విరించినై విరచించితిని..(పాట సమీక్ష)

విరించినై విరచించితిని..(పాట సమీక్ష)

రచన: ఉండవిల్లి సుజాతా మూర్తి

సినిమా: సిరివెన్నెల
పాట: విరించినై విరచించితిని..
గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి

           సారాంశమిది అంటే‌ సాధ్యం కానంత.విశ్లేషణ పూర్తయిందని అందామనుకుంటే అవివేకమే. ఒక అంధ, ఒక మూగ పాత్రలను నాయకా, నాయికలుగా ఎంచుకుని చలనచిత్రం తీయడమే సాహసమైతే, ఆ పాత్రలపై చిత్రీకరించబడే పాటలకు సాహిత్యాన్నందివ్వడం అంటే ఆయా పాత్రల పరిస్థితులకణుగుణంగా ప్రతిబింబించబడే సాహితీ దర్పణ తయారీ సులభతరం కాదు.

              ఇహ కచేరీకి ఉపక్రమించిన సన్నివేశంలో నాయకుడి ఎత్తుగడే (సాకీ) ఉత్కృష్ట స్థాయిగల సాహిత్యమిది.ఆ బ్రహ్మ దేవుని ఆలోచనల్లోంచి పుట్టిన జీవన వేదమని, కొండ పరీవాహక ప్రాంతాల్లో మాట ప్రతిధ్వనిగా వినవస్తుందన్న అంశాన్నీ స్ప్రశిస్తూ ఆరంభించి అతని దృష్టిలోపం కాదు,అలా భావిస్తే మనకేదో కొరతేమో అన్నంత అతిశయోక్తిగా సాగిన గీతం. శ్రీ సీతారామశాస్త్రి గారి సిరా ఏం పుణ్యం చేసుకుందో ఏమోగానీ, వారి కలంలో ఒక్క సిరా చుక్కనైనా చాలనుకునే వాళ్ళలో నేనూ ఉన్నాను.

           సూర్యోదయం మొదలు ఆకాశంలో ఎగిరే పక్షులను, ప్రకృతిలోని ప్రతి అణువణువూ సత్యసమీపంగా ఆయన పాటలో ఇమడ్చడం ఆ నాయకుడు ఎంతటి సంగీత, సాహిత్య దిట్టో తేటతెల్లం చేసేరు. తానన్నీ స్వయంగా చూసిన రీతి విశ్వమనే కావ్య వర్ణను నోట పలికించేరు. నవజాత శిశువు భువిపై పడగానే క్యార్ క్యార్ అనే శబ్దాన్ని, సందర్భాన్ని అదొక ఎదర జీవితానికి తరంగం వంటిదని,కదలికల స్పందన మనసుకు మృదంగం ధ్వనిగా, భవితకు ఇదొక ప్రవాహంగా చెప్పకనే చెప్పిన సృష్టి రహస్యం. కబోధి కాదని ఖచ్చితంగా(గుడ్డిగా) మనము విశ్వసించేలా మరో బ్రహ్మలా సృష్టికి ప్రతి సృష్టి చేయించేసిన ఘనాపాటి శాస్త్రిగారు.వీణనూ నేనై వినిపించితి నీపాటనంటూ ముగిస్తూ వారేమో ఈ పాటతో చిత్రం పేరు ఇంటిపేరుగా స్థిరపడిపోయి ఖ్యాతినొందిన పాట విశ్లేషణ పదాలకందునా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!