ …ఎర్లీ టు రైస్ “అనేది సింధు బాగా పాటిస్తుంది .వేడివేడి కాఫీ కప్పు చేతపట్టుకొని కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది .కిటికీలోంచి రామలక్ష్మి వాళ్ల పశువుల దొడ్డి బాగా కనిపిస్తున్నది. దాదాపు ఆరేడు గేదెలు, వాటి దూడలు ,రెండు ఎద్దులు చాలా పశువులే ఉన్నాయి .రామలక్ష్మి పెద్దబుట్ట తీసుకుని ప్రతి గేదె దగ్గర శుభ్రం చేస్తూ … ఆ చెత్త నిండిన బుట్టను నెత్తి మీద ఉంచుకొని పరుగులాంటి నడకతో దిబ్బలో పోస్తున్నది .ఒంటినిండా బట్టలు ఉన్నా అవి చెదిరి సగ భాగం శరీరం కనిపిస్తున్నా… ఆమెకు ఆ సృహ కూడా లేదు.సింధుకి ఆమెను చూస్తుంటే చిరాకేస్తున్నది .కోపం వస్తున్నది .కానీ ఏదో మూల పాపమనే సానుభూతి ఒక్క సన్న గీర లా మెదిలింది.
సింధు రెడీ అయి వాకిట్లోకి వచ్చింది. రామలక్ష్మి ఎదురుపడింది .
“ఇక్కడటిఫిన్ఎక్కడదొరుకుతుంది..!?” అడిగింది సింధు. “ఈ యీది చివర మూలమీద సుబ్బమ్మ నాష్టా చేస్తది …అక్కా…! యిట్టీ… నేను తెచ్చిస్తా …!!”అంది చనువుగా .
“ఆహాఁ …వద్దులే… నేనే వెళ్తాను” అంటూ గేటు దాటి బయటకు వచ్చింది సింధు. సుబ్బమ్మ కొట్టు కనిపిస్తూనే ఉంది .సింధు నేరుగా అక్కడికి వెళ్ళి దోస, బోండా కట్టించుకుని వచ్చింది. లోపలికి వచ్చిన సింధుకి ఇంట్లో ఒక చిన్న స్టూలు, దానిపై ఒక ప్లేటు, గ్లాస్ తో నీళ్ళు పెట్టి ఉన్నాయి .టిఫిన్ ముగించిన సింధు ప్లేట్ ని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది కడగడానికి .చేతిలో ఉన్న ప్లేట్ ను విసురుగా లాక్కొని “నేను కడగతాలే .…నువ్వు ఫో…” అంది రామలక్ష్మి .ఆ స్పీడు తట్టుకోలేకపోతోంది సింధు. ఏమనాలో తోచక అక్కడినుండి రూము లోకి వచ్చేసింది. ఇండక్షన్ స్టవ్ మీద రైస్ పెట్టి షాపులో తాను తెచ్చుకున్న న్యూస్ పేపర్ చదువుతూ కూర్చుంది సింధు. అన్నం అయ్యాక అమ్మ పంపిన పచ్చడో… పొడి నో…వేసుకొని మేనేజ్ చేస్తే పోలా …” అనుకొని పేపర్ లో నిమగ్నమైంది .ఇంతలో ఒక చిన్న గిన్నెతో ప్రత్యక్షమైంది రామలక్ష్మి .
“అక్కా…” అంది .ఆ గొంతు వింటేనే నరాలు తెగిపోతున్నాయి సింధుకి. ఉలిక్కిపడి తల తిప్పి చూసింది .
“ఇదో కూర… ఇప్పుడే చేసినా… నువ్వు తొందరగా ఎల్లి పోతావని…
ఈడ పెడుతున్నా… ఆఁ…” అంటూ ఒక చిన్న గిన్నెను అక్కడ పెట్టి వెళ్ళిపోయింది .
“ఎవరడిగారు ఈ పిల్లని ..! ఆఁ…అడక్కుండా ఎందుకు …!!??”చాలా చాలా కోపంగా ఉంది . “ఛీ… వద్దు ఫో…తీసుకు ఫో…” అని చీవాట్లు పెట్టాలని ఉంది .కానీ ఆమె లేదక్కడ .అన్నం అయింది. బాక్సు సర్దుకుంది .అమ్మ ఇచ్చిన టమోటా పచ్చడి పెట్టుకుంది .ఎందుకో పాపం అనిపించి రామలక్ష్మి ఇచ్చిన వంకాయ బజ్జి ని కూడా క్యారేజ్ లో పెట్టుకుని బ్యాంకు కు బయలుదేరింది. బ్యాంకులో మొదటిరోజు చాలా బాగా జరిగింది .మధ్యాహ్నం భోజనాల టైము రానే వచ్చింది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒకరివి ఒకరు పంచుకుంటూ తింటున్నారు. రామలక్ష్మి వంకాయ బజ్జి ని (వంకాయ బజ్జి నెల్లూరు గ్రామాల స్పెషల్) అందరికీ పంచింది సింధు .”మేడం…!! సూపర్… వావ్ …వాటే టెస్ట్” అన్నారు అందరు. అది విన్న సింధు కూడా వేలుతో తీసుకుని నాలుకకు రాసుకుంది .”నిజమే చాలా బాగుంది” అనుకుంటూ కలుపుకొని తిన్నది. సాయంత్రం ఇంటికి చేరుకున్న సింధు కు రామలక్ష్మి కనిపించింది .థాంక్స్ చెప్పాలని ఉన్నా ఎందుకో ఆమెకు చెప్ప బుద్ధి కాలేదు. ఎందుకో…!! ఏమో…!! ఆమె తనకు ఏ…విషయంలోనూ నచ్చడం లేదు. కొద్దిసేపటి తరువాత వేడివేడి చిక్కటి పాల గ్లాసుతో ఎదురుగా వచ్చి నిలబడింది రామలక్ష్మి తల్లి. ఆమెను చూసి నవ్వుతూ “రాండాంటీ …!!కూర్చోండి …!”అంది సింధు .
“చూడు తల్లి … మా కాడ చాలా బర్రెలున్నాయి …నువ్వు పాలు కొనాల్సిన అవసరం లేదు… కావలసినన్ని తీసుకో… మాయమ్మీ… ఇంటి కాడే ఉంటద్ధి..” అంది ఆమె .
“ఆ పర్వాలేదాంటీ… వేరే వాళ్ల కైనా డబ్బులు ఇవ్వాలి కదా …!!మీకే ఇస్తాను…” అంది మొహమాటంగా
“వద్దమ్మా …నీపాలెంత …!!?”అంది ఆమె నవ్వుతూ …”అమ్మ …!!మీరెంత మంది అమ్మకి ..”అడిగింది చనువుగా. “నేను ఒక్కదాన్నే ఆంటీ …!!”అంది సింధు .
“నాక్కూడా ఒక్కటే నమ్మ… కానీ దాని రాత బాగా రాయల దేవుడు ”
” ఏమి …!!? అని అడగాలనివున్నా అడగలేదు సింధు. కానీ ఆమె తిరిగి చెప్పింది “పెళ్లయిన రెండో రోజే ఆడు దాన్ని వదిలేసాడమ్మా…!తాళి కట్టే నాడు తెలీలేదా… వాడికి …ఆయమ్మి బాగాలేదని ఆఁ… బిడ్డను పారేసుకోలేం కదమ్మా….

నాటినుంచి మా కాడనే ఉంటున్నదమ్మ …”అని చెప్పి కళ్ళు ఒత్తుకుంటూ ఆమె వెళ్ళిపోయింది. పాపం అనిపించింది సింధుకి .ఇంతలో శేఖర్ నుంచి ఫోను “ఎలా ఉన్నావ్ …!!?”
“పర్లే బానే ఉన్నా ….!!”
“బ్యాంక్ బాగుందా ….!!?”
“ఆఁ…అన్నీ బాగున్నాయి శేఖర్… ఒక్క ఆఁ పిల్ల తప్ప… చూడాలంటేనే భయంగా ఉంది .”
నవ్వుతూ
“నాకు అలానే అనిపించింది సింధు…! కానీ పాపం కదా !” అన్నాడు శేఖర్.
“అదే శేఖర్…!! నాకు అలానే అనిపిస్తున్నది…” అన్నది సింధు.
అనేక విషయాలు మాట్లాడుకుని బై చెప్పుకున్నారు .
ఇలా పది ,పదిహేను రోజులు గడిచి పోయినాయి. రోజురోజుకు రామలక్ష్మి ప్రవర్తన పట్ల సింధుకు విసుగు పెరుగుతున్నదే గాని తగ్గడం లేదు.
ఆరోజు ఆదివారం పొద్దున్నే లేవబుద్ధి కాలేదు సింధుకి .ఒళ్లంతా ఒకటే నొప్పులు .జ్వరం తగిలినట్టుగా ఉంది. దాదాపు తొమ్మిదున్నర …పది అవుతున్నది టైం. అప్పుడు లేచి మొహం కడుక్కుంది .వెనక్కు తిరిగి చూసేసరికి వేడి వేడి టీ గ్లాసు తో ఎదురుగా వచ్చి నిలబడి ఉంది రామలక్ష్మి .”చాలా సార్లు వచ్చానక్క…!! నువ్వు నిద్ర పోతుండావా…ఆదోరం కదా… ఎందుకులే లేపడం …అని ” అంది టీ గ్లాసు అందిస్తూ .వద్దనాలనిపించలేదు. మౌనంగా టీ గ్లాసు తీసుకుని మంచం పై కూర్చుంది సింధు .టీ త్రాగే లోపలే వాంటింగ్ చేసుకోవడానికి బయటకు పరుగు తీసింది .కానీ మధ్యలోనే వాంతయింది .నిలుచున్న రామలక్ష్మి “అక్కా…!! “అంటూ సింధును పట్టుకోవడం ఆ వాంతి ఆమెపై పడటం జరిగిపోయింది .అయినా ఏ మాత్రం ఫీలవకుండా రామలక్ష్మి సింధుని చెవులు పట్టి బయటకు తీసుకెళ్ళి శుభ్రంగాకడిగింది .బయట ఒక కుర్చీ వేసి ఆమెను కూర్చోబెట్టి లోపలంతా శుభ్రం చేసింది .తన చీరను కూడా నీటితో కడుక్కుంది .

ఏమైందక్క …!!”అంటూ సింధు దగ్గరకు వచ్చింది .సింధు కూర్చోలేక పోతున్నది .విపరీతంగా కడుపులో నొప్పి …ఏడుపు వస్తున్నది …మెలికలు తిరిగి పోతున్నది …భయమేసింది రామలక్ష్మికి .ఎవరు ఇంట్లో లేరు .వీధిలో కూడా లేరు.ఆదివారం అవడంవల్ల బ్యాంకు వాళ్లు టీచర్లు కూడా రారు .ఇప్పుడెలా…!? “అక్కా…!!డాక్టర్ని తీసుకొస్తా.. నువ్వు రా ..ఇంట్లో కూర్చో …!”అంటూ చిన్నగా పట్టుకొని లోపలికి తీసుకు పోయింది.  మంచం పై కూర్చోబెట్టి తాను డాక్టర్ కోసం బయటకు పరుగు తీసింది. దాదాపు అరగంట తర్వాత ఒకతన్ని తీసుకువచ్చింది .అతను ఆ వూరికి ఆర్.ఎం.పి .వాళ్ళ ఇల్లు చాలా దూరం. అందుకనే కొంచెం లేట్ అయ్యింది. అతను సింధుని పరిశీలించి “అమ్మ ..!! నొప్పి ఎక్కడ …!?”అని అడిగాడు. “అబ్డామిన్ కు రైట్ సైడ్ సార్ …”అంటూ చేతి తో చూపించింది. “కొద్దిగా నావల్ కింద …”అంటూ ఊపిరి బిగబట్టి చెప్పింది .అతను నొక్కి చూసాడు. ఓర్చుకోలేక పోయింది . “రాత్రి  ఏమి  తిన్నారమ్మా…!!?” అడిగాడు. “ఏమి తీసుకోలేదు సార్ …!! ఏమీ ఆకలిగా లేకుంటే మంచినీళ్లు తాగి పడుకునే సా …”అంటూ పొట్టను చేత్తో పట్టుకుని ఒంగుతూ మాట్లాడుతున్నది సింధు .సింధు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడుస్తున్నది. “అవునా …అమ్మ మనం వెంటనే టౌన్ కు పోవాలి …మీ సింటమ్స్  చూస్తే నాకు ఏదో అనుమానం గా ఉంది …ఆఁ…” అన్నాడు. ” “అవునా …సారు ..మా నాయన కూడా లేడు …మీరూ రాండి సారూ…!!” అంటూ బతిమాలింది రామలక్ష్మి .సరేనని ఒప్పుకొనేంత వరకు ఆమె అతన్ని విడిచి పెట్టలేదు. వెంటనే ఇంట్లోకి పోయి బీరువా లో దాచిన మూడువేల రూపాయలు తీసుకొని ఆటో మాట్లాడుకుని వచ్చింది. “దాక్కా…!!నీ ఫోన్  ఏదా …!!?సారోళ్లకు చేద్దాం…!!” అంటూ చనువుగా సింధు ఫోన్ వెతికి తీసుకుంది .సింధుని ఆటోలో కూర్చోబెట్టి తలుపుకు తాళం వేసి, దగ్గర్లో ఉన్న చింత చెట్టు కింద ఆడుకుంటున్న మహేష్ ని పిలిచి “రేఁ …మహేషా…!! బ్యాంక్కకు బాగా లేక నేను కావలికి తీసుకు పోయానని మా యమ్మకు చెప్పు …,”అంటూ సింధు పక్కన వచ్చి కూర్చుంది. ఆర్.ఎం.పీ డాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు .ఆటో వేగంగా పోతున్నది .సింధుకు రామ లక్ష్మి ని చూస్తే  ఆశ్చర్యంగాను, గొప్పగాను అనిపించింది .తాను ఆమెను ఎంత విసుక్కున్నా ఇంత ప్రేమ ఎలా చూపగలుగుతుంది .తాను ఆమె బాహ్య రూపాన్ని చూస్తున్నది …అంతః సౌందర్యం  గమనించలేక పోతున్నది… తాను చదువుకున్న నిరక్షరాస్యులుగా అనిపించింది సింధుకు .మాట్లాడే శక్తి లేదు. కళ్ళు మూతలుపడుతున్నాయి. రామలక్ష్మి ఒళ్లోకి జారిపోయింది సింధు. ఆటోను ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్ కు తీసుకువెళ్లారు. ఒంటి గంట గా వస్తున్నది .ఆదివారాలు హాస్పిటల్స్ ఒక్కపూట మాత్రమే ఉంటాయి. అదృష్టం వీళ్ళు వెళ్లేసరికి డాక్టర్ సతీష్ హాస్పిటల్ లోనే ఉన్నారు. వెంటనే టెస్ట్ చేయడం, అబ్డామినల్ స్కాన్ తీయడం జరిగింది .బయటకు వచ్చిన డాక్టరు ఆర్.ఎం.పి తో “ఇన్ టైమ్ లో తీసుకొచ్చారు సార్ …!ఇంకొంచెం ఆలస్యమైతే అపెండిక్స్ రప్చర్  అయిఉండేది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అంటూ హడావిడిగా “ఆపరేషన్ ఏర్పాటు చేయండి “అని నర్సులకు పురమాయించాడు.” సారు…!! అక్క వాళ్ళ ఇంటికి పోను చేయండయ్యా …!!”అంటూ పెద్దగా ఏడుస్తున్నది రామలక్ష్మి. ఆపరేషన్ అనేసరికి  భయపడిపోయింది .”సరే…!!” అంటూ సింధు ఫోన్ నుండి శేఖర్ కు ఫోన్ చేశాడు ఆర్.యమ్ .పి .డాక్టరు. “హలో…” ” హలో ….సింధు ….!!సార్…!! మీరెవరు …!!?” “సార్ …నేను  ఆర్.ఎం.పీ డాక్టర్ ను నా పేరు మల్లికార్జున .మేడం గారికి కడుపులో నొప్పి వస్తే కావలి లో చేర్పించాం సార్ …24 గంటల కడుపులో నొప్పని…. ఆపరేషన్ చేయాలట  మీరు కదిలి  రావాలి సార్…!!” అంటూ వివరించాడు. “అయ్యో …!!అవునా…!! ఇదిగో బయలుదేరుతున్నాం ” అంటూ ఫోన్ పెట్టేసాడు శేఖర్ .దాదాపు సాయంత్రం నాలుగున్నరకు హాస్పిటల్ ముందు ఆగింది కారు .హాస్పిటల్ మెట్లమీద ఒంటరిగా ఏడుస్తూ… కళ్ళు వాచిపోయి …ముఖం  ఉబ్బిపోయి కూర్చోనుంది రామలక్ష్మి .శేఖర్ వాళ్లను చూడగానే పైట చెంగు నెట్టుకుంటూ పరుగులాంటి నడకతో కారు దగ్గరకు పోయింది .”అక్కకి ఆపరేసను చేసారు సార్ … అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. “ఆర్.ఎం.పీ.డాక్టర్ఏడమ్మా …!!?”అడిగాడు రామకృష్ణ . “పనుందని వెళ్ళిపోయాడు సారు…” అంది ఏడుస్తూనే .సింధు సంగతి అటుంచి రామలక్ష్మి ని చూడగానే కుటుంబ సభ్యులకు ఏడుపొచ్చింది. “అమ్మ …పాపెక్కడా …!!? “అడిగింది శ్రీదేవి కళ్ళు తుడుచుకొంటూ .అందరూ విషణ్ణవదనాలతో హాస్పిటల్ లో కి ప్రవేశించారు. సింధుని ఇంటెన్సివ్ కేర్ లో  ఉంచున్నారు .డాక్టర్ను కలిశారు రామకృష్ణ ,శేఖరు . “సార్ …!!ప్రమాదం తప్పింది .ఆ అమ్మాయి ఎవరో గాని మీ డాటర్ ప్రాణాలు కాపాడింది .”అన్నాడు డాక్టర్ సతీష్. బయటకు వచ్చిన రామకృష్ణ రామలక్ష్మి కి చేతులు జోడించాడు. ఎందుకో అర్థం కాలేదు రామలక్ష్మికి .లేని నవ్వు తెచ్చుకొని చిన్నగా నవ్వింది . “బోంచేసావా …!!?”అడిగింది శ్రీదేవి. “లేదమ్మా …అక్క   ఆతీరునుంటే నా కెట్టా  ముద్ద లోపలకు బోద్దా…!!?” అంది బాధగారామాలక్ష్మి. అందరూ అమ్మాయిని కృతజ్ఞతా పూర్వకంగా చూశారు. శేఖర్ ఏదైనా హోటల్ ఉందేమో చూడటానికి బయటకు వెళ్ళాడు .సాయంత్రం  ఆరు తర్వాత సింధుకి మెలకువ వచ్చింది .కళ్ళు రామలక్ష్మి కోసం వెతికాయి .ఎవరినైతే రోజూ తను చూడకూడదు అనుకునేదో  ఈరోజు ఆమెకోసంఎదురుచూస్తున్నది. డాక్టర్ పర్మిషన్ తో నలుగురు లోపలికి వెళ్లారు. తల్లి ,తండ్రి ,భర్తను చూసి సింధు కంటి కొసల నుండి కన్నీరు జలజలా కారింది. అది చూసిన రామలక్ష్మి పైట చెంగు నోట్లో కుక్కుకొని ఏడుస్తూ బయటకొచ్చి నిలబడింది. కొంతసేపటి తర్వాత శ్రీదేవి రామలక్ష్మి దగ్గరకొచ్చి చేతిని పట్టుకొని “పాప… పిలుస్తుంది …రా …!!”అంటూ లోపలకి తీసుకెళ్ళింది. రామలక్ష్మి చేతిని సింధు చేతిలో పెట్టింది శ్రీదేవి .ఇప్పటివరకు అసహ్యించుకున్న రామలక్ష్మి ముఖం తనకు ఎంతో అందంగా కనిపించింది. తనను కాలేజీలో అందరూ “కాలేజీ బ్యూటీ “అనేవాళ్లు కానీ రామలక్ష్మి ప్రేమ తత్వం ముందు తన అందం వెలసి పోయినట్లు  అనిపించింది సింధుకి. చాలా చాలా థాంక్స్ చెప్పాలని ఉంది. కానీ ఈ పరిస్థితిలో తను చెప్పలేక పోతున్నది .ఒకప్పుడు చెప్పగలిగిన రోజు చెప్పనందుకు తన మీద తనకే అసహ్యమేసింది సింధుకి .ఎదో చెప్పాలని ప్రయత్నిస్తున్న సింధుని “వద్దక్కా…!! మాట్లాడమాకా… మాట్లాడితే నొప్పి ఎక్కువవుతాది…!!” అంటూ రామ లక్ష్మి వారించింది సింధుని .సింధు చిరునవ్వుతో రామలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంది. ఇంతలో నర్సు రావడం తో రామలక్ష్మి కన్నీరు కారుతున్న నవ్వుతో సింధుకి “ఉంటానక్కా…!!” అంటూ బయటకు నడిచింది .ఒక దేవత నడిచి పోతున్నట్లుగా అనిపించింది సింధు కి. రామలక్ష్మి వెళ్లినవైపే కృతజ్ఞతగా చూస్తూ  ఉండి పోయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!